- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీజేపీ డబుల్ ఇంజన్ నినాదం ఇదేనా?ప్రజలు ఆలోచించాల్సిన లాజిక్ ఏంటి?

ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అటు కేంద్రానిది ఇటు రాష్ట్రానిది కానప్పుడు మరెవ్వరు నిర్వర్తిస్తారో తేల్చి చెప్పాల్సింది న్యాయ వ్యవస్థ. ఇది అధిక పని భారం తో తలమునకలుగా ఉంటున్నా ఎంతో కొంత పనిని సరిగా పూర్తి చేస్తోంది. దీంతో ప్రజలకు కాసింత ఊరట లభిస్తున్నది. ప్రభుత్వాల పాలనా విధానాలతో సాంఘిక పర్యావరణంలో సంభవిస్తున్న మార్పులను, ప్రజాజీవనంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ, రాజ్యాంగ వ్యవస్థల రక్షణ చట్రంలో ప్రజల జీవించే హక్కులను కాపాడాల్సిన బాధ్యత నిస్సందేహంగా మేధావివర్గాలదే. బుద్ధిజీవుల సమయోచిత స్పందనే ఈ దేశంలో ప్రజల పాలిట పెన్నిధిగా మారి ప్రజాస్వామ్య ఫలితాలను ప్రజలకు అందిస్తుంది.
బీజేపీ చెబుతున్నట్టు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే సమస్యల గురించి ప్రజాస్వామిక వాదులు, విపక్షాలు ప్రశ్నిస్తే వారిని దేశద్రోహులుగా చిత్రీకరించరు. అసలు విమర్శలకు ఆస్కారమే ఉండదు. ప్రస్తుతం ప్రజల సమస్యలకు కారణం 'మీరంటే మీరని' రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పరస్పరం విమర్శించుకోవడం, ప్రశ్నించే గొంతుకలను పిసుకుతున్నారని గోల చేయడం 'దొంగే దొంగ' అని అరుస్తున్నట్టుగా ఉంది. కేవలం అధికారం కోసం రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి, వీధి పోరాటాలతో రాజకీయ కల్లోలాలను సృష్టించడంతో ప్రజా సమస్యలు పరిష్కారమవటం అటుంచి, ప్రజలు కొత్త సమస్యల ఊబిలోకి నెట్టివేయబడుతున్నారని చెప్పక తప్పదు.
ముందే చెప్పటంతో
చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ పార్లమెంట్, శాసనసభ్యులలో కొంత మంది అసభ్య పదజాలంతో ప్రత్యర్థులను దునుమాడుతున్నారు. ధర్నాలు, భౌతిక దాడులు, నిరసనలతో భారత శిక్షాస్మృతిని ధిక్కరించే చర్యలకు పాల్పడుతున్నారు. సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ఇలాంటి సంఘటనలు చూస్తుంటే సమాజం మధ్య యుగాల వైపు వెళ్తుందేమోనన్న ఆందోళన కలుగుతోంది. ప్రస్తుతం దేశంలో అధికారంలోనున్న పార్టీకి రాజ్యాంగబద్ధ స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కొమ్ము కాస్తున్నాయి. ప్రతిపక్షాల మీద ఏం కేసులున్నాయి? వాటితో ఏం చేయవచ్చు? అనేది అధికార పార్టీకి ముందే చెప్పడం, వారు బహిరంగంగా విమర్శించడం కొనసాగుతున్నది. ఇది సదరు సంస్థల ప్రతిష్టకు మకిలిగా అభివర్ణించక తప్పదు.
ఏ కేసు అయినా రాజకీయ ఒత్తిడితోనే అనే భావన ప్రజల మనసులకు చేరిపోయింది. ఇది చాలదన్నట్లు అవసరం ఉన్న చోట ఐటీ దాడులతో ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అసలు కేసుల విషయంలో నిజానిజాల మాట అటుంచితే, సదరు ఏజెన్సీలు తమ దర్యాప్తు తాము కొనసాగించనివ్వకుండా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల ఇండ్ల మీద భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత దురదృష్టకరం. దీనికి నిరసనగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు నిర్దోషులంటూ ప్రజలను రెచ్చగొట్టి విధ్యంసం వైపు మళ్లించడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ పొలిటికల్ వార్‌లో అధికార పార్టీ మెప్పు కోసం తాము బలి పశువులుగా మారుతున్నారు.
ఆ లాజిక్ అర్థం చేసుకోవాలి
చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు దేశంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల పట్ల త్రికరణ శుద్ధిగా తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలి. ప్రజా సమస్యలకు తాము కారణం కాదంటూ రాజకీయ వాదనతో ఎన్నికల ప్రయోజనాలు నెరవేర్చుకుంటే అంతిమంగా నష్టపోయేది ప్రజలే. ఈ లాజిక్‌ను ప్రజలు అర్థం చేసుకుంటేనే వారికి సమస్యల ఉక్కు కౌగిలి నుండి విముక్తి లభిస్తుందనేది మేధావుల అభిప్రాయం. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అటు కేంద్రానిది ఇటు రాష్ట్రానిది కానప్పుడు మరెవ్వరు నిర్వర్తిస్తారో తేల్చి చెప్పాల్సింది న్యాయ వ్యవస్థ. ఇది అధిక పని భారంతో తలమునకలుగా ఉంటున్నా ఎంతో కొంత పనిని సరిగా పూర్తి చేస్తోంది. దీంతో ప్రజలకు కాసింత ఊరట లభిస్తున్నది
. ప్రభుత్వాల పాలనా విధానాలతో సాంఘిక పర్యావరణంలో సంభవిస్తున్న మార్పులను, ప్రజాజీవనంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ, రాజ్యాంగ వ్యవస్థల రక్షణ చట్రంలో ప్రజల జీవించే హక్కులను కాపాడాల్సిన బాధ్యత నిస్సందేహంగా మేధావివర్గాలదే. బుద్ధిజీవుల సమయోచిత స్పందనే ఈ దేశంలో ప్రజల పాలిట పెన్నిధిగా మారి ప్రజాస్వామ్య ఫలితాలను ప్రజలకు అందిస్తుంది.
Also Read : అవినీతి విషయంలో ప్రతిపక్షాలు వెనకడుగు వేస్తున్నాయి: మోదీ
నీలం సంపత్
సామాజిక కార్యకర్త
9866767471