మోడీ పాలన ఓ మహత్తర మార్పు

by Ravi |   ( Updated:2022-09-03 17:24:54.0  )
మోడీ పాలన ఓ మహత్తర మార్పు
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీ‌ఏ) ఎనిమిదేండ్లు పూర్తి చేసుకుంది. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి, ముఖ్యంగా ద్రవ్యోల్బణం, తాజాగా చైనాలో కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని ఆందోళకర పరిణామాలకు గురవుతున్నప్పటికీ స్థిరమైన అభివృద్ధి వైపు ప్రయాణం సాగిస్తున్నాం. మొత్తం పాలనా వ్యవస్థ ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఓ పెను మార్పు తీసుకురావడం గమనించాలి. మన స్వాతంత్య్రం అనంతరం 2014 వరకు ఎక్కువ భాగం, సగటు భారతీయుడికి సంరక్షకురాలిగా ప్రభుత్వ పాత్రపై కొంత అయోమయం నెలకొంది. అందువలన, టెలిఫోన్‌ లైన్లు, విమానాశ్రయాలు, టెలికాం కంపెనీలతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నడపాలని ఎదురు చూస్తూ ఉండేవాళ్లం.దానితో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పుడల్లా ప్రభుత్వమే వ్యవస్థలోకి డబ్బు నెట్టడం జరుగుతూ ఉండేది.

2008 తర్వాత అపఖ్యాతి పాలైన రుణగ్రహీతలకు రుణాలు విడుదల చేయడంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ స్థిరత్వానికి సవాల్‌ ఏర్పడిరది. 2019 ఎన్నికలకు ముందు, సంవత్సరానికి రూ 72,000 నగదును ఆర్థిక వ్యవస్థలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది భారతీయుల ఖాతాలలో జమ చేస్తామని కాంగ్రెస్‌ 'న్యాయ్‌' పథకాన్ని ప్రతిపాదించినప్పుడు ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయింది. ఓటర్లు మంచి అవగాహనతో పోలింగ్‌ బూత్‌లో ఈ ఆలోచనను స్పష్టంగా తిరస్కరించారు. ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో, ప్రభుత్వం ఇకపై సంరక్షక పాత్రను కాకుండా సదుపాయం కల్పించే పాత్ర వహించాలని స్థిరంగా కోరుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, వారు చేపలను ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలనుకున్నారు కానీ, చేపల కోసం ప్రతి ఐదేండ్లకోసారి క్యూలో నిలబడకూడదని నిర్ణయించుకున్నారు.

ఆదర్శవంతంగా, ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చే బదులు పారిశ్రామికవేత్తలకు మనుగడ సాగిస్తూ, అభివృద్ధి చెందడం ద్వారా ఉపాధి, ఉద్యోగాలు కల్పించగల అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ పాత్రగా ప్రజలు గుర్తించారు. ప్రభుత్వం మాత్రమే నిర్దిష్ట సంఖ్యలో ఉద్యోగాలు కల్పించగలదని భావించడం లోపభూయిష్టం కాగలదని అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం వ్యాపారాలు నిర్వహించే పనిలో మునిగి పోరాదని, వాటిని నియంత్రించాలని, నూతన ఆవిష్కరణలకు, పోటీకి సంకెళ్లు వేయకుండా అందరూ పురోగతి సాధించగలిగే విధంగా చూడాలనే ఆలోచనను నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్చివేసింది.

వ్యవసాయానికి సంబంధించి కూడా, ప్రభుత్వం ప్రతి సంవత్సరం రుణమాఫీ లేదా అధిక ధరల కొనుగోళ్లతో రైతును రక్షించాలని చూడటం కాకుండా, రైతులు, వ్యాపారులు, 1.3 బిలియన్‌ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే న్యాయమైన వ్యాపార పద్ధతులను సులభతరం చేసే చట్టాలను తీసుకురావాలని సంకల్పించింది. 2013లో బీజేపీ అధికారికంగా తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించక ముందే నరేంద్ర మోదీ 'కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన' అనే నినాదంతో ఈ విధానాలను ప్రజల ముందుంచారు. ఆయన ప్రభుత్వం వీటిని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా భారత దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ ఎనిమిదేండ్లలో ఓ మహత్తర అభివృద్ధి నేపథ్యం గల వ్యవస్థగా గుర్తింపు పొందేటట్లు చేయగలిగారు.

'కనీస ఆచరణీయ సామ్యవాదం' విధానంతో దేశంలోని గ్రామాలలో కేంద్రీకృతమైన 80 కోట్ల మంది ప్రజానీకం తమ కనీస అవసరాల కోసం ఇబ్బందులకు గురికాకూడదని ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. గృహ నిర్మాణం, తాగు నీరు, కమ్యూనికేషన్‌, బ్యాంకింగ్‌ వంటి కనీస ఆధునిక సదుపాయాలు కల్పించడంతోపాటు స్వయం సమృద్ధిగా సంపద సృష్టించేవారుగా వారి శక్తియుక్తులను మలచుకునేందుకు ప్రభుత్వం ఆలంబనగా నిలిచింది. కాంగ్రెస్‌ పార్టీ అపహాస్యం చేస్తున్న 'జన్‌ ధన్‌ యోజన' ద్వారా 45 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు రూ 1.67 కోట్లకు పైగా డిపాజిట్లు చేసుకోగలగడమే కాకుండా, 31 కోట్లకు పైగా రూపే కార్డులు పొందగలిగారు. దేశంలో విప్లవాత్మక ఈ మార్పు డిజిటల్‌ చెల్లింపులకు వీలు కల్పిస్తోంది.

ఆయుష్మాన్‌ భారత్‌ 50 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించగలుగుతున్నది. దాదాపు 200 కోట్ల డోస్‌లతో కూడిన కొవిడ్‌ టీకా కార్యక్రమం ప్రపంచంలోనే చరిత్ర సృష్టించింది. ఈ-రూపీ ద్వారా డిజిటల్‌ వోచర్‌లను ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతున్నది. దీపాలు సమకూర్చడం ద్వారా ఇంధన పొదుపుపై దృష్టి సారించిన ఉజ్వల కార్యక్రమం గ్రామీణ పేదల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకు వచ్చింది. నేటి వరకు 36 కోట్లకు పైగా ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ జరిగింది. దీంతో ఏటా దాదాపు 40 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు తగ్గాయి. ఓ సంవత్సరం పాటు 5.8 ప్యాసింజర్‌ వాహనాల నుండి వెలువడే ఉద్ఘారాలకు ఇది సమానం అవుతుంది.

గ్రామీణ భారతదేశంలోని మహిళలకు గ్యాస్‌ సిలిండర్లను అందించే ఉజ్వల యోజన విషయంలో కూడా ఇటువంటి గుణాత్మక పరివర్తన కనిపిస్తుంది. పట్టణ ప్రాంతాల ప్రజలు పేదలకు మద్దతుగా తమ ఎల్‌పీజీ సబ్సిడీలను ఇష్టపూర్వకంగా వదులుకోవడం మోడీ పాలనలో సాధించిన గుణాత్మక మార్పుకు నిదర్శనం. ఈ పథకం కింద నేటి వరకు 9 కోట్లకు పైగా గ్యాస్‌ కనెక్షన్లు అందించడం జరిగింది.ఈ ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అమలు చేసిన మరో అసాధారణ కార్యక్రమం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన.

పీఎంఏవై (యు) కింద 1.22 కోట్లకు పైగా గృహాలు మంజూరు కాగా, కోటికి పైగా అమలులో ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 60 లక్షల గృహాల నిర్మాణం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో 2.7 కోట్లకు పైగా గృహాలను లక్ష్యంగా పెట్టుకోగా, 2.4 కోట్లకు పైగా మంజూరయ్యాయి. 1.81 కోట్లు పూర్తయ్యాయి. రూ 2.4 లక్షల కోట్లకు పైగా నిధులు అర్హులైన లబ్ధిదారులకు బదిలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రకృతి దృశ్యాన్ని మార్చివేస్తుంది. ఇక లక్షలాది మరుగు దొడ్ల నిర్మాణం, పైపుల ద్వారా రక్షిత తాగునీటి సరఫరా, వ్యవసాయ రాయితీలతో గ్రామీణ రంగంలో ప్రజా జీవనం పెను మార్పులకు దారితీస్తుంది. ఇట్లా ఉంచితే, నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌, నేషనల్‌ అసెట్‌ మానిటైజేషన్‌, కొన్నింటి నుండి పెట్టుబడుల ఉపసంహరణ వంటి ఇతర రంగాలకు సంబంధించిన పథకాలు ఉన్నాయి.

ఈ విధంగా దేశ పాలన స్వరూపాన్ని మార్చివేసిన మోడీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుండి పెట్టుబడుల ఉపసంహరణ లేదా ప్రైవేటీకరణ, దివాలా కోడ్‌, మహిళలు-పిల్లల అభివృద్ధికి సంబంధించిన విధానాలు, జాతీయ విద్యా విధానం వంటి ఎన్నో సాహసోపేత విధానాల అమలు జరుగుతున్నది. రైల్వేల మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్‌ చేయడం, 'డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌' 'ఉడాన్‌ యోజన' వంటి కొన్ని రూట్‌లు, ప్రాజెక్టులను ప్రైవేటీకరించడం, పట్టణ ప్రాంతాల గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను రెరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) ద్వారా పరిరక్షించడంపై దృష్టి సారిస్తోంది.

ఎన్‌బీసీసీ ద్వారా చాలా మంది గృహ కొనుగోలుదారులకు రక్షణ కల్పించడం, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, సరిహద్దు రోడ్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి, రక్షణ సామగ్రి స్వదేశీకరణ, కాశీతో ప్రారంభించి అనేక ధార్మిక పర కారిడార్లు, తక్కువ ప్రీమియంలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా గ్రామీణ ప్రజలకు బీమా, హామీ అవసరం లేని ముద్ర ణాలు, ఉత్పత్తి- అనుసంధాన ప్రోత్సాహక పథకాల ద్వారా డజనుకు పైగా రంగాలలో రూ. 2.34 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. మోడీ పాలనలో అత్యంత కీలక అంశం ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్‌. ఇది ఆధార్‌తో ప్రారంభమైంది. ఇప్పుడు కోట్లాది మంది భారతీయులకు చౌకగా ఇంటర్నెట్‌ కనెక్షన్లు వచ్చాయి.

(నరేంద్ర మోడీ పాలన ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా)

బండి సంజయ్‌‌కుమార్‌

ఎంపీ, కరీంనగర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Next Story