పరీక్షా పేపర్ల మూల్యాంకన రేట్లు సవరించాలి!

by Ravi |   ( Updated:2025-03-18 00:30:30.0  )
పరీక్షా పేపర్ల మూల్యాంకన రేట్లు సవరించాలి!
X

ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పది పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు.. అయితే ఈ పరీక్షల విధులు కేటాయించిన ఉద్యోగులకు అందించే రెమ్యునరేషన్‌పై సర్వత్రా ఉపాధ్యాయుల్లో చర్చ కొనసాగుతోంది. గత అరు సంవత్సరాల క్రితం విడుదలైన జీవో.11 రేట్ల ప్రకారమే చీఫ్ సూపరిడెంట్లు, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లకు రూ.66, ఇన్విజిలేటర్లకు రూ.33 ఇప్పటికీ చెల్లిస్తుండడం గమనార్హం. అప్పటి రేట్లు ఇప్పటికీ ఏ మాత్రం సరిపోవడం లేదన్నది వాస్తవం. దీంతో ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించడానికి విముఖత చూపుతున్నారు. అలాగే పరీక్షా కేంద్రలో విద్యార్థులకు అందించాల్సిన సౌకర్యాలకు చెల్లిస్తున్న కంటింజెంట్ రూ.5 ఏ మాత్రం సరిపోవడం లేదు.

ఇక పరీక్షలు పూర్తయ్యాక జవాబు పత్రాల మూల్యాంకనంకి కూడా పాత రేట్లే చెల్లించడం శోచనీయం. ప్రతి జవాబు పత్రానికి టీఏ, డీఏ లేకుండా రూ.10 చెల్లిస్తున్నారు. అలాగే స్పెషల్ అసిస్టెంట్ల విషయంలోనూ అంతే.. వీరికి టీఏ, డీఏ లు చెల్లించకుండా రోజుకు కేవలం రూ.250 మాత్రమే చెల్లించడం కరేక్టేనా? 80 మార్కుల జవాబు పత్రానికి, 40 మార్కుల జవాబు పత్రానికి రూ.10 ఇవ్వడం ఎంతవరకు సమంజసం? దీని పెంపుపై ఉపాధ్యాయ సంఘాలు ప్రతి ఏటా మూల్యాంకన కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.

ఇంటర్మీడియేట్ పరీక్షలకు చెల్లిస్తున్న రేట్లకి, పది పరీక్షలకు చెల్లిస్తున్న రేట్లకీ భారీ వ్యత్యాసం కనిపిస్తొంది. ఇంటర్ పరీక్షల ఇన్విజిలేషన్‌కీ రూ.188 ఒక్కో జవాబు పత్రం మూల్యాంకనం చేయడానికి రూ.24 చెల్లిస్తున్నది. పదో తరగతి పరీక్షకు, ఇంటర్ పరీక్షలకు ఇంతటి వ్యత్యాసం ఎందుకో అర్థం కావడం లేదు. 5 లక్షలకు పైగా హాజరవుతున్న ఇట్టి పరీక్షలకు ఇంటర్మీడియేట్‌తో సమానంగా గౌరవప్రదమైన భత్యం చెల్లించాలి.

- సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747



Next Story

Most Viewed