కొత్త సర్కార్ కనికరించాలి!

by Ravi |   ( Updated:2024-01-04 01:00:52.0  )
కొత్త సర్కార్ కనికరించాలి!
X

గత దశాబ్ద కాలంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు మునుపెన్నడూ ఎదుర్కొని సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో ఉద్యమ స్ఫూర్తి నీరుగారాడంతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా ఇంకా జఠిలమై కూర్చున్నాయి.

స్థానికత కోసమే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఉద్యోగ, ఉపాధ్యాయులు స్వరాష్ట్రంలోనే సొంత జిల్లాకు దూరం అయ్యారు. 317 జీవో ఉద్యోగ ఉపాధ్యాయులందరిని గూడు చెదిరిన పక్షులను చేసింది. స్థానికత కోసం, జీవిత భాగస్వామి స్థాన చలనం కోసం స్వరాష్ట్రంలో రాస్తారోకోలు, రాజధానిలో డీఎస్‌ఈ ముట్టడిలు నిత్యకృత్యం అయ్యాయి. 2018 జులై నుంచి పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉండగా సుమారు మూడు సంవత్సరాల కాలయాపన అనంతరం 2021 ఏప్రిల్‌లో ప్రకటించారు. పీఆర్సీ ఎరియర్స్ సీపీఎస్ ఉద్యోగులకు ఏక మొత్తంలో చెల్లించాల్సింది పోయి విడుతల వారీగా చెల్లిస్తామని, ఓపిఎస్ ఉద్యోగులకు ఏకంగా రిటైర్మెంట్ తర్వాతనే చెల్లిస్తామని మునుపెన్నడూ లేని విధంగా కొత్త రాష్ట్రంలో సరికొత్త ఫార్ములాకు శ్రీకారం చుట్టారు. డీఏ ఎరియర్స్ సైతం విడుదల వారిగా చెల్లిస్తామని బిల్స్ సబ్మిట్ చేసినప్పటికీ అటు పీఆర్సీ ఎరియర్స్, ఇటు డీఏ ఎరియర్స్ ఇప్పటికీ 50శాతం మంది ఉద్యోగులకు 50 శాతం కూడా క్రెడిట్ కాలేదు.

ఎన్నో సమస్యలు..

బ్రిటిష్ కాలం నాటి మార్చుతున్న ప్రభుత్వాలు ఏకీకృత సర్వీస్ రూల్స్ మాత్రం రూపొందించలేకపోతున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ నడకలో నత్తతో పోటీపడుతూ ఒక్క అడుగు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి వెళ్తూ కోర్టుల చుట్టూ ప్రదర్శనలు చేస్తూనే ఉంది. ఒకటవ తేదీన జీతాలు రాక, ఈఎంఐలు కట్టలేక, సిబిల్ స్కోర్ దెబ్బతిని, ఉద్యోగులంటేనే అప్పు పుట్టని స్థితిలోకి నెట్టివేయబడ్డారు. కాలానుగుణంగా ఆదాయ పన్ను పరిమితిని గత కొంతకాలంగా పెంచక పోవటం వలన పెరిగిన కొంత జీతం కూడా ఆదాయ పన్ను చెల్లింపులకే సరిపోతుంది. సమయానికి డీఏలు మంజూరు కాక, పెరుగుతున్న మార్కెట్ ధరలతో పోటీపడలేక కుటుంబ పోషణలో ఉదోగులు కుదేలైపోతున్నారు.

ఇక రుతురాగాల సీరియల్ వలె కొనసాగిన పండిట్, పీ‌ఈటీల సమస్య, స్వరాష్ట్రంలో నాన్న పులి చందంగా మారింది. ఎంతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తున్న న్యాయస్థానాలు పండిత, పీఈటీ సమస్యను పరిష్కరించలేకపోతున్నాయి. అలాగే ఉద్యోగి వాటా చెల్లింపుతో కూడిన ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అట్టహాసంగా ప్రకటించినప్పటికీ, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిపోయింది. సీపీఎస్ ఉద్యోగుల కష్టాలు ఇక చెప్పనక్కర్లేదు. పుష్కర కాలంగా గల్లి నుండి ఢిల్లీ వరకు ఎన్ని పోరాటాలు చేసినా, సీపీఎస్ సమస్య కమిటీ హామీతో కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల గూర్చి క్లాస్ తీసుకున్న నాయకులు, స్వరాష్ట్రంలో వారిపట్ల కనికరం చూపలేకపోతున్నారు. కేజీబీవీ మహిళ ఉపాధ్యాయులకిచ్చిన హామీలు నీటిమీది రాతలుగా మారాయి. పోరాటాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో, సమస్యల సుడిగుండంలో చిక్కుకొని విలవిలలాడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇటీవలే మొదటి వారంలోనే జీతాలు జమచేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. అలాగే పైన పొందుపరిచిన సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ కనికరించాలని కోరుతున్నాం.

- జుర్రు నారాయణ యాదవ్,

తెలంగాణ టీచర్స్ యూనియన్

94940 19270

Advertisement

Next Story

Most Viewed