- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతిని కదిలించిన.. నినాదాలు
భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది త్యాగధనులు తమ రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోసి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు కూడా జరుపుకొన్నాం. ఈ సందర్భంగా ఉద్యమానికి స్పూర్తిని, ప్రేరణను అందించిన, శక్తివంతమైన కొన్ని నినాదాలను మననం చేసుకోవడం మన నైతిక కర్తవ్యం.
సైమన్ గోబ్యాక్, క్విట్ ఇండియా
రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో శత్రు సైన్యాన్ని భయపెట్టాలని రకరకాల ధ్వనులు, భీకరమైన శబ్దాలు, రణ నినాదాలు చేస్తారు. అరుపులు, కేకలు, నినాదాలతో యుద్ధమైదానం మార్మోగిపోతోంది. ఢమరుక నాదం, శంఖానాదాలతో తమ సైనికుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, శత్రు సైన్యంలో భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేస్తారు. అలాంటిదే దేశ స్వాతంత్య్రోద్యమానికి ఊపిరి పోసిన నినాదాలు.
దేశ స్వాతంత్య్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్న మహాత్మాగాంధీకి స్వాతంత్య్ర పోరాటానికి పనికొచ్చే నినాదాలను సూచించాలని కోరారు. ఎంతోమంది ఎన్నో చెప్పినా యూసుఫ్ మెహర్ అలీ 'క్విట్ ఇండియా' అనే పదాన్ని ప్రతిపాదించారు. ఈ నినాదం నచ్చి, వెంటనే ఆ పదాన్ని ఆమోదించారు. అలాగే ' సైమన్ గో బ్యాక్ ' అనే విప్లవాత్మక నినాదం కూడా ఆయనదే. ఈ నినాదం కూడా ప్రజల్లోకి చొచ్చుకు పోయింది. 1928లో నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వ పాలన మెరుగుపర్చేందుకు సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం బ్రిటిష్ పాలకులు సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఒక్క భారతీయుడికీ స్థానం కల్పించకపోవడంతో దీనికి నిరసనగా, 1928లో సైమన్ కమిషన్ ముంబై రేవులో దిగినప్పుడు యూసుఫ్ మెహర్ అలీ కొంత మందితో కలిసి కూలీల వేషంలో రేవుకు వెళ్ళి' సైమన్ గో బ్యాక్ ' అని గర్జిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఇవి రెండు దేశ స్వాతంత్య్రోద్యమాన్నే మలుపు తిప్పాయి.
అందరికీ ఆమోద యోగ్యమైన నినాదం..
ఇది మరో స్ఫూర్తిదాయకమైన నినాదం. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే.. విప్లవం వర్ధిల్లాలి. దీనిని ఉర్దూకవి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా హస్రత్ మోహాని రూపొందించారు. ఈ నినాదాన్ని భగత్ సింగ్ ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ నినాదం స్వాతంత్ర్య పోరాట రణ నినాదాలలో ఒకటిగా మారిపోయి.. భారతీయ యువతను స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనే విధంగా ప్రేరేపించింది. అలాగే ‘సత్యమేవ జయతే’ ఈ నినాదాన్ని పండిట్ మదన్ మోహన్ మాలవీయ రూపొందించారు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది అనేది దీని అర్ధం. దీన్నిమనం జాతీయ నినాదంగా స్వీకరించడమే కాకుండా మన జాతీయ చిహ్నం మీద కూడా రాసుకున్నాము. అలాగే, ఆసేతు హిమాచలం ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించిన నినాదం 'జైహింద్'. దీన్ని హైదరాబాదుకు చెందిన ఆబిద్ హసన్ సఫ్రానీ రూపొందించారు. సుభాష్ చంద్రబోస్ వ్యవస్థీకరించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో అబిద్ మేజర్‌గా పనిచేస్తున్న సమయంలో.. అందులో భిన్నవర్గాల ప్రజలు ఉండేవారు. వారిలో కొంతమంది ‘నమస్కార్ అని కొంతమంది రామ్ రామ్ అని, మరికొంతమంది 'సత్ శ్రీ అకాల్', 'అస్సలామాలేకుం' అని అభివాదం చేసుకునేవారు. సెక్యులర్ భావాలు కలిగిన బోస్‌కు ఇన్ని రకాల అభివాదాలు ఉండటం సబబుగా అనిపించలేదు. అందరికీ ఆమోద యోగ్యమైన ఓ అభివాద నినాదాన్ని రూపొందించాలని బోస్ తన సన్నిహితులకు చెబితే అబిద్ ‘జై హిందుస్థాన్’, ‘జై హింద్’ అనే నినాదాలను సూచించారు. వీటిల్లో జై హింద్ ను బోస్ ఆమోదించి విశేషంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ‘జై హింద్’ అనే పదం దేశ భక్తిని చాటుకునే నినాదంగా మారిపోయింది. మాతృభూమి కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి వేలాది యువ హృదయాలను ఈ నినాదం ప్రేరేపించింది. ఇప్పటికీ రాజకీయ నాయకులు, దేశభక్తులు తరచూ ఈ నినాదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు.
బ్రిటిష్ వారికి వార్నింగ్..
అలాగే.. స్వరాజ్యం నా జన్మహక్కు అనే నినాదం. కాకా బాప్టిస్టా పలికిన ఈ నినాదాన్ని బాల గంగాధర్ తిలక్ స్వీకరించారు. స్వాతంత్ర్య పోరాటంలో దేశప్రేమికుల గుండెల్లో స్వతంత్ర జ్వాలలు రేకెత్తించారు. ఈ నినాదం దేశ ప్రజలను స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి ప్రేరేపించడమే కాక, వేలాది మంది ప్రజల హృదయాల్లో దేశంపై ప్రేమను ఉరకలెత్తించింది. సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులకు అంతిమంగా ఇచ్చిన ఒక వార్నింగ్ ‘క్విట్ ఇండియా’ నినాదం. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసిన బలమైన, అత్యంత గంభీరమైన విజ్ఞప్తి. బ్రిటిష్ వారిని ఒక్కసారిగా, స్పష్టంగా భారతదేశాన్ని విడిచిపెట్టమని చేసిన హెచ్చరిక. ఈ క్విట్ ఇండియా ఉద్యమం నుండి వచ్చిందే ‘డూ ఆర్ డై’ నినాదం. జాతీయ సమైక్యత, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాతంత్ర్య పోరాటం సాగుతుండగా గాంధీజీ ఇచ్చిన పిలుపు డూ ఆర్ డై ఉద్యమ కారుల్లో స్పూర్తిని నింపింది. ఇవేకాకుండా ఇంకా ఇలాంటి అనేక నినాదాలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన పాత్ర పోషించాయి. మన స్వాతంత్ర్యసమర యోధులు చేసిన నినాదాలు శతృహృదయాల్లో భీతిని కలిగించి మాతృభూమిని పరాయి బానిసత్వం నుండి విముక్తి చేశాయి.
- యండి. ఉస్మాన్ ఖాన్
సీనియర్ జర్నలిస్టు
99125 80645