- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ మళ్లీ దొరల పాలనలోకి...
మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఢిల్లీకి విచారణకు వెళ్లడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. దీనిపై ప్రతిపక్షాల విమర్శలు, అధికార బీఆర్‌ఎస్ ప్రతి విమర్శలతో మూడు రోజుల పాటు మీడియా హోరెత్తిపోయింది. బీఆర్‌ఎస్ బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధాలు పరస్పర విమర్శలకు ఈ అంశం కారణమైంది. 24 గంటలూ టీవీ ఛానళ్లు పోటీ పడి ఈ అంశానికి కవరేజి ఇచ్చి ప్రజలకు వినోదాన్ని పంచాయి.
కేసీఆర్ వ్యూహరచన ఇదే..
ఒక రకంగా చెప్పాలంటే మీడియా ఈ అంశానికి మితిమీరిన ప్రాధాన్యత ఇచ్చింది. కవిత అవినీతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి బీఆర్‌ఎస్, బీజేపీలు తీవ్రంగా పోటీపడ్డాయి. కానీ ప్రజలు ఈ విషయాన్ని మౌన ప్రేక్షకులుగా చూస్తుండిపోయారు. అధికారంలో ఉన్నవారు అవినీతికి పాల్పడితే ప్రతిపక్షాలు దానిపై దుమ్మెత్తి పోయడం తీవ్ర విమర్శలకు దిగడం సహజం. ఆరోపణలు ఎదుర్కొనేవారు దీనిని తీవ్రంగా ఖండించడం కూడా సహజం. కానీ కవితను ఈడీ విచారణకు పిలిపించినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది.
ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం విచారణకు కవిత ఢిల్లీ వెళ్లిన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మితిమీరి స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి తన కుమార్తెకు ఈడీ నోటీసులు ఇవ్వడం గురించి చర్చించడం సమంజసమేనా.. ఇదేగాక తన కుమార్తెకు సంఫీుభావం తెలపటం కోసం మంత్రివర్గ సమావేశం మధ్యలోనే మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్‌లను హుటాహుటిన ఢిల్లీకి పంపించారు. ఆ మరుసటి రోజు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ నాయకులు భారీగా ఢిల్లీకి వెళ్లి కవితకు సంఫీుభావం ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రంలో సైతం ఇదేవిధంగా బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డెక్కి బీజేపీ తమపై కక్షసాధింపులకు దిగుతోందంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఒకవేళ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే తమ కుటుంబంపై కేంద్రం కక్ష సాధిస్తోందని ప్రచారం చేసి దీనిని రాజకీయంగా వాడుకుని ప్రజల సానుభూతిని సంపాదించి వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి కేసీఆర్ వ్యూహరచన చేశారు.
కవిత కష్టం.. రాష్ట్ర ప్రజల కష్టమా?
ముఖ్యమంత్రి తన కుమార్తెకు చిన్న కష్టం కలిగితే పార్టీని, ప్రభుత్వాన్ని మొత్తం తన కుమార్తెకు అండగా మోహరించడం ఆశ్చర్యం కలిగించింది. బీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం ఉన్నది ముఖ్యమంత్రి కుటుంబ ప్రయోజనాలు కాపాడడానికా, ప్రజాప్రయోజనాలకా? అనే ప్రశ్నకు సీఎం సమాధానం చెప్పాలి. తన కుటుంబానికి కష్టం వస్తే అది మొత్తం తెలంగాణ సమాజానికి వచ్చినట్లని కేసీఆర్ చిత్రీకరిస్తున్నారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించే నాయకులు ఉన్న రోజులు అంతరించి... పాలకుల కష్టాలను తమ కష్టాలుగా ప్రజలు భావించాలనే నాయకత్వాలు నేడు దాపురించడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.
ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తన కుమార్తె కాలిలో గుచ్చుకున్న ముల్లుని ప్రజలు తమ పంటితో తీయాలంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం యువకులు చేసుకున్న బలిదానాలు అడ్డంపెట్టుకుని కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలు తమకు ఇంకేమీ అవసరం లేదని పదవులను తృణప్రాయంగా వదిలేస్తామని అప్పటి టీఆర్‌ఎస్ నాయకులు వాగ్ధానాలు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కుటుంబం నుంచి ఆరుగురు పదవులు స్వీకరించారంటే ఏమనాలి?
తామే దైవ దూతలమనే విధంగా..
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రజాస్వామ్యం అనేది లేదు. అధికారంలో ఉన్నవారి కుటుంబాలకు పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు బానిసలుగా పడి ఉండాలి. వారి అడుగులకు మడుగులు ఒత్తితేనే పదవులు. ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులకు సాగిలపడి మొక్కాలి. వారి పుట్టినరోజులు వచ్చాయంటే ఊరూవాడా పండుగలతో బీఆర్‌ఎస్ నాయకులు పోటీలుపడి కేక్‌లు కోస్తూ పండగలు చేస్తున్నారు. పత్రికల నిండా పోటీలు పడి ప్రకటనలు ఇచ్చి కోట్లు ఖర్చు పెడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి బారులు తీరి నిలబడి బొకేలు, పూలదండలు, బహుమతులతో వారిని ముంచెత్తుతున్నారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని మహారాజ కుటుంబంగా చేసి వందిమాదుగలను తలదన్నే విధంగా కీర్తిస్తున్నారు. అధికారంలో ఉన్నవారి కుటుంబానికి సాగిలపడి మొక్కితే తప్ప వారికి పదవులు దక్కవనే స్థితిని కేసీఆర్ కుటుంబం కలిగించింది. ఎవరైనా పార్టీలో స్వతంత్రించి తలెత్తితే ఈటల రాజేందర్‌కు పట్టిన గతే మీకూ పడుతుందని కేసీఆర్ సందేశం పంపారు. బీఆర్‌ఎస్ నాయకులంతా తన కుటుంబానికి ఊడిగం చేయాలని, తాము దైవ దూతలమని తెలంగాణ రాష్ట్రానికి తాము తప్ప మరెవరూ గతి లేదని, తమ కుటుంబాన్ని కీర్తిస్తూ ఉండాలని ఆయన భావిస్తున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభోత్సవాలు జరగాలన్నా అక్కడ మంత్రి కేటీఆర్ ప్రత్యక్షమై రిబ్బన్ కటింగ్‌లు చేస్తూ ముఖ్యమంత్రి మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఏవైనా ప్రారంభోత్సవాలు చేయాలంటే ఆయా శాఖల మంత్రులు చేయాలి. లేదా ముఖ్యమంత్రి చేయవచ్చు. కానీ ఆయా శాఖల మంత్రులు వెర్రివాళ్లలాగా పక్కన నిలబడి చూస్తుంటే కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మంత్రులందరికీ ఒకే విధమైన అధికారాలు ఉంటాయి. దానిని పక్కనపెట్టి మంత్రులను బానిసలుగా మార్చి కేటీఆర్ అన్నీతానై వ్యవహరిస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న కవితను హోదాను మరిచి మంత్రులు తలలు వంచి మొక్కుతున్నారు. తెలంగాణలో మళ్లీ దొరల పాలన వచ్చిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.
కవిత రాష్ట్రానికి మహారాణా?
ఈడీ విచారణపై కవిత తెలంగాణ సమాజం తలవంచదని ప్రకటించారు. అంటే తాను తలవంచితే తెలంగాణ సమాజం తలవంచినట్లని ఆమె చెబుతున్నారా? తనని తాను తెలంగాణ తల్లిగా ఆమె భావిస్తున్నారా? తాను పాల్పడిన అవినీతి తెలంగాణ సమాజం మొత్తం చేసినట్లుగా ఆమె చెబుతున్నారా? తెలంగాణ సమాజం మొత్తానికి తాను మహారాణినని భావిస్తున్నట్టున్నారు. ఆమె హావభావాలు స్పష్టంగా దీనినే ప్రదర్శిస్తున్నాయి. ఈ అధికార దర్పాన్ని తెలంగాణ ప్రజలు సహించరు. ఈ విధంగా అహంకరించినందుకే గత ఎన్నికల్లో కవితను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. అయినా జ్ఞానోదయం కాలేదు. తాము ఏమి చెప్పినా తెలంగాణ ప్రజలు గొర్రెల మాదిరిగా తలలు ఊపుతారనే భ్రమలో కేసీఆర్ ఉన్నారు. తమ పార్టీ పేరులోంచి తెలంగాణను తొలగించి, ఈ రోజు తన కుమార్తెకు కష్టం వచ్చిందని తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ పైకి తేవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు అంత వెర్రివాళ్లు కాదు. తనకు అవసరం వచ్చినప్పుడల్లా సెంటిమెంట్‌ను పైకి తెచ్చి ప్రజలను రెచ్చగొడదామనుకుంటే అది నడవదని కేసీఆర్ తెలుసుకుంటే మంచిది.
- చల్లా శ్రీనివాసరావు,
రాజకీయ విశ్లేషకులు
srinivaskingdom99@gmail.com
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ ౭౯౯౫౮౬౬౬౭౨
Also Read: బిగ్ న్యూస్: ఇతర రాష్ట్రాల్లో పోటీకి BRS సై.. నేషనల్ పాలిటిక్స్ టార్గెట్‌గా కేసీఆర్ మాస్టర్ ప్లాన్!
ఫ్యామిలీ ప్యాకేజీ.. ఒకేసారి గర్భం దాల్చిన అత్త, కోడలు, అమ్మ, అమ్మమ్మ (వీడియో)