- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
న్యాయ వ్యవస్థపై పనిభారం ఎక్కువైంది!
కొన్ని రోజుల క్రితం ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి సుప్రీంకోర్టు చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిన విషయం. నేర చరిత కలిగిన నేతలపై పెండింగ్ కేసులు ప్రజాస్వామ్యానికి దెబ్బ అని రాష్ట్ర హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసులు ఉన్నవి.. ఇవి ఇంకెన్నాళ్ళు జాప్యమవుతాయి. నేరచరిత కలిగిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా చేయడంలో చొరవ తీసుకోవడం చాలా అవసరం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పిలవబడే భారతదేశంలో ఎన్నికల కోలాహలం ప్రారంభమయ్యింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందుగా జరుగుతున్న ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సందర్భంలో ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి సుప్రీంకోర్టు చొరవ తీసుకోవడం మంచి పరిణామం.
న్యాయం లేని చట్టం మానని గాయం
శాసన శాఖ చేసే చట్టాలు ప్రజలకు న్యాయం కల్పించలేని పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ తలుపులు తెరచుకుంటాయి. సాధరణంగా శాసన శాఖ చట్టాలను రూపొందిస్తే కార్యనిర్వాహక శాఖ వాటిని అమలు చేయాలి. ఆ చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో అని పరిశీలించేదే న్యాయశాఖ. మరీ అటువంటి చట్టాలతో న్యాయం జరగనప్పుడు న్యాయవ్యవస్థను ఆశ్రయించటం నేడు పరిపాటిగా మారింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్) పుణ్యమా అని న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత చేరువయ్యింది. ఆధునిక ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వ లక్షణాల్లో ‘స్వతంత్ర న్యాయ వ్యవస్థ’ చాలా ముఖ్యమైనది.
భారతదేశ రాజ్యాంగ పౌర చట్టాల పరిరక్షణలో న్యాయవ్యవస్థ క్రియాశీల పాత్ర వహిస్తుంది. అయితే ఇవి ఇచ్చే తీర్పులని బట్టి ప్రభుత్వంలోని నాయకులు న్యాయవ్యవస్థ తన పరిధిని దాటిందని విమర్శిస్తే, మరికొందరు న్యాయవ్యవస్థను ‘ప్రజాస్వామ్య సంరక్షకుడి’గా గుర్తించారు. ఇలా అన్ని విషయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న్యాయవ్యవస్థ పెండింగ్ కేసులతో పని ఒత్తిడి బాగా పెరిగింది. దీనికోసం సుప్రీంకోర్టులో గరిష్ట న్యాయమూర్తుల నియామకం చేయడం శుభ పరిణామం.
రాజ్యాంగ మరియు చట్టాల పరిరక్షణతో పాటు మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా సమన్యాయం కలిపించడానికి న్యాయవ్యవస్థకు ‘సృజనాత్మకత’, ‘పూర్తి స్వతంత్రత’ చాలా అవసరం. నిరంతరం శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖల వైఫల్యం, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయ పరిరక్షణ చేకూర్చేందుకు న్యాయవ్యవస్థ తనకు తాను పరిస్థితులకు అనుగుణంగా తీర్పులను ఇచ్చే ఆవశ్యకతను తెలియజేస్తుంది. దేశంలో లోక్‌పాల్, లోక్ అదాలత్, ట్రిబ్యునళ్ళు వంటి వ్యవస్థలను పూర్తిస్తాయిలో ఏర్పాటు చేసి పరిపాలన నాణ్యతలో న్యాయం చేకూరేలా కృషి చేయటంలో న్యాయ వ్యవస్థ తీరు ఇంకా మెరుగుపడుతుంది.
వ్యవస్థలన్నీ ప్రజలకు జవాబుదారులే!
భారతదేశ రాజ్యాంగం అన్ని చట్టాలకు మూలాధారం. ఇదే రాజకీయ వ్యవస్థకు మౌలిక లక్షణాలను కట్టబెట్టింది. రాజ్యాంగంలో పొందుపరచిన ఎటువంటి చట్టం అయిన దేశంలో నివసించే ప్రతి పౌరునికి, ప్రతి ప్రాంతానికి వర్తిస్తుంది. ప్రభుత్వ అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. రాజ్యాంగానికి సార్వభౌమాధికారం ప్రజలచే ఏర్పడింది. కావున న్యాయవ్యవస్థతో సహ, శాసన, కార్యనిర్వాహక శాఖలు ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిందే. ఈ మూడు భాగాలలో ఏ ఒక్కటి రాజ్యాంగం కంటే ఎక్కువ కాదు. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా రాజ్యాంగ చట్టాలకు లోబడే ఉంటుంది. రాజ్యాంగ అధికారాలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఆపాదించటమైంది.
రాజ్యాంగంలో ‘న్యాయసమీక్ష’ ప్రక్రియలో భాగంగా న్యాయవ్యవస్థ పరిమిత అధికారాలను మాత్రమే కలిగి ఉంది. అలా న్యాయ వ్యవస్థ దాని పరిధిలోనే ఉంటూ పూర్తి న్యాయం అందించాల్సి ఉంది. అంతేకాని ఈ పరిమిత అధికారాలను ఆసరాగా తీసుకొని పూర్తిగా రాజ్యాంగ సవరణ చేసే అధికారాలను విస్తృతపరచుకోజాలదు. అధికరణ 32, 141, 142 ప్రకారం న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని సమీక్షించే అధికారాన్ని విస్తరించుకోజాలదు. కాని శాసన, కార్యనిర్వాహక శాఖల వైఫల్యంతో న్యాయవ్యవస్థపై పని భారం పెరిగింది. ప్రభుత్వ పాలసీ విధానాలపై కూడా న్యాయ వ్యవస్థ తీర్పులను ఇచ్చే అవకాశం ఏర్పడింది. చివరగా న్యాయవ్యవస్థలో కూడా కొన్ని లోటుపాట్లు, విమర్శలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తన పరిధిని అతిక్రమించకుండా ‘రాజ్యాంగ పరిరక్షణ’ పాత్రను సమర్థవంతంగా పోషించటం వలన న్యాయవ్యవస్థపై రోజు రోజు ప్రజా విశ్వాసం పెరుగుతుందని చెప్పవచ్చు. న్యాయవ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా సత్వర పరిష్కార తీర్పులను ఆశించటం భావ్యం కాదని ప్రభుత్వం గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి.
- డా. చాకేటి రాజు
పొలిటికల్ అనలిస్ట్
96250 15131