ఆస్కార్ ఫంక్షన్ లో రాజమౌళి వెనుక సీటులో కూర్చోవడానికి కారణమిదే!

by Ravi |   ( Updated:2023-03-25 15:08:30.0  )
ఆస్కార్ ఫంక్షన్ లో రాజమౌళి వెనుక సీటులో కూర్చోవడానికి కారణమిదే!
X

24 క్రాఫ్ట్స్‌లో నైపుణ్యం, పట్టు సాధించినవారు సినిమారంగంలో రాణిస్తారని అంటారు. ఈ 24 రకాల నేర్పరితనాల్లో సినిమా ప్రచారం, మీడియా వాడకం ఉందో లేదో నాకు తెలియదు. 'ట్రిపుల్ ఆర్' సినిమాకు ఆ స్థాయిలో హైప్ సాధించుకోవడం, ఇటీవల ఓ పాటకు ఆస్కార్ గెలుచుకోవడం వంటి వాటి తీరుతెన్నులు గమనిస్తే సినీదర్శకులు ఎస్ఎస్ రాజమౌళి సినీ నిర్మాణం మెళకువల కన్నా, సినీ ప్రచారంలోనే సాటిలేని మేటి అనుకోవలసి వస్తున్నది!

తాజాగా ఓ ఇంగ్లీషు దినపత్రికలో (చాలా భాషల్లో, పత్రికలు వగైరాల్లో) విషయాన్ని గమనించండి. ఆయన బృందం ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు ఫంక్షన్ చూడడానికి టిక్కెట్టు కొనడం గురించి జనబాహుళ్యంలోకి వచ్చిన సమాచారం గురించి ఓసారి చూద్దాం. ఆ సమాచారం ద్వారా ఆ పాట గేయ కర్త చంద్రబోస్‌కు, సంగీత దర్శకుడు ఎమ్. ఎమ్. కీరవాణికి మాత్రమే ఈ అవార్డు భాగస్వామ్యం వుందని బోధపడింది. అంటే పాటకు, దానికి కూర్చిన బాణీలకు స్థూలంగా చెప్పాలంటే ఆడియో సాంగ్‌కు మాత్రమే ఈ అవార్డు వచ్చిందని పరిగణించాలి. ఎందుకంటే సుమారు 200 దాకా ఈ ఆస్కార్ అవార్డులు ఏటా ప్రదానం చేస్తారని, ఇదే వార్తాంశంలో కనబడుతోంది. దీనికి సంబంధించి ప్రత్యేక పరిశోధన అదనంగా చేయకుండానే ఈ నాలుగు మాటలూ రాస్తున్నాను. తొలుత వచ్చిన సమాచారం మేరకు ప్రతి టిక్కెట్టుకు 25 లక్షలు వెచ్చించి, రాజమౌళి బృందం తిలకించారని తెలిసింది. అదిప్పుడు వాస్తవం కాదని ఈ సమాచారంతోపాటు చేసిన వ్యాఖ్య మేరకు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే నాకు 'బాహుబలి' సమయంలో తెలుగు వార్తా పత్రికల్లో (సినిమా పేజీల్లో కాకుండా) అచ్చయిన విషయం ఏమిటంటే – కథానాయిక అనుష్క సినిమాలో ధరించిన విలువైన నగలు దొంగిలించ బడ్డాయని (నేను ఈనాడు దినపత్రికలో చదివినట్టు గుర్తు). సినిమా షూటింగ్‌కి మహారాణులు ధరించే ఆభరణాలు నిజమైనవి కావని భావిస్తారని ఆ సమాచారం పంపిన వారికి గానీ, ప్రచురించిన వారికి గానీ, ప్రసారం చేసిన వారికి గానీ తెలియకపోవడం ఇప్పటి కాలపు ప్రచారం సాధించిన విచిత్రం!

కేవలం ఆస్కార్ అవార్డు పొందిన విజేతలూ, వారితో చెరొకరికి మాత్రమే ఆస్కార్ ఫంక్షన్‌‌కి హాజరు కావడానికి అనుమతి ఉంటుందని తాజా సమాచారం. అలాగే ధనం వెచ్చించి తిలకించేందుకు, 'పెయిడ్ ఇన్వైట్స్' వీలుగా కొందరిని తీసుకు వెళ్ళవచ్చట. అలాగే ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌లో మొదటి వరుస ధర 750 డాలర్లు కాగా, చివరి వరుస 150 డాలర్లట. ఇదే సమాచారం మేరకు రాజమౌళి బృందం చివరి వరసలో కూర్చున్నారని తెలుస్తోంది. తలా 150 డాలర్లు అంటే సుమారు 12,000ల రూపాయలు వెచ్చించారని పరిగణించాలి. ఈ వార్తాంశంలో కీలకమైన విషయం ఏమిటంటే ఇలా రాజమౌళి బృందం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో చివరి వరుసలో కూర్చోవడం గురించి ప్రతి భారతీయుడు అసంతృప్తికి లోనయ్యాడని పేర్కోవడం! పైపెచ్చు ఇదే వార్తాంశంలో అక్కడ అన్నీ అమ్మకానికున్నాయని ధ్వనింపచేయడం మరింత విచిత్రం.

ఈ సందర్భంగా సినీ దర్శకుడు రాజమౌళి నైపుణ్యం గురించి ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. 2019లో 'జయంతి' పత్రిక నటి సావిత్రి గురించి 300ల పేజీల పుస్తకాన్ని ప్రచురించింది. అందులో సావిత్రి నటజీవితం గురించి వివరించే 'మహానటి' సినిమా ప్రచారం ద్వారా సాధించిన గుర్తింపు గురించి వ్యాఖ్యానిస్తూ భవదీయుడు, రాజమౌళి సాధించిన చరిత్రను క్లుప్తంగా పేర్కొన్నారు. ఆ మాటలు ఇలా సాగుతాయి.

... తెలుగు సినిమా ప్రచారంలో ‘బాహుబలి’ కొత్త పుంతలు తొక్కడంలో మలుపు తిప్పింది. లేకపోతే సినిమా విడుదల రోజునో, మరుసటిరోజునో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సంపాదకీయ పుటలో ఇంటర్వ్యూ, మరుసటి రోజు ‘హిందూ’ పత్రికలో అరపేజీ సమీక్షా, రెండు రోజులకే ఆర్థిక విషయాల దినపత్రిక ‘మింట్’లో సంపాదకీయం – తెలుగు పత్రికల విషయం చెప్పనక్కరలేదు... ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? పూర్తి సమాచారం మనకు అందదు, కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అంతర్గత రసాయనం ఏమిటో బోధపడుతుంది! చిత్ర నిర్మాణం కన్నా ప్రచారానికే ఎక్కువ వ్యయం అయిందని. అదే ‘మింట్’ పత్రిక సంపాదకీయం లోపల ఎక్కడో చదివితే కనబడుతుంది. కనుక బయటి ప్రమేయం లేకుండా సినిమా అంత 'స్వయం ప్రకాశం'గా అయ్యిందని భావించడం సత్యదూరమే! నేటి సినిమా ప్రచారం తీరు అలా మారిందని భావించాలి. అదే రీతిలో ‘మహానటి’ సినిమా ప్రచారం సోషల్ మీడియాలో ఆ స్థాయిలో రావడానికి కొంత ‘హోంవర్క్’ ఎందుకుండదని లోతుగా గమనించినవారి సునిశిత పరిశీలన. మీడియా పోకడలనూ, మీడియా వినియోగించుకునే ధోరణిలో వచ్చిన మార్పులనూ; కాలువ ప్రయాణంలో తెడ్డును ఉపయోగించుకునే రీతిలో లాఘవంగా వాడుకుని విజయం సాధించడం నేటి తరం విజయరహస్యం...

ఇదంతా ఎందుకంటే 'నాటు నాటు' పాటకు అవార్డు ప్రదానమైన సందర్భంలో 'టైమ్స్ ఆఫ్ ఇండియా' సంపాదక పుటలో ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురిస్తే 'ది హిందూ' దినపత్రిక వైజాగ్ డేట్ లైన్‌తో ఫైవ్ కాలమ్స్ వార్తను ప్రచురించింది. ఈ రెండు పత్రికలు గొప్పవి కనుక మిగతా పత్రికల గురించి, ప్రధానంగా సినిమాల మీద ఆధారపడి నడిచే అన్ని భాషల ఛానళ్ళ గురించి ఇక చెప్పుకోనక్కరలేదు. 'సోషల్ మీడియా డైనమిక్స్' కి తగిన వేగమూ, నేర్పరి తనమూ రాజమౌళి సినిమా ప్రచార వ్యూహానికి వున్నాయని భావించాలి. అది సాధించుకున్నారు కనుకనే ఆయన నేడు తెలుగువాడనే పరిధిని చెల్లాచెదురు చేసి 'జగద్భారత సినిమా నేత'గా వాణిజ్య విజయం సాధిస్తున్నారు!

డా. నాగసూరి వేణుగోపాల్,

మీడియా విశ్లేషకులు

9440732392

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Read more:

Manchu Lakshmi: మంచు ఇంట గొడవ.. లక్ష్మీ ప్రసన్న కూతూరుకి గాయాలు.. వీడియో వైరల్

Advertisement

Next Story

Most Viewed