- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రూప్-1 ఫలితాలపై ఇన్ని ట్విస్టులా.. ప్రభుత్వం ఏం చేయాలి?

రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 సర్వీసు ఉన్నతమైన ఉద్యోగం. ఆ సర్వీస్ సాధించాలని నిరుద్యోగుల కల. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడ్డాకా తొలిసారి మూడేళ్ల కింద గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ ఇప్పటికీ అనేక అవాంతరాలను ఎదుర్కొంటుంది. గ్రూప్-1 మెయిన్స్‌కు ముందు ప్రిలిమ్స్ సెలక్షన్‌కు ప్రభుత్వం జీవో 29ను తీసుకువచ్చింది. అయితే ఇది సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉందని రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినప్పటికీ ప్రభుత్వం ముందుకెళ్లి మెయిన్స్ నిర్వహించింది. ఇప్పుడు మెయిన్స్ పరీక్ష అనంతరం తుది ఫలితాలు విడుదల చేసింది. ఇక్కడ కూడా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు..
గ్రూప్-1 అంశంపై హైకోర్టు విచారణ జరిపి తుది ఫలితాలపై స్టే విధించింది. దీంతో గ్రూప్-1 పై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. అసలు గ్రూప్-1 నియామకంలో పారదర్శకత ఏ మేరకుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పటికీ గ్రూప్- 1పై ఉన్న అనుమానాలు, ఆందోళనలన్నీ తొలగిపోతాయి. ఒకవైపు దక్షిణ భారతదేశంలో భాషా అస్తిత్వ ఉద్యమా లు జరుగుతూ ఉంటే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలలో తెలుగును నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్ష ఫలితాల్లో దాదాపు 80 నుంచి 90 శాతం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకే అధిక మార్కులు వచ్చాయి.
అకాడమీ బుక్స్ ప్రామాణికం కావా?
గ్రూప్-1 మెయిన్స్‌ను తెలుగులో ఎంతో విశ్లేషణాత్మకంగా రాసిన అభ్యర్థుల సైతం సెలెక్ట్ కాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగును అధికార భాష పెట్టుకోవడం ఎందుకు? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రిలిమ్స్, మెయిన్స్ హాల్ టికెట్స్‌కు వేరు వేరు నెంబర్లు ఇవ్వడం, పరీక్ష మూల్యాంకనంలో భారీ లోటుపాట్లు ఏర్పడటం, తెలుగు అకాడమీ గ్రంథాలు ప్రామాణికం కావనీ చెప్పడం, రెండు సెంటర్లలో పరీక్ష రాసిన అభ్యర్థులలో 71 మంది సెలెక్ట్ అవ్వడం, మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్యలో తేడా రావడం ఇవన్నీ పరీక్ష నిర్వహణ మీద అనుమానం పెంచేవే.. వీటన్నిటిపై హైకోర్టులో కేసులు వేశారు అభ్యర్థులు.. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ 1:1 సెలెక్షన్ లిస్టు పెట్టి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను పిలిచింది. అయితే ఇటీవల కోర్టు ఈ అంశాలపై ఇరు పక్షాల వాదనలు విని తుది ఫలితాలపై స్టే విధించింది. దీంతో గ్రూప్-1 పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైనది. కోర్టు స్టే విధించడంతో గ్రూప్-1 మెయిన్స్ రాసిన వేలాది మంది విద్యార్థులు నైరాశ్యంలోకి వెళ్లారు. ఈ పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయనీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని కూడా అభ్యర్థిస్తున్నారు.
మూల్యాంకనపై కూడా అనుమానాలు..
ప్రభుత్వం ప్రిలిమ్స్ సమయంలో తీసుకొచ్చిన జీవో29 సామాజిక రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది. దీంతో ఎస్సీ, ఎస్టీలను, బీసీలకు కూడా అన్యాయం జరిగింది. ఈ జీవో ప్రభావం తుది ఫలితాలపై పడి సామాజికవర్గాల వారీగా సెలక్షన్స్ తగ్గిపోయాయి. ఓపెన్ అభ్యర్థులకు అవకాశాలు పెరిగాయి. టాప్ 100లో ఎస్సీ, ఎస్టీ సెలక్షన్స్ వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. నాన్ లోకల్ వారికి అవకాశాలు పెరిగాయి. ఇంత ప్రభావాన్ని చూపిన జీవో 29పై అటు ప్రభుత్వం, ఇటు కోర్టులలో కూడా చర్చకు రాకపోవడం విస్మయం కలిగిస్తుంది. అభ్యర్థులేమో.. జీవో 29ను రద్దుచేసి పాత జీవో 55 ప్రకారం మెయిన్ సెలక్షన్ లిస్ట్ తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే సామాజిక న్యాయం చేకూరుతుందని కోరుతున్నారు. ఇక ఈ మెయిన్స్ మూల్యాంకనపై కూడా అనుమానాలు ఉన్నాయి. తెలుగులో మెయిన్స్ రాసిన వారి కంటే వేరే భాషలో రాసిన వారు ఎక్కువగా సెలక్ట్ కావాడం అనుమానాలకు దారితీస్తుంది. తెలుగు మీడియం విద్యార్థులలో కేవలం 10 శాతమే సర్వీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉర్దూ మీడియంలో 9 మంది మెయిన్స్ రాస్తే దాదాపు 6 నుంచి 7 గురు విద్యార్థులకు సర్వీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. తెలుగు మీడియంలో మెటీరియల్ లభించడమే గగనంగా మారిన ఈ పరిస్థితుల్లో ఉర్దూ మీడియంలో మెటీరియల్ ఎలా లభించింది? వారు ఎలా రాశారనేది ప్రధాన ఆరోపణ. కేవలం మూడు నెలలోనే 21 వేల మంది విద్యార్థుల పేపర్లు ఎలా దిద్దారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
విచారణ జరగకపోతే..
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్‌లో 50 శాతం మార్కులు దాటడమే కష్టం. అలాంటిది టీజీపీఎస్సీ మూల్యాంకనంలో 60 శాతం మార్కులు దాటడం లోపభూయిష్టమైన మూల్యాంకనానికి నిదర్శనం. మెయిన్స్ పరీక్ష అభ్యర్థుల జీవితాలను తీర్చిదిద్దేది. అలాంటిది ఇష్టారీతిన జరిగిన మూల్యాంకనం వల్ల మెజార్టీ అభ్యర్థులు నష్టపోయారు. ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్లకు తీవ్ర నష్టం జరిగింది. దీనిపై విచారించకుండా ఉంటే భవిష్యత్తులో తెలుగులో గ్రూప్-1 రాయాలంటే భయపడతారు. కావున ప్రస్తుతం విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగుల పక్షాన నిలబడి గ్రూప్- 1 పై ఉన్న అనుమానాలు, ఆందోళనలన్నీ తొలగించాలి. అవసరమైతే యూపీఎస్సీ సహాయం తీసుకోవాలి. నియామకాలలో పారదర్శకత ఉన్నప్పుడే అభ్యర్థులకు భవిష్యత్తు నియామకాలపై నమ్మకం కలుగుతుంది.
- సంపతి రమేష్ మహారాజ్
79895 79428