- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’
మన సమాజంలో అనేక సమస్యలు అనార్థాలు, అరాచకాలూ ముప్పిరిగొని వున్నాయి. స్వార్థపరులు, దోపిడీ దారులు, రాజకీయ రాబందులు, దొంగ స్వాములూ, బాబాలు ఇట్లా ఒకరేమిటి లెక్కలేనంతమంది మన చుట్టూరా వున్నారు. అమాయకంగా వాళ్ళ ఉచ్చులో పడి విలవిల లాడే సాధారణ జనానికీ తక్కువ లేదు. అయితే అలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఎదురొడ్డి నిలబడడానికి ఉద్యమాలు విప్లవాలే కాదు నిజాయితీ నిబద్ధత గల ‘ఒక్కడు’ చాలు అన్న భావాన్ని స్ఫూర్తిని ఇచ్చే పలు సినిమాలు మనకు చాలా వచ్చాయి. చాలా మంచి సినిమాలూ వచ్చాయి. అట్లా ఇటీవల వచ్చిన ఒక మంచి సినిమా 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై'. అంటే తెలుగులో 'కేవలం ఒక వ్యక్తి చాలు' అని అర్థం
కథేంటంటే
2013లో ఆశాంరామ్ బాపు కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఆ సంఘటనను ఆధారం చేసుకునే ఈ సినిమా రూపొందింది. దర్శకుడు అపూర్వ సింగ్ ఖెర్కీ. ఇక సినిమాలో మొత్తం మనోజ్ బాజ్‌పాయి నట విశ్వరూపం కనిపిస్తుంది. ఇప్పటికే మనోజ్ నటనలో కనిపించే వైవిధ్యం, విలక్షణత, అంకితభావం మనం అనేక సినిమాల్లో చూశాం. అది పూర్తి స్థాయి సినిమా అయినా, వెబ్ సెరీస్ అయినా మనోజ్ తన నటనలో ప్రదర్శించే అంకిత భావం ప్రశంసించదగింది. 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' లో మొదటే అనేక డిస్‌క్లేమర్స్ ప్రకటిస్తాడు దర్శకుడు. ఇది కేవలం నాటకీయ ప్రదర్శన అని ఇంకా అనేకరకాలుగా వ్యక్తులుగా ఎవరినీ ఉద్దేశించలేదని అంటారు. ఇవన్నీ ఎంతగా చెప్పినా కథ ఖచ్చితంగా 2013 నాటి సంఘటనల ఆధారంగా రూపొందిందే అని మనకు తెలిసిపోతుంది.
చిత్ర కథ విషయానికి వస్తే ఢిల్లీతో సహా, దేశంలో లక్షలాది మంది ప్రజలు ఆరాధించే బాబాజీ (సూర్య మోహన్ కుల శ్రేష్ట) తనను లైంగికంగా వేధించాడని మైనర్ బాలిక 'ను సింగ్' (అద్రిజ సిన్హా) తన తల్లి దండ్రులతో కలిసి వచ్చి పోలీసు స్టేషన్‌లో కేసు పెడుతుంది. హై ప్రొఫైల్ కేస్ ఏం చేయమంటారని అప్పుడు డ్యూటీలో వున్న ఒక మహిళా పోలీసు అధికారి తన పై అధికారిని ఫోన్లో అడుగుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి వైద్యపరీక్షకు పంపించమని సూచన వస్తుంది. దాని తర్వాత బాబాజీని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పోక్సో చట్టం నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. బాబా అనుచరులు, భక్తులు నానా హంగామా చేస్తారు. వీధుల్లో అలజడికి దిగుతారు. ఈ అరెస్టు దాదాపు శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. కోర్టులో 'ను సింగ్' తరపు పబ్లిక్ న్యాయవాది డబ్బుకు కక్కుర్తి పడి కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాడు. అది తెలిసి పోలీసులు 'ను సింగ్' తల్లిదండ్రులకు సూచన చేస్తారు. వాళ్ళు తమ తరఫున వాదించేందుకు లాయర్ పీసీ సోలంకి (మనోజ్ బాజ్‌పాయ్)ని కలుస్తారు. 'ను' కేసు వాదించేందుకు సిద్ధమైన పీసీ సోలంకి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మొదట ఆ అమ్మాయి మైనర్ కాదని రుజువు చేసేందుకు, ప్రయత్నిస్తారు. సాక్షులను చంపేస్తారు, న్యాయవాది సోలంకిని అనేక రకాలుగా లొంగదీసుకునేందుకు, భయపెట్టేందుకు దాడి చేసేందుకు యత్నిస్తారు. అయినా సోలంకి ఆ అమ్మాయి కళ్ళల్లో సంతోషం చూడడం కోసం నిలబడతాడు.
కోర్టు రూం డ్రామా, ఆసక్తికరంగా
ఆ మొత్తం కేసు వాద ప్రతివాదాల్లో సోలంకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? బాబాజీని కాపాడుకునేందుకు అతని గ్యాంగ్ ఎన్ని రకాల అరాచకాలు చేసింది? చట్టంలో ఉన్న లొసుగులు ఏమిటి వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలని బాబా తరఫు న్యాయవాదులు ప్రయత్నించారు. కానీ సోలంకి వాటన్నింటిని చట్టరీత్యా ఎదుర్కొని నిలబడతాడు. కేసు అన్ని స్థాయిల్లో గట్టిగా నిలబడాలి, ఏ కొంచెం ఏమరుపాటుగా వున్నా రెప్పపాటులో బాబాకు బెయిల్ లభించి విదేశాలకు పారిపోయి ఇక కేసు ముందుకు సాగదు అంటూ సోలంకి పోక్సో చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయించి బాబాకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేస్తాడు. ఈ మొత్తం కేసులో సంభాషణలు చట్టరీత్యా ఉన్నా, ఎంతో డ్రమటిక్‌గా ఆసక్తి కలిగిస్తాయి. రచయిత ప్రతిభ కనిపిస్తుంది. పోక్సో చట్టంలో నిందితుడికి శిక్ష పడేందుకు లైంగిక దాడి జరిగిన బాధితురాలు ఒక్కరు కోర్టు మెట్లు ఎక్కి చెబితే చాలు అంటూ మొదటే టైటిల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇదొక కోర్డ్ రూమ్ డ్రామా.
ఈ సినిమాను పరిశీలిస్తే ‘ను’ అన్న మైనర్ బాలికకు పరిస్థితులు అనుకూలించని సమయంలో లాయర్ పీసీ సోలంకి ఎంట్రీతో కథ ఆసక్తిగా మారుతుంది. 2012లో అమలు చేసిన పోక్సో చట్టం నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన చర్యలు, చట్టం ఆవశ్యకత, అసలు పోక్సో చట్టం ఏం చెబుతుంది వంటి విషయాలను క్లుప్తంగానే అయినా సినిమాలో ఆసక్తికరంగా వివరించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు, బెయిల్ కోసం బాబాజీ ఎలాంటి ప్రయత్నాలు చేశాడో చూపించారు. మైనర్ బాలికను మేజర్ అని చూపించేందుకు చేసిన ప్రయత్నాలు సోలంకి ఎలా తిప్పికొట్టాడో ఆసక్తిగా ఉంటుంది. సాధారణ వ్యక్తిలా హింసకు దౌర్జన్యానికి భయపడే న్యాయవాది సోలంకిలో బాలికకు న్యాయం చేయాలనే తపన, అతని డైలాగ్స్ మెప్పిస్తాయి. ఎలాంటి మలుపులు లేకుండా ప్లాట్‌గా కథ సాగిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. సీరియస్‌గా సాగే డ్రామాలో మనోజ్ బాజ్‌పాయ్ హావభావాలు, నటన అక్కడక్కడ నవ్వు తెప్పించి రిలాక్స్ చేస్తాయి. క్లైమాక్స్‌లో మనోజ్ బాజ్‌పాయ్ నటన హైలెట్‌గా నిలుస్తుంది. తెలుగులో కంటే హిందీలో చూస్తే మరింత ఆసక్తి గా చూస్తాం. కనెక్ట్ అవుతాం.
ఇలాంటి సినిమాలు ఎన్నో..
ఇప్పటికే చెప్పుకున్నట్టు మనోజ్ బాజ్‌పాయ్ నటన ఎంత చెప్పినా తక్కువే. నిజానికి ఈ సినిమా మనోజ్ బాజ్‌పాయ్ ది వన్ మ్యాన్ షో గా కనిపిస్తుంది కానీ దర్శకుడి ప్రతిభ, సంభాషణల రచయిత చూపిన మెలకువ కూడా తక్కువేమీ కాదు. పూర్తి స్థాయి కోర్టు డ్రామా అయిన ఈ సినిమా టీం ని అభినందించాల్సిందే. 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' ఎలాంటి మలుపులు లేకుండా సాగి ఆకట్టుకుంటుంది.
ఇలాంటి 'కేవలం ఒక వ్యక్తి చాలు' అన్న భావంతో గతంలో మరెంతో గొప్ప సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకుంటే ‘ఖచ్చితంగా నేను ప్రతిపక్షంలోనే నిలుచుంటాను’ అని ప్రకటించుకున్న దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా తీసిన ‘సలీం లంగ్డే పే మత్ రొ’, అరవింద్ దేశాయి ‘కీ అజీబ్ దాస్తాన్’, ‘మోహన్ జోషీ హాజీర్ హొ’ లాంటివి చాలా మంచి సినిమాలు. వాటి గురించి మరోమారు చెప్పుకుందాం.
వారాల ఆనంద్
94405 01281
Also Read: అమర ప్రేమ కథ ‘లైలా మజ్ను’