చిట్టీల వ్యాపారంతో సంసారం ఆగం చేసుకున్న కుటుంబ కథ ఈ వారం కామన్ మ్యాన్ డైరీలో

by Ravi |   ( Updated:2022-09-03 15:17:13.0  )
చిట్టీల వ్యాపారంతో సంసారం ఆగం చేసుకున్న కుటుంబ కథ ఈ వారం కామన్ మ్యాన్ డైరీలో
X

అంతా కలిసి పోలీసుల దగ్గరికి పోయిండ్రు. కొందరు సీత వాళ్ల సొంతూరుకు పోయిండ్రు. అక్కడ ఆ కుటుంబానికి సంబంధించినవారెవరూ లేరు. 'పది లక్షలు కూడవెట్టిన, నా బిడ్డ పెళ్లి ఎట్ట చేసేది?' అంటూ రోదిస్తోంది పోచమ్మ. 'కొడుకు ఫీజు కోసం ఇండ్లలో పాచిపని చేసుకుంటూ రెండేండ్ల నుంచి పైసలు జమ చేస్తున్న. వాని సదువు ఆగమైతది' అంటూ కన్నీరు పెడుతోంది పద్మ. 'మొగని సాటుకు పైసలు దాసుకున్న ఇప్పుడు బజార్ల వడ్డయ్. నా మొగడు నన్ను సావగొడుతుండు. ఇంకా ఎన్ని దాశినవ్ తెమ్మంటుండు' అంటూ ఏడుస్తున్నది రమ. అట్ట చిట్టిల వ్యాపారం సంసారాలను ఆగం చేసింది.

అది నగరంలోని ఓ పారిశ్రామిక ప్రాంతం. ఉదయం 7 గంటలు. ఓ బస్తీలో వందలాది మంది గుమిగూడిండ్రు. మహిళలు తిట్లు, శాపనార్థాలు పెడుతున్నరు. పురుషుల చేతులలలో మొబైల్ ఫోన్లున్నయి. అందరూ రెండు నంబర్లకు ఫోన్ చేసేందుకు ట్రై చేస్తున్నరు. ఆ రెండు నంబర్లు స్విచాఫ్ వస్తున్నయి. 'నడువుబై.. టౌన్‌కు పోదాం' అంటున్నడు ఒకాయన. 'ఏం ఫాయిదా ఉండదు, మన దగ్గర ఏం సుబూత్ ఉంది?' అంటున్నడు ఇంకొకాయన. ఎవరు ఫోన్ చేసిండ్రో పోలీసు జీపు రానే వచ్చింది. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ ఇన్నోవా కారు దిగి గుమిగూడిన వాళ్ల దగ్గరకు వచ్చిండ్రు. ఓ నడి వయసు మహిళ పోలీసుల దగ్గరకు ఉరికొచ్చింది. 'పది లక్షల రూపాయల చిట్టి వేసినం సారూ, నెలకు ఇరువై వేలు కట్టినం, పిల్ల పెండ్లికి ఉన్నదని జమైతయని అనుకున్నం, దొంగ సచ్చింది ఇయ్యాల పైసలిస్తన్నది. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఔతల పడ్డది' అంటూ రోదించసాగింది. 'సరే మీరైతే టౌన్‌కు వచ్చి కంప్లైంట్ ఇయ్యుండ్రి.. ఈడ లొల్లి చేస్తే ఫాయిదా లేదు' అన్నాడు హెడ్ కానిస్టేబుల్. 'భార్యాభర్తలిద్దరూ రూ.15 కోట్లకు టోపీ వేసి పోయుంటరు సార్' అన్నడు మరొకాయన.

*

కృష్ణా జిల్లాకు చెందిన రఘు పదిహేనేండ్ల క్రితం హైదరాబాద్‌కు వలసొచ్చిండు. పారిశ్రామిక ప్రాంతంలోని ఓ పేరొందిన కంపెనీలో సూపర్‌వైజర్‌గా చేరిండు. నెలకు రూ.20 వేల జీతం వచ్చేది. దీనికి తోడు లేబర్ కాంట్రాక్టర్లతోనూ మంచి సంబంధాలుండేవి. భార్య సీత ఇంటి పట్టునే ఉండేది. అలా గడిచిపోతుండగా రఘుకు మాచర్లకు చెందిన శివతో పరిచయం ఏర్పడింది. శివ తరుచూ రఘు ఇంటికి వచ్చేటోడు. సీతను 'చెల్లెమ్మా' అంటూ ఆప్యాయంగా పలుకరించెటోడు. 'ఊరికే ఉండే బదులు చిట్టిలు నడిపితే బాగుంటది కదా?' అన్నడొకసారి. నీకు మంచి టాలెంట్ ఉంది. నువ్వు చెబితే బస్తీవాళ్లంతా వింటరు' అని కూడా అన్నడు. ఇదేదో బాగుందనుకొని సీత చిట్టిల వ్యాపారం మీద దృష్టి పెట్టింది. మొదట నెలకు రూ. 500 చొప్పున 10 వేల చిట్టి స్టార్ట్ చేసింది. పాటపాడిన వారికి వెంటనే డబ్బులు ఇచ్చేసింది. అది అయిపోగానే ఏకంగా యాభై వేల చిట్టి షురూ జేసింది. చాలా మంది ముందుకు రావడంతో యాభై వేలదే మరో చిట్టిని కూడా మొదలెట్టింది. అంచెలంచెలుగా చిట్టీల సీతగా బస్తీలో పేరు తెచ్చుకుంది. ఇగ డిపాజిట్లు కూడా సేకరించడం మొదలు పెట్టింది. వాటిని ఇతరులకు ఎక్కువ వడ్డీకి ఇవ్వడం ద్వారా బాగా డబ్బు సంపాదిస్తున్నది. తనకు లెక్కలు చూసుకోవడం ఇబ్బందికరంగా మారిందని, ఉద్యోగం మానేయమని భర్త రఘును కోరింది. మంచి కంపెనీలో హోదా కలిగిన ఉద్యోగాన్ని వదులుకొనేందుకు రఘు ఇష్టపడలేదు. సీత ఒత్తిడి, మిత్రుడు శివ సలహాతో ఉద్యోగానికి రాజీనామా చేసిండు.

*

డబ్బులు బాగా పోగవడంతో అక్కడే ఓ ఇండిపెండెంట్ హౌస్ కొన్నరు. ఇన్నోవా కారు మెయింటెన్ చేస్తున్నరు. ఓ ఆఫీసునూ ఏర్పాటు చేసుకున్నరు. రూ. 10 లక్షలు చిట్టి డబ్బులు తీసుకున్న శంకర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. ఆ డబ్బులు రావడం లేదు. డిపాజిట్లుగా సేకరించిన సొమ్మును బయటికి ఇవ్వడం ఆపి చిట్టిలలో రొటేషన్ చేయడం మొదలు పెట్టిండ్రు. ఇంతల కరోనా తగులుకున్నది. చాలా మంది ఉద్యోగాలు పోయినయి. అంతా సొంతూళ్లకు ఎల్లిపోయిండ్రు. హైదరాబాద్‌కు తిరిగి రావడం లేదు. చాలా మంది వీళ్ల దగ్గర చిట్టి డబ్బులు తీసుకున్నవారే. ఉద్యోగం లేని కారణంగా కట్టిన డబ్బులు తిరిగి ఇమ్మని అడుగుతున్నరు కొందరు. డిపాజిట్లు తిరిగి ఇచ్చేయుమంటున్నరు ఇంకొందరు. రొటేషన్ చక్రం ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లలను తీసుకొని సొంతూరుకు పోయిండ్రు. అక్కడ ఉన్న రెండెకరాల భూమిని అమ్మేసిండ్రు. యాభై లక్షల రూపాయలు వచ్చినయి. ఇప్పటికి గండం గట్టెక్కొచ్చు అనుకున్నరు. ఐదు రోజుల తర్వాత సిటీకి తిరిగి వచ్చిండ్రు. సీత కుటుంబం నాలుగు రోజులు కనిపించకపోయేసరికి స్థానికులు టెన్షన్ పడ్డరు. తిరిగి రాగానే 'పైసలు ఎప్పుడిస్తరు?' అంటూ నిలదీసిండ్రు. వారికి నచ్చజెప్పి కొందరికి డబ్బులు ఇచ్చేసిండ్రు సీత దంపతులు.

*

డిపాజిటర్లకు దాదాపు రెండు కోట్లు ఇవ్వాల్సి ఉంది. చాలా మంది మరుసటి రోజు ఉదయమే ఇంటికి వచ్చిండ్రు. డబ్బులు ఇవ్వాలని అడిగిండ్రు. ఉన్నదానిలో కొంత వారికి సర్దిండ్రు. ఒక్కలకే దాదాపు రూ.70 లక్షల వరకు ఇవ్వాల్సి ఉండటంతో రహస్యంగా ఇంటిని అమ్మేసిండ్రు. అదే రోజు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఇక అమ్మేందుకు ఆస్తులేం లేవు. ఆ రాత్రికి ఇంటిని ఖాళీ చేసిండ్రు. కారును అక్కడే ఇడిసిపెట్టి ఎల్లిపోయిండ్రు. 'వందకు ఐదు రూపాయల మిత్తి వస్తదంటే ఇచ్చినం. గింత అన్యాయం చేస్తరనుకోలే' అంటూ మిగిలినవారు ఏడుపందుకున్నరు. అంతా కలిసి పోలీసుల దగ్గరికి పోయిండ్రు. కొందరు సీత వాళ్ల సొంతూరుకు పోయిండ్రు. అక్కడ ఆ కుటుంబానికి సంబంధించినవారెవరూ లేరు. 'పది లక్షలు కూడవెట్టిన, నా బిడ్డ పెళ్లి ఎట్ట చేసేది?' అంటూ రోదిస్తోంది పోచమ్మ. 'కొడుకు ఫీజు కోసం ఇండ్లలో పాచిపని చేసుకుంటూ రెండేండ్ల నుంచి పైసలు జమ చేస్తున్న. వాని సదువు ఆగమైతది' అంటూ కన్నీరు పెడుతోంది పద్మ. 'మొగని సాటుకు పైసలు దాసుకున్న ఇప్పుడు బజార్ల వడ్డయ్. నా మొగడు నన్ను సావగొడుతుండు. ఇంకా ఎన్ని దాశినవ్ తెమ్మంటుండు' అంటూ ఏడుస్తున్నది రమ. అట్ల చిట్టిల వ్యాపారం సంసారాలను ఆగం చేసింది.

ఎంఎస్ఎన్ చారి

79950 47580

Advertisement

Next Story