- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అపహాస్యపు చెరకు మద్దతు ధర !
చెరకు సేద్యం నేడు తీవ్ర సంక్షోభంలో ఉంది. చెరకు పంట విస్తీర్ణత తగ్గుతూ వస్తున్నది. పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే అందుకు కారణంగా ఉంది. అందుకు 2023-24 సంవత్సరానికి చెరకుకు ప్రకటించిన ప్రోత్సాహక మద్దతు ధరే నిదర్శనం. దేశంలో 5 కోట్ల కుటుంబాలు చక్కెర రంగంపై ఆధారపడి ఉన్నాయి. బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా పంచదార ఉత్పత్తి చేస్తున్నది భారతదేశమే. ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా 17%గా ఉంది. చెరకు సాగు రికవరి, పంచదార ఉత్పత్తిలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చెరకు ఉత్పత్తిలో 80% ఈ మూడు రాష్ట్రాలే కలిగి ఉన్నాయి. 2015-16లో దేశంలో 2.72 కోట్ల టన్నులున్న పంచదార 2017-18 నాటికి 3.23 కోట్ల టన్నులకు పెరిగి 2019-20 నాటికి 2.72 కోట్లకు తగ్గింది. ప్రారంభంలో ఎంతో అనుకూలంగా ఉన్న చెరకు సాగు నేడు తీవ్ర సంక్షోభంలో కొనసాగుతున్నది.
ప్రస్తుతం దేశంలో మనుగడలో ఉన్న చక్కెర కర్మాగారాలు 500 పైగా ఉన్నాయి. వీటిల్లో 215 కర్మాగారాలకు డిస్టిలేషన్ సామర్థ్యం ఉంది. 121 చక్కెర మిల్లులు ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 29 చక్కెర మిల్లులు ఉండగా 17 మిల్లులు మూత పడ్డాయి. తెలంగాణలో 7 మిల్లులు మాత్రమే పనిచేస్తున్నాయి. దేశంలో చక్కెర మిల్లుల ప్రధాన ఉత్పత్తి పంచదార. ముడి పంచదారను తెచ్చి ప్రాసెస్ చేసి తిరిగి పంపించడం. చెరకు గానుగ ఆడగా వచ్చే మెలాసిస్, చెరకు పిప్పి తదితరాల ద్వారా మిల్లులకు ఆదాయం వస్తుంది.
ఉత్పత్తి ఖర్చు-దిగుబడి
ఆంధ్రప్రదేశ్‌లో 49వేల హెక్టార్ల లో నేడు చెరకు సేద్యం జరుగుతున్నది. చెరకు సేద్యం ప్రారంభంలో రైతుకు ఉచితంగా విత్తనం, రెండు బస్తాల ఎరువులు, 4 వేల ఆర్థిక సహాయం ఫ్యాక్టరీ యజమానుల నుంచి లభించేది. ఇప్పుడు అటువంటి ప్రోత్సాహకం రైతుకు లభించటం లేదు. పాలకుల విధానాల ఫలితంగా విత్తనం, ఎరువులు, పురుగు మందులు, డీజీల్ ధర విపరీతంగా పెరగటంతో నేడు ఎకరా ఉత్పత్తి ఖర్చు 65 వేలు. కౌలు ఖర్చు 30 వేలు కలిపితే 95 వేలకు చేరుకున్నది. సగటు దిగుబడి ఎకరాకు 32 టన్నులు. చాలా మంది రైతులకు సగటు దిగుబడి కూడా రావటం లేదు.
చెరకు మద్దతు ధర
మద్దతు ధరల నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ప్రకటించటం లేదు. చెరకు మద్దతు ధర అందుకు మినహాయింపు కాదు. రైతుల అన్ని రకాల పంట ఖర్చులను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం చెరకు మద్దతు ధరలను ప్రకటిస్తున్నది. చెరకు మిల్లుల యజమానుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ధర నిర్ణయిస్తుంది. పది లేక పదిహేను రూపాయలకు మించి మద్దతు ధర ఏ సంవత్సరంలోనూ పెరగటం లేదు. పంట ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. 2022-23 సంవత్సరానికి మోదీ ప్రభుత్వం 290 రూపాయల మేరకు మద్దతు ధర ప్రకటించి ఆ తర్వాత ప్రోత్సాహక ధరగా క్వింటాల్ చెరకుకు 305 రూపాయలు ప్రకటించి రైతాంగానికి ఎంతో మేలు చేసినట్లుగా ప్రచారం చేసుకున్నది. ఈ ధర రావాలంటే పంచదార రికవరీ రేటు 10.25% ఉండాలి. దీనిపై ప్రతి 0.05 ఎక్కువ రికవరీ రేటుకి రూ.3.05 క్వింటాల్ కి ప్రీమియం అందిస్తోంది. రికవరీలో 0.1 % తగ్గుదల ఉంటే ప్రాధమిక ధరలో రూ.3.05 తగ్గుతుంది. ఈ ధరతో రైతాంగానికి పెట్టుబడి కూడా రాదు.
తెలుగు రైతులకు అన్యాయం
ఆంధ్రప్రదేశ్‌లో సగటు దిగుబడి 32 టన్నుల ప్రకారం ఎకరాకు వచ్చేది 96 వేల 160 రూపాయలు మాత్రమే. సొంత భూమి రైతుకు మిగులు కన్పించినా, కౌలు రైతులకు ఏమి మిగలదు. పైగా పది రూపాయల పెంపు పెంపే కాదు. ఈ పెంపుతో మోదీ ప్రభుత్వం రైతాంగాన్ని అవమాన పర్చింది. ఈ పెంపు అదనంగా పెరిగిన పంట ఖర్చుకు కూడా సరిపోదు. రైతాంగం కోరుతున్నది క్వింటాల్‌కి 500 రూపాయలు. కర్ణాటక, మహారాష్ట్రలో చెరకు పండించడం, నరకడం వరకే రైతు బాధ్యత. పొలం నుండి పంటను తీసుకు వెళ్లడం పూర్తిగా కర్మాగారాల బాధ్యత. కర్ణాటకలో ప్రభుత్వ పరిశ్రమలు, రైతుకు ప్రోత్సాహక ధరతో పాటు చెరకు నరికే ఖర్చు కూడా ఇస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి రైతులకు దక్కటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2022-23లో క్వింటాల్ చెరకు మద్దతు ధర 280రూపాయలగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కూడా రాష్ట్రంలో లభించటం లేదు. ఇదేనా వైసీపీ ప్రభుత్వ రైతు పక్షపాతమంటే? ఈ ధర ప్రకారం రైతుకు తీవ్ర నష్టం జరిగింది. అనేక రాష్ట్రాలు అదనంగా ప్రోత్సాహక ధరను ప్రకటిస్తే, వైసీపీ ప్రభుత్వం మౌనం వహించింది. చెరకు సేద్యం వలన నష్టపోతున్న రైతాంగం సేద్యం నుంచి క్రమంగా వైదొలగుతున్న ఫలితంగా లక్ష హెక్టార్ల సేద్యం 60 వేల హెక్టార్లకు పడిపోయింది.
రైతాంగానికి బకాయిలు
అనేక సమస్యల మధ్య చెరకును ఉత్పత్తి చేస్తున్న రైతాంగానికి చెరకు విక్రయం, న్యాయమైన ధర సమస్యగా ఉంది. ఈ సమస్యలే కాకుండా విక్రయించిన చెరకుకు డబ్బులు పొందటం మరొక సమస్యగా మారింది. చెరకు కొనుగోలు చేసిన 14 రోజుల్లో మిల్లుల రైతుకు డబ్బులు చెల్లించాలి. అలా చెల్లించిన పక్షంలో వడ్డీతో సహా రైతుకు ఇవ్వాలి. కానీ మిల్లు యజమానులు దీన్ని అమలు జరపడం లేదు. ప్రభుత్వాలు అమలయ్యే చర్యలు తీసుకోవడం లేదు. అనేక మంది మిల్లు యజమానులు రైతులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలను సంవత్సరాల తరబడి చెల్లించక పోవటంతో వారు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. 2020-21 క్రషింగ్ సీజన్ ముగించే నాటికి ఉత్తరప్రదేశ్‌కి చెందిన అతిపెద్ద చక్కెర మిల్లు రైతులకు 12,733.61 కోట్లు, మహారాష్ట్ర లో అతిపెద్ద చక్కెర మిల్లు 4,190.20 కోట్లు రైతులకు బకాయిలు పడ్డాయి. కర్ణాటక, పంజాబ్, హర్యానా, తెలంగాణలో కూడా వందల కోట్ల మేరకు మిల్లు యజమానులు రైతులకు చెల్లించాల్సిన బకాయలు ఉన్నాయి. ఆంధప్రదేశ్‌లో రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయలు 150 కోట్ల దాకా ఉన్నాయి. సేద్యం గిట్టుబాటు కాక అప్పుల్లో ఉన్న రైతులకు ఎటువంటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించని మోదీ ప్రభుత్వం నష్టాల పేరుతో మిల్లు యజమానులకు వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.
మిల్లులకు నష్టాలా?
పంచదార కేజీ ఉత్పత్తి ధర 37 ఉంటే విక్రయ ధర 31 రూపాయలుగా ఉండటం వలన నష్టపోయి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించలేక పోతున్నామని మిల్లు యజమానులు చెబుతున్నారు. ఇది వాస్తవం కాదు. నేడు ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ మార్కెట్లో కేజీ 52రూపాయల పైగా ఉంది. టన్ను చెరకుకు 3050 రూపాయలు ఇచ్చినా ఖర్చులన్నీ పోనూ ఎకరా చెరకు(32టన్నులు)పైన మిల్లు యజమానులకు 10వేలకు పైగా మిగులుతుంది. ఈ మిగులు కాకుండా మొలాసిస్, పిప్పి తదితర ఉప ఉత్పత్తుల ద్వారా వేలల్లో మిల్లులకు ఆదాయం వస్తున్నది. ఈ వాస్తవాన్ని గమనిస్తే మిల్లులకు నష్టమనేది వాస్తవం కాదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి పంచదార చౌకగా లభించటంతో దిగుమతి చేసుకోవడం తమకు నష్టమనే కారణాలు ముందుకు తెస్తున్నారు. పంచదార ఉత్పత్తి కన్నా ఇథనాల్ ఉత్పత్తి మిల్లులకు ఎక్కువ లాభసాటిగా ఉండటంతో పంచదార ఉత్పత్తి నుంచి వైదొలగేందుకు సిద్ధమౌతున్నారు.
చెరకు సేద్యం సంక్షోభానికి, రైతుల ఆత్మహత్యలకు మోదీ ప్రభుత్వం చెప్పే కారణాలు తన బాధ్యత నుంచి తప్పించుకునే విధంగా ఉంది. సోలాపూర్ జిల్లాలో హైవే ప్రారంభోత్సవంలో మోదీ సమక్షంలో మంత్రి నితిన్ గడ్కరీ చెరకు సంక్షోభం మనం సృష్టించింది కాదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వల్ల ఏర్పడిందని, బ్రెజిల్ పంచదార రేటు చౌక కావడం అనేది మన చెరకు రైతుల, కర్మాగారాల సంక్షోభానికి కారణమని, చెరకు సేద్యం పంచదార ఉత్పత్తికి కాకుండా ఇథనాల్ ఉత్పత్తి కోసం చేయాలని, ఇథనాల్ ఉత్పత్తి కోసం 4,400కోట్ల పథకం ప్రకటించామని చెప్పారు. దీన్ని గమనిస్తే పంచదార కాకుండా ఇథనాల్ ఉత్పత్తిని కేంద్రం ప్రోత్సహిస్తోందని, ఆ మేరకు పంచదారను దిగుమతి చేసుకోనున్నదని వెల్లడవుతుంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ, టన్ను చెరకుకు మద్దతు ధర 5వేలు ప్రకటించాలని, నాణ్యమైన విత్తనం అందించాలని, పంచదార కొనుగోలు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని చెరకు రైతులు ఉద్యమించాలి.
బొల్లిముంత సాంబశివరావు
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు కూలీ సంఘం
98859 83526