సంకీర్ణ పాలన కత్తి మీది సామే!

by Ravi |   ( Updated:2024-06-27 01:00:49.0  )
సంకీర్ణ పాలన కత్తి మీది సామే!
X

సంకీర్ణ ప్రభుత్వాలలో మెజార్టీ పార్లమెంట్ సభ్యులు కలిగిన జాతీయ పార్టీ ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను తన వద్దే పెట్టుకుంటుంది. మిగతా మంత్రిత్వ శాఖలను తన భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తుంది. అయితే ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ప్రభావం కనబడుతోంది. తమ ప్రాంతం ప్రజల అవసరాలను తీర్చుకోవడానికి ఇవి బేరమాడేందుకు సైతం వెనకాడవు..

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జాతీయ పార్టీ గంభీరంగా కనబడుతుంటుంది. కింగ్ మేకర్ కావాలనుకున్న ప్రాంతీయ పార్టీ నాయకుల క్రీడలకు కళ్లెం వేస్తుంటుంది. ప్రాంతీయ పార్టీలను చీల్చాలని జాతీయ పార్టీలు అనుక్షణం ఎదురుచూస్తుంటాయి. ప్రాంతీయ పార్టీ నాయకులు రాజకీయ అనుభవ చాతుర్యంతో కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరిస్తుంటాయి. పైకి ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ ఇది పిల్లికి దొరకకుండా ఎలుక, ఎలుక కంటపడకుండా పిల్లి ఒకరిపై ఒకరు పరోక్షంగా ఆధిపత్యం సాధించడానికి దోబూచులాట కొనసాగుతుంటుంది.

తొలి సంకీర్ణ ప్రభుత్వం

దేశంలో మొట్టమొదటిసారి 1975 అత్యవసర పరిస్థితి అనంతరం 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఇందిరాగాంధీని ఓడించి కాంగ్రెసేతర భావజాల పార్టీలన్నిటినీ కలుపుకొని దేశంలో మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం రెండేళ్లలోపే మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ రెండు గ్రూపులుగా విడిపోవడం వలన ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అనంతరం 1980లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచి, ఇందిరాగాంధీ మరోసారి ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీని సొంత అంగరక్షకులే హత్య చేయడంతో.. తిరిగి 1989- 90 నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వానికి వీపీ సింగ్ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఈ ప్రభుత్వంతో విభేదించి 1990-91 లో చంద్రశేఖర్ సమాజ్ వాది పార్టీ సారధ్యంలో ప్రధానమంత్రిగా పనిచేశారు.

90ల పొడవునా సంకీర్ణాలే

1996-98 కాలంలో వరుసగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1999లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో వాజ్‌పేయి నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏర్పడి 2004 వరకు ప్రభుత్వాన్ని కొనసాగించారు. 2004 నుంచి 2014 వరకు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. దీని తర్వాత 2014లో నుంచి 2024 వరకు బీజేపీ ఆధ్వర్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏర్పడి పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎదురులేకుండా తిరుగులేకుండా కొనసాగారు. మళ్లీ 2024 లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగు మెజారిటీ రాకున్నా ఎన్డీఏ ఆధ్వర్యంలో నరేంద్ర తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కింగ్ మేకర్లు.. షాక్ అబ్జర్వర్లు

అయితే యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషించాడు. అయితే ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబు బీహార్ నుంచి నితీష్ కుమార్ ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర వహించారు. కానీ వీరి వీరి అవసరాల దృష్ట్యా నిశ్శబ్దంగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. గతంలో కింగ్ మేకర్‌గా వ్యవహరించిన చంద్రబాబు, మిగతా ప్రాంతీయ భాగస్వామ్య పక్షాలు ఇప్పుడు ప్రభుత్వ వాహనానికి షాక్ అబ్జర్వర్‌గా మాత్రమే కొనసాగుతున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా సాగిన 10 సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే ప్రాంతీయ పార్టీలను చీల్చి ఆయా పార్టీల ప్రాబల్యాన్ని సమర్థవంతంగా తగ్గించారు.

జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య రేఖ

అయితే జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు మధ్య ఒక స్పష్టమైన రేఖ ఉంటుంది. జాతీయ పార్టీల ప్రయోజనాలు ఒకరకంగా ఉంటే ప్రాంతీయ పార్టీల గమ్యాలు ప్రయోజనాలు వేరే రకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక పరిమితమైన ప్రాంతం ప్రజల ఆశయాలు భాషా సంస్కృతుల ఆలోచనలకు అనుకూలంగా ప్రాంతీయ పార్టీలు పని చేయవలసి వస్తుంది. వీటి అస్తిత్వాలు ఉనికి ఆయా ప్రాంతాల ప్రజలకు మేలు చేసే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు మిగతా ప్రాంతాలకు విస్తరించాలని ప్రయత్నం చేసినప్పుడల్లా విఫలమవుతుంటాయి లేక చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం పొందలేక పోతాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలలో అంతర్గత వైరుధ్యాలను ఎప్పటికప్పుడు సర్దుబాటు, రాజీ మార్గాల సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఏది ఏమైనా సంకీర్ణ పాలనను సజావుగా కొనసాగించడం కత్తిమీద సాములా ఐదేళ్లు బండిని లాక్కు పోవాల్సి వస్తుంది.

--జూకంటి జగన్నాథం,

కవి, రచయిత

94410 78095

Advertisement

Next Story