అసమాన మేధావి శకుంతలా దేవి

by Ravi |   ( Updated:2022-11-03 18:45:17.0  )
అసమాన మేధావి శకుంతలా దేవి
X

మె అంక గణితంలో నిపుణురాలు. గణితావధాని. వేగంగా గణన చేయగల మేధావి. అందుకే ఆమెను మానవ కంప్యూటర్ అని పిలుస్తారు. శతాబ్దంలో ఏ తేదీని అయినా ఏ రోజో చెప్పగలిగిన అసాధారణ ప్రజ్ఞాశాలి. 'మైండ్ డైనమిక్స్' అని పిలిచే భావనను అభివృద్ధి చేసినవారు. ఆమే కంప్యూటర్ కన్నా గొప్ప గణకురాలిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి. 4 నవంబర్ 1929న బెంగళూరులోని బ్రాహ్మణ పూజారుల కుటుంబంలో జన్మించారు. తాత దగ్గర నుంచి గణితంలో తొలి శిక్షణ పొందారు. తన ఐదో యేటనే సంక్లిష్ట మానసిక అంక గణితంలో నిపుణురాలిగా గుర్తింపు పొందారు. ఆ వయసులో ఆమె క్యూబ్ మూలలను లెక్కించడం, గణిత సమస్యలు పరిష్కరించడం చేసేవారు.

ఆ తర్వాత యేడు మైసూర్ విశ్వవిద్యాలయంలో తన ప్రతిభను ప్రదర్శించారు. ఎనిమిదేళ్ళ వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఇచ్చిన ప్రదర్శనతో బాలమేధావిగా మారారు. శకుంతలాదేవి 1960లో కోల్‌కతాకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ, త్వరలోనే విడిపోయారు. ఈ ఘటన ఆమె మానవత్వం గురించి పరిశోధించడానికి, 1977లో 'ది వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్' అనే పుస్తకం రాయడానికి ఉపయోగపడింది. శకుంతలాదేవి మానవత్వాన్ని చాటుకునే తపనతో తన జీవితాన్ని గురించి ప్రసంగాలు చేశారు. మానవ మనస్సును కంప్యూటర్లతో పోల్చడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్త ప్రదర్శనలు

శకుంతలా దేవి తన గణిత ప్రతిభను ప్రదర్శిస్తూ అనేక దేశాలలో పర్యటించారు. తండ్రితో కలిసి 1944లో లండన్, 1950లో ఐరోపా, 1976లో న్యూయార్క్ నగరంలో ప్రదర్శనలు ఇచ్చారు. 1988లో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సస్ శకుంతలా దేవి ప్రతిభ చూసి అవాక్కయ్యారు. 1977లో అమెరికాలో ఒక కంప్యూటర్‌తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో పోటీ పెట్టగా ఆమె కంప్యూటర్‌ను ఓడించారు.

1980 జూన్‌లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలాదేవిని 13 అంకెలు గల రెండు సంఖ్యలను హెచ్చవేస్తే ఎంత వస్తుందని ప్రశ్నించగా, కంప్యూటర్ కంటే ముందుగా 28 సెకన్లలో సమాధానమిచ్చారు. దీంతో గిన్నిస్ బుక్ రికార్డు ఆమె సొంతం అయింది. 1969 లో ఫిలిప్పీన్స్ విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట మహిళా పురస్కారం, 1988లో వాషింగ్టన్ డీసీలో రామానుజన్ మ్యాథమెటికల్ జీనియస్ అవార్డు స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించారు. తన 83 వ యేట 21 ఏప్రిల్ 2013న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

అందులో ఉన్నత విద్య తక్కువే

ప్రాచీన కాలం నుంచి ఎంతో మంది భారతీయులు గణిత శాస్త్రాలను అభివృద్ధి పరుస్తూ వచ్చారు. భారతీయ గణిత ఆవిష్కరణలలో సున్నా వాడకం, బీజ గణితం ముఖ్యమని చెబుతారు. ప్రపంచంలో మేధావులుగా గుర్తించబడిన ఆర్యభట్ట, వరాహ మిహిరుడి కాలం నుండి అంకగణిత ప్రాధాన్యత ఉన్నప్పటికి దేశంలోని విద్యార్థులలో గణిత ఫోబియా అధికంగా ఉంది. ఉన్నత చదువులలో గణితాన్ని ఎంచుకునే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది.

దేశంలో సుమారు 1.3 మిలియన్ పాఠశాలలు, 800 విశ్వవిద్యాలయాలు కలిగి ఉన్నా గణిత ఉపాధ్యాయుల సంఖ్య నానాటికీ దిగదుడుపే అవుతున్నది. ఇంజనీరింగ్, ఉత్పత్తి సమాచార, సాంకేతికత, అంతరిక్ష తదితర రంగాలలో గణిత శాస్త్ర నిపుణుల అవసరం ఉంది. ప్రభుత్వాలు గణిత శాస్త్ర నిపుణులను తయారు చేయాలి.

(నేడు శకుంతలా దేవి జయంతి)


సంగనభట్ల రామకిష్టయ్య

94405 95494

Advertisement

Next Story

Most Viewed