తెలంగాణ బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి రోడ్ మ్యాప్

by Ravi |   ( Updated:2024-02-11 01:00:13.0  )
తెలంగాణ బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి రోడ్ మ్యాప్
X

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో వారి ప్రాధాన్యాలు వివరిస్తూ, ఎన్నికల మేనిఫెస్టోను గమనంలోకి తీసుకొని రాబోయే ఐదేళ్ళ రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ రూపొందించారు. యువతను దృష్టిలో ఉంచుకొని నియామకాల ప్రక్రియను తొందరగా చేస్తామని ప్రకటించడం వల్ల నిరుద్యోగ యువతలో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడ్డది. సంక్షేమ పథకాలు రూపొందిస్తూనే, విద్య, వైద్య రంగాలకు నిధులు పెంపు విషయంలో ఈ బడ్జెట్లో ముందడుగు పడ్డది.

కేంద్ర ప్రభుత్వ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.2,75,891 కోట్లతో ఈరోజు విధాన సభలో, శ్రీధర్ బాబు విధాన పరిషత్‌లో ప్రవేశపెట్టారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ విద్య వైద్యం,వ్యవసాయం మౌలిక సౌకర్యాలు, ఉపాధి కల్పనలకు ప్రాధాన్యతను ఇచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ని జనరంజకంగా,రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. వాస్తవాలకు పూర్తిగా దగ్గరగా ఉందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం 6 గ్యారంటీలకు రూ.53,196 కోట్లు కేటాయించడం ద్వారా తమ చిత్తశుద్ధిని చాటారు. కేవలం నిధులే కాకుండా వాటిని ఆచరణ సాధ్యం చేస్తే ప్రజాభిమానం చూరగొంటారు.

ఆరు గ్యారంటీలు కీలకం

ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలు కోసం 2024-25 బడ్జెట్‌లో అత్యధికంగా రూ.53,196 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఐటీ శాఖకు రూ.774 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1,250 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.28,024 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు కేటాయించింది.రైతుల 2 లక్షల రుణమాఫీ కోసం త్వరలోనే కార్యాచరణ మొదలుపెడతామని ప్రకటించింది ప్రభుత్వం. అలాగే విద్యరంగానికి గత బడ్జెట్ కన్నా ఎక్కువ నిధులే కేటాయించారు. పైగా విద్యార్థుల్లో నైపుణ్య శిక్షణ పెంపు కోసం ప్రత్యేక దృష్టి పెడతామని 65 ఐటీఐలను నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా మార్చనున్నామని తెలపడం హర్షణీయం.

ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని దానికి నిధులు కేటాయించడం సంతోషమే, కానీ ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలలకు మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాల్సి ఉంది. నిధుల కొరతతో ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో కరెంట్ బిల్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేసిన బడ్జెట్లో ప్రభుత్వ బడులకు ఉచిత కరెంటు ఇస్తే బాగుండేది. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం విద్యా కమిషన్ ప్రకటించి ఉంటే బాగుండేది.

అభివృద్ధి సూచికలో వృద్ధే లక్ష్యం

వైద్య రంగానికి ఈ బడ్జెట్లో రూ.11500 కోట్లు కేటాయించి పేదలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం, వైద్యరంగంలో మౌలిక సౌకర్యాల కల్పన, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేయడం వాటిలో ఉద్యోగాలు నియమించడం వల్ల వైద్య రంగంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగేందుకు కృషి చేస్తామని అన్నారు. ముఖ్యమైన వైద్య రంగంపై మరింత దృష్టి పెట్టాలి. మానవాభివృద్ధి సూచికలో 2021 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలో 21వ స్థానంలో ఉంది. విద్య వైద్యానికి పెద్దపీట వేసిన రాష్ట్రాలు కేరళ, గోవా, చండీగఢ్, ఢిల్లీ అభివృద్ధి సూచికలో ముందు వరుసలో ఉన్నాయి. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ కేటాయింపులు మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే మానవ అభివృద్ధి సూచికలో మన రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుంది.

యువతకు నమ్మకం పెరిగింది

యువతను దృష్టిలో ఉంచుకొని నియామకాల ప్రక్రియను తొందరగా చేస్తామని ప్రకటించడం వల్ల నిరుద్యోగ యువతుల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడ్డది. ఈ నమ్మకాన్ని నిలుపుకునేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని యువత ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఒక ముందడుగు. రాష్ట్రంలోని యువత నైపుణ్యవందంగా మారడానికి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెంపొందడానికి ఈ స్కిల్ యూనివర్సిటీ ఉపయోగపడుతుంది.

రాష్ట్రంలోని పేదలకి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో ₹7740 కోట్లు కేటాయిస్తూ, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశారు. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు కేటాయించి అర్హులైన పేదలకు అందించాలి. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదవారు ఉండకుండా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగ ఉపాధ్యాయులు 3,50,984,కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 3,46,681,వివిధ కార్పొరేషన్ లో ఉన్న ఉద్యోగులు 1,69,449,పెన్షనర్లు 288,416 వీరందరూ కూడా డి ఏ బకాయిలు,పి ఆర్ సి కేటాయింపులు ఉంటాయని ఆశించారు. రాబోయే పూర్తిస్థాయి బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆలోచనలు, ఆశయాలు పూర్తిస్థాయిలో ఆచరించి చూపిస్తే ప్రజాభిమానం చూరగొని ప్రజా ప్రభుత్వంగా చరిత్రలో నిలుస్తుంది. ఆ దిశగా నూతన ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిద్దాం.

పాకాల శంకర్ గౌడ్

98483 77734

Advertisement

Next Story

Most Viewed