వైరస్ నీకూ, నాకూ కొత్తేమి కాదు కదా...!

by Ravi |   ( Updated:2025-01-16 00:30:12.0  )
వైరస్ నీకూ, నాకూ కొత్తేమి కాదు కదా...!
X

2020 కరోనా ప్రపంచాన్ని వణికించింది. మనం బాగుండడమే కాదు మన పక్కవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి మనిషికి నేర్పించి వెళ్ళింది. ఎంత గొప్పోడైనా అంటే ఎన్ని పదవులను అధిరోహించిన వాడైనా, ఎన్ని భవంతులకు అధికారియైనా, కోట్లకు అధిపతివై సూటు బూటుతో అడుగు నేల మీద మోపని వాడివైనా నాకు సమానమే అనే జీవిత సత్యాన్ని తెలియజేసింది.

ముక్కుకు మాస్క్ బిగించి మరీ...

వందమంది పనివారిని నువ్వు శాసించవచ్చు. కానీ, నా శాసనానికి నువ్వు బద్దుడవు కావాలి అంటూ ముక్కుకి మాస్క్ పెట్టి అడుగు బయట పెట్టకుండా మూసుకు కూర్చోబెట్టింది కరోనా. అది మనిషి కాదు, జంతువూ కాదు, ఈగనో దోమనో కాదు కేవలం ఒక వైరస్. మానవ జాతినంతటిని కట్టుదిట్టం చేసేసింది. ఎప్పుడైనా అనుకున్నామా అలాంటి రోజులనుభవిస్తామని, మొఖం చూపించకుండా భయపడి తలుపులేసుకొని దాక్కొనే రోజోకటోస్తుందని వచ్చింది. ప్రపంచం మొత్తంలో కొంత జనాభాను ఈడ్చుకెళ్లిపోయింది.

కులం, మతం తెలీని వైరస్

మనిషిగా నీకు కులం మతం ఉన్నట్టు వైరస్‌కి పేద ధనిక తారతమ్యం తెలియదు మరి. వీడు అట్టడుగు వర్గం వీడి దగ్గర డబ్బు ఉండదు కాబట్టి నేను వెళ్ళకూడదు. వీడు భూస్వామి కాబట్టి వెళ్దాం అనుకోలేదు. ఉన్న వాడిని లేని వాడిని ఒకే తాటిపై నిలబెట్టి "అందరూ మనుష్యులే" అని నిజాన్ని నిక్కచ్చిగా నిరూపించింది.

నువ్వొకరికి బలం అయినప్పుడు...!

ఇప్పుడు మరొక వైరస్ ప్రయాణమై బయలుదేరింది. భయంతో సాధించిందేమీ లేదిక్కడ. "మనోదైర్యం, మానవత్వం అనే రెండు ఆయుధాలు కావాలిప్పుడు". మనలో పరిశుభ్రత, ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి. అలాగే మనం బావుంటే చాలు పక్కనోడు ఎలా చస్తే నాకెందుకు అన్న దరిద్రపు స్వభావాన్ని మార్చుకోవాలి. ఈర్ష్య అసూయతో ఎంత సేపు ఒకడి నాశనం కోరుకోకూడదు. సమాజంలో బతుకుతున్నాం. "అందరూ బావుండాలి అందులో మనముండాలి" అన్న మంచి ఆలోచనతో ప్రతి రోజును ప్రారంభించాలి. అలా జీవనాన్ని కొనసాగిస్తే ఎన్ని ప్రళయాలు నీ మీదకు వచ్చినా తట్టుకొని నిలబడగలిగే ధైర్యం ఆ దేవుడు నీకిస్తాడు. అంతే కాదు నువ్వొకరికి బలం అయినప్పుడు మరింత బలగం నీతో ఉన్నట్టేనని గ్రహించు. అప్పుడు ఏ వైరస్ నిన్నేమీ చెయ్యలేదు.

వాసి జ్యోత్స్న

98668 43005



Next Story

Most Viewed