సమైక్యతా సార్వభౌముడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గురించి తెలుసా?

by Ravi |   ( Updated:2022-10-29 18:30:36.0  )
సమైక్యతా సార్వభౌముడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గురించి తెలుసా?
X


సంస్థానాలన్నింటిని పటేల్ దారికి తెచ్చారు. హైదరాబాద్ విషయంలో సరైన సమయంలో పోలీసు చర్యకు దిగి తన వ్యూహ చతురత ప్రదర్శించి విలీనం చేయించారు. ఈ ప్రక్రియను రక్తపాత రహితంగా సాధించడం పటేల్‌ను శిఖర సమానుడిని చేసింది. 'ఇన్ని స్వతంత్ర్య రాజ్యాలను ఆరు మాసాలలో యూనియన్ లో విలీనం చేయడం సాధారణ విషయం కాదని దీనికి మేమంతా రుణపడి ఉంటాం' అని నెహ్రూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ విడిపోగా మిగిలిన దేశాన్ని సమైక్యంగా నిలిపి ఉంచటంలో ఆయన నేర్పు, సామర్థ్యం ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోమ్ మంత్రి, బార్డోలీ వీరుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్. ఉక్కు మనిషిగా పేరుగాంచిన పటేల్ జవేరీ భాయ్, లాడ్‌ భాయ్ దంపతులకు 1875 అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న సంస్థానాలను దేశంలో విలీనం కావడానికి గట్టిగా కృషి చేశారు. ఆంగ్లేయులు మత ప్రాతిపదికన దేశాన్ని రెండు ముక్కలు చేశారు. దేశాన్ని వదిలి వెళుతూ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు. నచ్చితేనే భారత యూనియన్‌లో కలువవచ్చు లేదా స్వతంత్ర్యంగా ఉండవచ్చనే వెసులుబాటు కల్పించారు దీనిని అడ్డం పెట్టుకొని స్వతంత్రంగా ఉండాలనుకునే సంస్థానాలను యూనియన్‌లో విలీనం చేసిన పటేల్ ప్రజల మన్ననలు అందుకుని ఇండియన్ బిస్మార్క్‌గా పేరు పొందారు.

చాకచక్యంగా వ్యవహరించి

దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో 565 సంస్థానాలు ఉన్నాయి. దాదాపు అన్ని సంస్థానాలు బేషరతుగా ఇండియన్ యూనియన్‌లో చేరిపోయాయి. కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ ఇందుకు అంగీకరించలేదు. వాటిని యూనియన్‌లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు. హైదరాబాద్ సంస్థానం ఇందులో ముఖ్యమైనది ఈ సంస్థానంలో 80 శాతం ప్రజలు హిందువులు, 20 శాతం ముస్లింలు, ఇతర మతాలకు చెందిన వారు. ప్రపంచంలోనే సంపన్న సంస్థానం.

సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థ ఉన్నాయి. అందుకే హైదరాబాద్‌ను స్వతంత్ర్య రాజ్యాంగ ఉంచాలని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్‌ఖాన్ భావించారు. పటేల్ పూర్తి విజ్ఞత ప్రదర్శించి, చాకచక్యంగా వ్యవహరించి, నిజాం గౌరవ మర్యాదలకు భంగం కలగనీయమని మాట ఇచ్చి యూనియన్‌లో విలీనం అయ్యేందుకు ఒప్పించారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి దేశంలోని అన్ని సంస్థానాలు వీలీనమైపోయాయి. ఒక యజ్ఞంలా పటేల్ చేసిన కృషిని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రశంసించారు.

రక్తపాత రహితంగా సాధించి

విలీనాల ద్వారా దాదాపు ఐదు లక్షల చదరపు మైళ్ల భూభాగాన్ని 8.6 కోట్ల మంది ప్రజలను భారత్‌లో కలపగలిగారు పటేల్. సంస్థానాలను విలీనం చేయడమే కాక, ఇవన్నీ స్వతంత్ర భారత పరిపాలనా చట్రంలో ఇమిడిపోయేలా చూడటం ముఖ్యమని అభిప్రాయపడి అందుకు అనుగుణంగా వ్యవహరించారు. వేర్లు బలంగా పాదుకోవాలని, అప్పుడే యూనియన్ సుస్థిరంగా నిలబడుతుందని నమ్మి వాటిని ఒకే చట్రంలో నిలబెట్టారు. జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలను తప్పించి మిగతా సంస్థానాలన్నింటిని పటేల్ దారికి తెచ్చారు.

హైదరాబాద్ విషయంలో సరైన సమయంలో పోలీసు చర్యకు దిగి తన వ్యూహ చతురత ప్రదర్శించి విలీనం చేయించారు. ఈ ప్రక్రియను రక్తపాత రహితంగా సాధించడం పటేల్‌ను శిఖర సమానుడిని చేసింది. 'ఇన్ని స్వతంత్ర్య రాజ్యాలను ఆరు మాసాలలో యూనియన్ లో విలీనం చేయడం సాధారణ విషయం కాదని దీనికి మేమంతా రుణపడి ఉంటాం' అని నెహ్రూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ విడిపోగా మిగిలిన దేశాన్ని సమైక్యంగా నిలిపి ఉంచటంలో ఆయన నేర్పు, సామర్థ్యం ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

(నేడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి)


దేవేందర్ ముంజంపల్లి

కేయూ, వరంగల్

89784 58611

Advertisement

Next Story