స్పష్టత లేని 6 గ్యారెంటీస్!

by Ravi |   ( Updated:2023-09-27 00:45:51.0  )
స్పష్టత లేని 6 గ్యారెంటీస్!
X

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ‘6 గ్యారంటీస్’ను ప్రకటించింది. తుక్కుగూడలో నిర్వహించిన సభలో పార్టీ అగ్ర నేతల ద్వారా ప్రకటన చేయించింది. ఇందులో మహిళలు, వృద్ధులు, యువతను ఆకర్షించేలా మహాలక్ష్మి, రైతు భరోసా, యువ వికాసం, గృహవికాసం, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల లాంటి పథకాలను అమలు చేస్తామని చెప్పింది. అయితే ఈ 6 గ్యారంటీలపై విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. ‘అమలు ఎలా సాధ్యం’ అని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వీటిని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీస్తున్నాయి. అయితే ఆ విమర్శలకు సవివరంగా సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ నేతలు, విపక్షాలపై ప్రతి దాడి చేస్తున్నారు. దీంతో ప్రజల్లోనూ ఈ గ్యారంటీస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై బీఆర్ఎస్ చేయించిన అంతర్గత సర్వేల్లోనూ వీటి అమలుపై ప్రజల్లోనూ అనేక అనుమానాలున్నాయని తేలినట్లు ప్రచారం జరుగుతున్నది.

రైతు భరోసా హామీలో...

కాంగ్రెస్ విడుదల చేసిన ‘రైతుభరోసా’ పోస్టర్‌లో రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు, వరికి రూ. 500 బోనస్ అని ప్రకటించింది. అయితే ఏడాదికి ఎకరానికి రూ. 15వేలు ఇస్తారా? ఎంత భూమి ఉన్నా రూ. 15వేలే ఇస్తారా? అనే దానిపై స్పష్టత లేదు. ఎకరానికి రూ. 15 వేలు అని తమ ప్రసంగాలలో కొందరు కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నా.... అధికారంలోకి వచ్చాక మోసం చేయరనే గ్యారంటీ ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బడ్జెట్ పరంగా చూసినా ఇది పాలకులకు తీవ్ర భారమే. ప్రస్తుత ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ. 10వేల చొప్పున అందిస్తేనే, ప్రతిఏటా ప్రభుత్వానికి సుమారు రూ. 15వేల కోట్లు ఖర్చవుతున్నాయి. కాంగ్రెస్ హామీల ప్రకారం లెక్కలేస్తే కనీసం రూ. 25వేల కోట్లు అవసరమవుతాయి. మరోవైపు వరికి రూ. 500 బోనస్ అన్నారు. అయితే క్వింటాల్‌కు రూ. 500లు ఇస్తారా? రైతుకు రూ. 500 ఇస్తారా? అనేది స్పష్టం చేయడం లేదు. అయితే వరి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 కోట్ల క్వింటాళ్ల వరి ఉత్పత్తి అవుతుంది. ఈ లెక్కన ఈ ఒక్క హామీ నెరవేర్చడానికే రూ. 15వేల కోట్లు అవసరమవుతాయి. అంటే మొత్తానికి రైతు భరోసాను అమలు చేయాలంటే ఏడాదికి రూ. 40వేల కోట్లు కావాలి.

‘మహాలక్ష్మి’ హామీలో...

ఇక రెండవ స్కీమ్ మహాలక్ష్మి ఇందులో భాగంగా కుటుంబ పెద్ద అయిన ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య 90.14 లక్షలు. ఈ కార్డుల సంఖ్య పరంగా లెక్కేసుకున్నా ప్రభుత్వానికి నెలకు రూ. 2250 కోట్లు, అంటే ఏడాదికి రూ. 27వేల కోట్లు అవసరమవుతాయి. అంతేకాకుండా రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 200 తగ్గించడంతో ప్రస్తుతం గ్యాస్ ధర సుమారు రూ. 900కు చేరింది. అంటే ఈ లెక్కన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 400 వరకు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబానికొక గ్యాస్ చొప్పున లెక్క వేసుకున్నా, తెలంగాణలో గ్యాస్ కనెక్షన్ల సంఖ్య కోటి వరకు ఉంటాయి. అంటే రూ. 400 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం... దీనికి సుమారు వంద కోట్లు కేటాయించినా మొత్తం మీద రూ.3 వేల కోట్ల వరకు భారం ఈ హామీతో ప్రభుత్వంపై భారం పడనుంది.

‘చేయూత’ అందించగలుగుతారా?

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పేరుతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి రూ. 2వేల వరకు పింఛన్ అందజేస్తున్నది. వీటి కోసం రూ. 12 వేల కోట్లు ఖర్చవుతున్నది. అయితే ఇదే పథకాన్ని ‘చేయూత’గా మార్చి రూ. 4 వేల పింఛన్ అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అంటే ఈ ఒక్క స్కీమ్‌కే ప్రతి ఏటా రూ. 24 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. మరోవైపు ప్రస్తుతం రూ. 5లక్షల వరకు ఉన్న ఆరోగ్య శ్రీ లిమిట్‌ను రూ. 10లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాలు దీనికి అర్హత కలిగి ఉన్నాయి. దీనికి సుమారు రూ. 6వేల కోట్లు అవసరమవుతాయి. అంటే ఈ గ్యారంటీ కోసమూ రూ. 30 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

‘బల్బు’ వెలుగుతుందా..?

ఇక గృహజ్యోతి గ్యారంటీ కింద కాంగ్రెస్ 200 యూనిట్ల విద్యుత్ ఉచితమని ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ వినియోగంతో పాటు మంగలి, రజక వంటి కులవృత్తుల దుకాణాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తేనే సుమారు రూ. 25 వేల కోట్లు అవసరమవుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే మరో రూ. 10వేల కోట్లు అవసరమవుతాయి. అంటే ఉచిత విద్యుత్‌‌కే రూ. 35 వేల కోట్లు ఖర్చవుతాయి. అయితే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తుందో లేదో కాంగ్రెస్ తన గ్యారంటీస్‌లో ఎక్కడా చెప్పలేదు. దీనికి తోడు ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం పేరుతో ప్రకటించిన రెండు గ్యారంటీలకు మరో రూ. 10వేల కోట్లు అవసరమవుతాయి.

డిక్లరేషన్‌ల లోనూ అనేక హామీలు..

వివిధ పేర్లతో విడుదల చేసిన డిక్లరేషన్లలోనూ కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. రైతులకు ఏకకాలంలో రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ‘రైతు డిక్లరేషన్’లో పేర్కొన్నది. ఈ లెక్కన మొదటి సంవత్సరం ఈ హామీ అమలుకు సుమారు రూ. 30వేల కోట్లు అవసరమవుతాయి. డిక్లరేషన్‌లో పేర్కొన్న విధంగా పంట నష్ట పరిహారం, పంట బీమా అమలు చేయాలనుకుంటే మరో ఐదువేల కోట్లు ఖర్చవుతాయి. నిరుద్యోగ యువతకు రూ. 4వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ‘యూత్ డిక్లరేషన్’లో హామీ ఇచ్చింది. మరోవైపు అమరవీరుల కుటుంబాలకు రూ. 25వేల గౌరవ పెన్షన్ ను అందజేస్తామని చెప్పింది. ఈ లెక్కన ఏడాదికి రూ. 3వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలకు రూ. రెండువేల కోట్లు అవసరమవుతాయి. యువ మహిళా సాధికారత పేరుతో చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని ‘ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్’లో కాంగ్రెస్ పేర్కొన్నది. దానికీ వేల కోట్లు అవసరమవుతాయి.

సగం బడ్జెట్.. 6 గ్యారంటీస్‌కే!

2023-24 ఆర్థిక సంవత్సరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 2.90 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ లెక్కన వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 3.10 లక్షల కోట్ల నుంచి రూ. 3.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశమున్నది. అంటే ఈ బడ్జెట్‌లో సుమారు రూ. లక్షన్నర కోట్లు ‘6 గ్యారంటీస్’ కోసం, డిక్లరేషన్స్ కోసం ఏడాదికి రూ. 50వేల కోట్లు అవసరమవుతాయి. ఈ లెక్కన రూ. 2లక్షల కోట్లు ‘ఉచితాల’కే సరిపోతాయి. రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఉచిత హామీల అమలు తర్వాత ప్రభుత్వానికి మిగిలేది రూ. లక్ష కోట్లు మాత్రమే. అందులోనూ రూ. 50 వేల కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్లు, ప్రజాప్రతినిధుల జీతాలు, కార్యాలయాల నిర్వహణ కోసమే వెచ్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలేది రూ. 50వేల కోట్లు మాత్రమే. అంటే ఈ మాత్రం నిధులతో అభివృద్ధి ఎలా సాధ్యం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 5లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్నది. దీంతో కొత్త అప్పులూ పుట్టడం కష్టమే. దీంతో ఇతర పథకాలు, ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణాలు, ఉచిత బియ్యం, నిత్యావసరాల పంపిణీ, ఇతర వాటికి ఎక్కడి నుంచి నిధులు తెస్తుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరమున్నది.

మహమ్మద్ ఆరిఫ్

సీనియర్ జర్నలిస్ట్

96184 00190

Advertisement

Next Story