- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీభత్సరస చిత్రం 'పద్మిని'
పద్మిని మలయాళ చిత్రం, తెలుగు డబ్బింగ్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. కేరళలో యువతీయువకులకు వివాహ సంబంధాలు కుదరక, పెళ్ళిళ్ళ పేరయ్యల ద్వారా సంబంధాలు నిశ్చయించుకునే క్రమంలో ఒక్కోసారి ఆ యువతులు ఆషాఢభూతుల బారినపడి, వివాహాలు విచ్ఛిన్నం అవడం, తల్లిదండ్రుల బలవంతం మీద తాళి కట్టించుకొని ప్రియుడితో పారిపోయే అమ్మాయిలు... విద్యాధికులు, విశ్వవిద్యాలయంలో ఆచార్యులు అయినా పెళ్లి చూపులకు వచ్చి వధువు ఇంటివాస్తు బాగా లేదని, తనకు నచ్చని పద్మిని కారు వధువు తాలూకు వారికి ఉండడం చూసి, అమ్మాయిని చూడకుండానే వెళ్ళిపోయే పెళ్ళికొడుకులు.. హాస్యరసం వెనక యువతీయువకుల జీవితాల్లో విషాదాలు, అన్నీ ఈ సినిమాలో దర్శకుడు హాస్యం, చక్కెర, పూత పూసి మనముందు ప్రదర్శిస్తారు.
కథేంటంటే..
కథానాయకుడు రమేష్ ఆస్తిపరుడు, విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు, కవి. అతని తొలి పెళ్లి శోభనం రాత్రే పెటాకులవుతుంది. పెళ్ళికూతురు శోభనం గదిలో నుండి మాయమై ప్రియుడితో ఉడాయిస్తుంది. ఆ అమ్మాయి ప్రియుడితో పారిపోవడానికి పాత పద్మిని కారు వాడింది కనుక ఆ వూళ్ళో అతని భగ్న వివాహాన్ని అందరూ పద్మిని పేరుతో వ్యంగ్యంగా, హాస్యంగా చెప్తూ ఉంటారు. రమేష్‌కి పద్మిని అనే మాట వినపడితే చాలు కంపరం, తనమీద అదుపుతప్పి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. పద్మిని పదమే అతనికి ఒక ఫోబియాగా తయారవుతుంది. పెళ్ళంటే వైముఖ్యం ఏర్పడుతుంది. పద్మిని అనే కారు పేరును రమేష్‌ను అపహాస్యం చేయడానికి ప్రతివారు వాడుతారు. కాలేజీలో తుంటరి విద్యార్థులు గోడలమీద పద్మిని అని రాసి అవమానపరుస్తారు. పద్మిని అనేమాట వింటేనే అతనికి గంగవెర్రెక్కిపోయి, అతనిలో ఆత్మన్యూనతాభావం పాతుకుపోతుంది. ప్రతివారు చెప్పే సాంత్వన వచనాలు మరింత బాధిస్తాయి. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ రమేష్ అయిష్టంగానే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాడు. 32 సంవత్సరాల లాయర్ సంబంధం. పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయి ఇంటి ముందున్న పద్మిని కారు చూచి కంపరమెత్తి, ఆ యింటి వాస్తుకు వంకలుపెట్టి, కాబోయే వధువు శ్రీదేవిని పరిహసించి వెళ్ళిపోతాడు. ఆమె కూడా ఆత్మాభిమానంతో అతడిని చెడామడా చీవాట్లు పెడుతుంది. ఆమె ప్రాక్టీసులేని న్యాయవాది, వయసు పైబడుతున్న తనకు పెళ్ళి అయితేగాని చెల్లి పెళ్లి కాదు. కాలేజీలో గణితశాస్త్రం బోధించే యువతి పద్మినితో రమేష్ పెళ్లి కుదురుతుంది. అప్పటికి అతని పద్మిని ఫోబియా కూడా కాస్త సర్దుకుంటుంది. పద్మిని తండ్రి కూడా రమేష్ హోదాకు తగిన పోలీసు అధికారి. తీరా ముహూర్తం పెట్టుకొనే ముందు రమేష్ అధికారికంగా మొదటి భార్యతో విడాకులు తీసుకోవాలంటారు. అతను యాదృచ్ఛికంగా మొదట వాస్తు వంకపెట్టి వెనక్కి వచ్చిన యువతి శ్రీదేవి-లాయరుకే విడాకులు కేసు అప్పగిస్తాడు. ఆమెకూ అదే తొలికేసు. కోర్టు దృశ్యాలు చాలా హాస్యంగా, రమేష్‌కు బాధాకరంగా సాగుతాయి. కాబోయే భార్య కుటుంబం కూడా కేసు విచారణ చూడడానికి కోర్టుకు హాజరవుతారు. ఆలస్యం జరిగే కొలది వాళ్ల వేదన అధికమవుతుంది.
కన్యాశుల్కం గుర్తుకు తెచ్చే పాత్రలు
అయితే కోర్టులో మొదటి భార్యను హాజరుపరిస్తే అన్యోన్య అంగీకారంతో విడాకులు మంజూరు చేస్తానంటాడు మేజిస్ట్రేట్. తప్పనిసరై రమేష్, అతని న్యాయవాది. శ్రీదేవి రహస్యంగా మద్రాసు ప్రయాణమవుతారు. అప్పటికే ఆ న్యాయవాది శ్రీదేవికి ఒక పరుపుల కంపెనీ యజమానితో పెళ్ళి నిశ్చయం అయివుంటుంది. అతను తన కాబోయే భార్య ఎవరికీ చెప్పకుండా మద్రాసు ఎందుకు వెళ్ళిందో అని, మద్రాసులో ఆమె వెళ్ళినచోటికి వెళ్ళి తన కాబోయే భార్య-అడ్వకేటు, రమేష్ ఏకాంతంగా ఉండడం చూసి ఆమె మీద అపవాదులు వేస్తాడు. వారిద్దరూ రమేష్ తొలి భార్యను విడాకులకు ఒప్పించడానికే వెళ్ళారని తెలుస్తుంది. రమేష్ తొలి భార్యదొక విషాద గాధ. వెనకాముందూ ఆలోచించకుండా శోభనం గదినుంచి ప్రియుడితో పారిపోయి, ఆ మోసగాడి చేతిలో తన్నులు తింటూ బ్రతుకు వెళ్ళిపోస్తూ ఉంటుంది. వాడు మళ్ళీ మరొక యువతిని బురిడీ కొట్టించి పెళ్ళాడే ప్రయత్నంలో ఉంటాడు. అటువంటి సమయంలో రమేష్, అతని న్యాయవాది శ్రీదేవి ఆమెను కాపాడి వెంటతీసుకొని పోతారు. రమేష్ అవకాశం ఇస్తే మళ్ళీ అతనితో ఉండాలని రమేష్ తొలి భార్య అనుకొంటుంది కానీ రమేష్ సందివ్వడు. కోర్టులో సమయానికి ఆమె మెజిస్ట్రేట్ ముందు హాజరు కాకపోవడంతో విడాకుల కేసు మరల వాయిదా పడుతుంది. రమేష్‌కు కాబోయే భార్య కుటుంబం ఈ సంబంధం రద్దు చేసుకొని, రమేష్‌ను అవమానించి వెళ్ళి పోతుంది. ఈ క్రమంలో రమేష్, అతని మహిళా న్యాయవాది శ్రీదేవి మధ్య అవగాహన పెరిగి, ప్రణయంగా మారి, ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని శ్రీదేవి పద్మిని కారులోనే హనీమూన్ బయలుదేరుతున్నట్లు చూపడంతో కథ ముగుస్తుంది.
రమేష్, అతని కుటుంబం హృదయం లేని సమాజంలో అనేక పరిహాసాలకు గురికావడం, యువతులు తమకు పెళ్ళికాదని అభద్రతా భావంతో జీవించడం విషాదం. రమేష్ పెళ్ళికూతురుని లేవదీసుకుని పోయిన దగుల్బాజీ చివరన మరొక యువతిని చేసుకొని మోసగించకుండా రమేష్, అతని న్యాయవాది శ్రీదేవి కాపాడుతారు. ఆ మోసగాడు లేవదీసుకొని పోయిన యువతిని ఏలుకొనేట్లు బుద్ధి చెబుతారు. దగుల్బాజీ పెళ్లి కొడుకుతో తన వివాహం తప్పినా, ఆ వధువు ఇక నన్నెవరు చేసుకొంటారు అని ఆక్రోశించడం బీభత్సరసానికి పరాకాష్ట. భారతీయ సమాజంలో కన్యలకు పెళ్లి అతిముఖ్యమైనదనే భావన ఎంతగా నాటుకొని పోయిందో అనిపిస్తుంది. సినిమా బీభత్సరస ప్రధానంగా సాగుతూ, తరచూ కన్యాశుల్కం నాటకంలో పాత్రలను గుర్తుకు తెస్తూ ఉంటుంది. హాస్యం వెనుక మానవజీవితంలో విషాదం తొంగి చూస్తుంది.
డా. కాళిదాసు పురుషోత్తం
విశ్రాంత ప్రిన్సిపాల్
90006 42079