- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీళ్ల అణచివేతే.. భారత చరిత్ర!
భారతదేశంలో కథకున్న ప్రాధాన్యం చరిత్రకు లేకపోయింది. చరిత్రను మొదటి నుండి నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. నిజానికి చరిత్ర పరికరాలకు, ఉత్పత్తి పరికరాలకు అవినాభావ సంబంధం ఉంది. భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని ఎవరు అర్థం చేసుకున్నారో, భారతదేశంలో ఉత్పత్తి క్రమాన్ని ఎవరు రూపొందించారో, ఇక్కడ కొండలు, లోయలు, జలపాతాలకు అనుగుణంగా ఎవరు తమ జీవన వ్యవస్థలను తీర్చి దిద్దుకున్నారో, ఎవరు భారతదేశ సంస్కృతీ వికాసానికి నిలువెత్తు సాక్ష్యాలో, ఎవరి అడుగుల చప్పుళ్ళతో ఇక్కడ కొండలు పులకరిస్తాయో, ఇక్కడ నేల పండి వొరుగుతుందో, ఎవరు అనేక తాత్విక ధారలకు సృష్టికర్తలో, ఆ మూలవాసులకు అస్పృశ్యులు అని పేరు పెట్టారు. వారి అణచివేతనే భారతదేశ చరిత్రగా తీర్చిదిద్దారు. దళిత రాజులను దేవుళ్లు అణచివేసిన కథే భారత చరిత్ర.
అంబేద్కర్ దృష్టిలో భారతదేశ నిర్మాతలు దళితులు. వారి రాజ్యాలను కొల్లగొట్టిన ఆర్యులు వారి నాయకులని చంపిన కథలను బయటకు తీసుకొచ్చారు. దళితులను అణగదొక్కడానికి హిందువులు చాలా దేవుళ్ళను సృష్టించారు. ఆ దేవుళ్ళ చేత దళిత రాజులను అణచివేశారు. అనేక సందర్భాల్లో దళిత రాజులను వధించి పండగలు చేసుకున్నారు. దళితుల చేతే ఆ పండగలను చేయించారు కూడా. హిందువులు చివరకు మీరు అస్పృశ్యులుగా ఉండటం మీకు మేలు అన్నంత దూరం వెళ్ళారు. దళితుల్లో అమాయకత్వం వుంది. అనేక సందర్భాల్లో ద్విజుల మాటలకు వీరు మోసపోతూనే ఉంటారు. తాము సృష్టించిన మూఢాచారాలను మాత్రమే వీరు దళితుల వద్దకు ప్రచార రూపంలో పంపిస్తారు.
ఇంతమంది దేవుళ్లా?
దళితులను అణగదొక్కడానికి బ్రాహ్మణులను దేవుళ్ళనే అస్త్రాలుగా వాడారు. అయితే హిందువులకు ఒక దేవుడు లేడు. రాముడు శంభూకుడిని చంపిన ఘట్టం హృదయ విదారకరమైంది. ఎందుకంటే మీరు వేదాలు సృష్టించారు. వాటిని చదివే హక్కు అందరికీ ఇవ్వాలి. వేదాలు చదివాడనే పేరుతో ఒక శూద్ర శంభూకుని తల నరకడం ఒక అమానుష దృశ్యం కదా! ఆ చర్యను హిందువులు కొనియాడడం, శూద్ర హిందువులు కొనియాడడం అమాయకత్వం కదా! అంబేడ్కర్ ఇలా అన్నారు. ‘‘హిందువులంతా కొలిచే దేవుణ్ణి నేను కొలుస్తాను కాబట్టి నేను హిందువును’’ అని ఒకవేళ ఎవరైనా చెప్పినా, అది నిజమైన జవాబు కాదు. ఎందుకంటే హిందువులందరూ ఒకే దేవుణ్ణి కొలవరు కాబట్టి హిందువులలో కొందరు ఏక దేవతారాధకులు, కొందరు బహు దేవతారాధకులు, మరికొందరు సర్వ దేవతారాధకులు.
ఏక దేవతారాధకులు అని చెప్పబడే హిందువులు కూడా అందరూ ఒకే దేవుణ్ణి కొలవరు. కొందరు విష్ణువును కొలుస్తారు. కొందరు శివుణ్ణి, కొందరు రాముణ్ణి, కొందరు కృష్ణుణ్ణి కొలుస్తారు. కొందరు పురుష దేవుళ్లను కొలవరు. స్త్రీ దేవతలను కొలుస్తారు. వారు కూడా ఒకే స్త్రీ దేవతను కొలవరు. రకరకాల స్త్రీ దేవతలను కొలుస్తారు. కొందరు కాళికాదేవిని పూజిస్తారు. కొందరు పార్వతిని పూజిస్తారు. మరికొందరు లక్ష్మిని పూజిస్తారు.
ఆహారంలోనూ పక్షపాతమే!
పూర్వకాలంలో దేవతలకు మాంసాహారాన్ని ముందుగా వడ్డించేవారు. ఇప్పటికీ కొందరు దేవతలకి మాంసాహారాన్ని వడ్డిస్తారు. అంచేత మాంసాహారమనేది చాలా సాధారణమైనది. బ్రాహ్మణుల నుంచి శూద్రుల వరకు అందరూ పూర్వం మాంసం తినేవారు. పశువుల, పక్షుల, చేపల, మాంసాలను గురించి ధర్మ సూత్రాలలో బోలెడు నియమాలున్నాయి. ఏదుపంది, కుందేలు (చెవులపిల్లి) స్వవిధ్ (మగ ముళ్లపంది), ఉడుము, ఖడ్గమృగం, తాబేలులను తప్పించి ఏ రకమైన పంచనఖ (5 గోళ్లు) కల్గిన జంతువుల మాంసాన్ని భుజింపకూడదని గీత 1727.31, ఆపస్తంబ ధర్మ శాస్త్రం 51.6 శంఖలిఖిత (అపరార్కుడు ఉదహరించినది పుట 1167), రామాయణం కిష్కిందకాండ (17.39), మార్కండేయ పురాణం (3524) ప్రతిపాదిస్తున్నాయి. వేదాలను బోధించే ఉపాధ్యాయుడు మాంసం వాడకాన్ని నిషేధించాలని ఆ.ప.ధ.శా (112,5,1) చెబుతున్నది. అందరూ ఇష్టంగా ఆరగించే మాంసాహారం విషయంలో రానురానూ అనేక నియమాలు విధించి శాకాహారానికి లేని పవిత్రతను ఆపాదించారు.
రామాయణం లక్ష్యం ఇదేనా?
అలాగే రామాయణంలో రాముని పాత్రను దండయాత్రలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. అందుకే దానిని ‘రామాయణము’ అని పేరు పెట్టారు. రాముని ఆయనము రామాయణము. ఆయనము అంటే ప్రయాణం. ఆ ప్రయాణం అంతా దండయాత్రలతోనే జరిగింది. బయలుదేరింది రాముడు, సీత, లక్ష్మణుడు. కాని 14 ఏండ్ల లోపు దండకారణ్యమంతా వారి ఆధీనంలోకి వచ్చింది. ఈ రామాయణ గాథనే గుప్తులు మరలా తిరిగి రాయించడానికి కారణం, రాముడు, ఏ కుతంత్రాలను ఆచరించాడో, రాజ్యంలో హిందూ రాజ్యంలో వాటిని అనుసరించాలని దృక్పథం. అందుకే రామాయణ గాథను పదే పదే ప్రచారం చేశారు. రాముణ్ణి ఆకాశానికి ఎత్తేశారు. సీతను మాత్రం దురాక్రమణను ప్రశ్నించే వ్యక్తిగా నిలబెట్టారు. వాలి, సుగ్రీవుల విషయంలో, సుగ్రీవుని పక్షం వహించి వాలిని చంపటం, సీతను ఎత్తుకెళ్ళాడనే నెపంతో రావణుడిని లంకను ఆక్రమించటం, ఈ దురంతాలన్ని సీతకు తెలుసునని ఆమెను అనుమానించి అగ్నికి ఆహుతి చేయటం, ఈ ఘట్టాలన్ని కూడా హిందూ రాజులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఉత్తర భారతదేశం నుండి, దక్షిణ భారతదేశానికి విస్తరించటంలో రామాయణ, భారతాలను సామ్రాజ్యాధిపతి కార్యాచరణగా మలుచుకున్నారు. ఈ క్రమంలో గుప్తులు ఎలా దక్షిణానికి విస్తరించారో అనేది చరిత్రకారులు సోదాహరణంగా వివరించారు.
నిజానికి కొన్ని శూద్ర కులాలు ఇప్పుడు రామాయణాన్ని తలకెత్తుకుంటున్నారు గానీ, డా. బి.ఆర్.అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్, త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి వారు రామాయణం శూద్రుల విద్యకు వ్యతిరిక్తమైందని, బ్రాహ్మణ, క్షత్రియులు కలిసి శూద్ర, అతిశూద్రుల విద్యను ధ్వంసం చేయడానికే రామకథ, రామ మందిరాలను ఉపయుక్తం చేసారని వాదించారు. ఈ దిశగా శాస్త్రీయమైన ఆలోచనలు చేయాల్సిన చారిత్రక సందర్భమిది.
డా. కత్తి పద్మారావు
98497 41695