- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ranveer Allahbadia controversy: బూతుకి ఒక హద్దు ఉండొద్దా?

ఎదుటి వాడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ విషయాన్ని బయటికి చెప్పరు కానీ లోలోపల అందరి ఫీలింగ్ అదే. అందుకే సోషల్ మీడియా ఇంత పాపులర్ అయింది. కానీ అవే నిజాల్ని బయటికి మాట్లాడితే, మళ్లీ ఫీలింగ్స్ హర్ట్ అయ్యాయి, మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు.
ఒక యూజర్, ఇంటర్నెట్‌లో కంటెంట్‌ను చూడాలంటే అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అందుకే ఏదైనా కంటెంట్‌ను చూసేముందు డిస్‌క్లెయిమర్ చూపిస్తారు. దాన్ని పూర్తిగా చదివే సమయం, ఆసక్తి ఎవరికీ ఉండదు. కంటెంట్ చూసి ఎంజాయ్ చేస్తారు. నచ్చితే వైరల్ చేస్తారు, నచ్చకపోతే మాత్రం, ఎలాగూ ఫ్రీగా వచ్చిన అకౌంట్ ఉంది కదా అని పేజీలకు పేజీలు అభిప్రాయాలు రాసేస్తారు. ఇప్పుడు భారతీయ సోషల్ మీడియా మొత్తం అదే జరుగుతోంది. ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ప్రోగ్రాంలో రణ్‌వీర్ అల్లాబాదియా అలియాస్ బీర్‌బైసెప్స్ అడిగిన ఒక ప్రశ్న గురించి ఈ రచ్చ ప్రారంభమైంది. దీని గురించి ఒక చిన్న విశ్లేషణ.
టాలెంట్ షో కాదు.. లేటెంట్ చూసే తరమిది
సోషల్ మీడియా, స్ట్రీమింగ్ సర్వీస్ కంటెంట్‌లో సెన్సార్‌షిప్ ఆశించడం పెద్ద తప్పు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ దానికి ఒక హద్దు ఉండాలి అని మాటలు చెబుతూనే రాత్రి ఎనిమిది నుంచి అర్థరాత్రి ఒకటి వరకు హెడ్‌సెట్ పెట్టుకొని మరీ ఎంజాయ్ చేసే జనాలు ఎంతో మంది ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇండియాస్ గాట్ లేటెంట్ ఇంకా దాని సృష్టికర్త సమయ్ రైనా గురించి, అతని కంటెంట్ గురించి కూడా అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే రణ్‌వీర్ అల్లాబాదియా గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ ఏమీ మొదటి ఎపిసోడ్ కాదు. టాలెంట్ షో చూసే రోజుల నుంచి లేటెంట్ చూసే రోజులకు జనరేషన్ మారిపోయిందని ఈ కార్యక్రమానికి వచ్చే వ్యూస్ చూస్తేనే అర్థమవుతుంది. అంతేకాదు, దీని కంటే ముందు ఎపిసోడ్‌లలో కూడా చాలా పచ్చి బూతులు, నిర్దిష్ట వర్గాలను, జాతులను, ప్రాంతాలను, మనుషులను కించపరిచేలా జోక్‌లు ఉన్నాయి. ఆ జోక్‌లకు పడీపడీ నవ్విన వాళ్లు ఉన్నారు. కానీ అప్పుడెవరూ కేసులు పెట్టకపోగా, కొత్త ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్ రిలీజ్ చేస్తున్నట్టు సమయ్ చెప్పగానే డౌన్‌లోడ్‌లు చేసేసుకొని, యాప్ డౌన్‌లోడ్‌లలో నంబర్ 1 స్థానంలో పెట్టేశారు. మరి ఇప్పుడెందుకు ట్రిగ్గర్ అయిందంటే..
కుటుంబ నిర్మాణాన్నే కించపర్చే ప్రశ్న
రణ్‌వీర్ అడిగిన ప్రశ్న భారతీయ కుటుంబ నిర్మాణాన్ని కించపరిచేలాగా ఉంది. మన దేశంలో కుటుంబం అనగానే ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. గత ఎపిసోడ్‌లలో వేరే వాళ్లపై జోక్‌లు వేస్తే తీసుకున్న వాళ్లే, ఇప్పుడు అందరినీ రిలేట్ చేయగల కుటుంబమనే విషయంపై వేసిన జోక్‌ను తీసుకోలేకపోతున్నారు. రణ్‌వీర్ తన పాడ్‌కాస్ట్‌లతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. చాలా పెద్ద సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు అతని పాడ్‌కాస్ట్‌లలో అతిథులుగా వచ్చారు. చాలా విషయాలు చెప్పారు. అందరినీ మోటివేట్ చేశారు. వీటి వల్ల రణ్‌వీర్ గురించి అందరిలో ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. కానీ ఒక్కసారిగా ఈ కార్యక్రమంలో ఆ ప్రశ్న అడగటంతో సీన్ రివర్స్ అయింది. నిజానికి లేటెంట్ కార్యక్రమం కాన్సెప్ట్ అదే! నో ఫిల్టర్ అంటూ తమకు నచ్చినట్లుగా ఉంటారు.
ఓపెన్‌గా మాట్లాడినా తప్పు తప్పే
రణ్‌వీర్ కూడా అలాగే చేశాడు. పాడ్‌కాస్ట్ బిజినెస్ కోసం ఇంతకాలం మాస్క్ వేసుకున్నాడు, ఇదే అసలు రూపం అంటున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజుల్లో మాస్క్ వేసుకోకుండా ఉంటున్నది ఎవరు? గట్టిగా చెప్పాలంటే... రణ్‌వీర్ అడిగిన ప్రశ్న కొత్తదేమీ కాదు, ఇప్పటికే ఈ ప్రశ్నను పాపులర్ డాడ్ జోక్స్ కంటెంట్ చానల్ వాళ్లు ఎప్పుడో అడిగారు. అయితే ఇక్కడ రణ్‌వీర్ చేసిన తప్పు ఏంటంటే...తన ఇమేజ్‌ను పక్కనపెట్టి కాస్త ఎక్కువ ఓపెన్‌గా మాట్లాడటం. అందుకే అంటుంటారు... ఎక్కడ ఎప్పుడు ఏదీ మాట్లాడాలో, అటూ ఇటూ చూసి మాట్లాడాలి అని. ఏదేమైనా సరే, జరగాల్సింది జరిగిపోయింది కంటెంట్ తీసేసినంత మాత్రాన దాన్ని మర్చిపోతారని కాదు. అయితే దీనికి సంబంధించి ఇంకొక కోణం కూడా ఉంది.
నాలుగు సెకన్ల జోక్.. నలుగురిపై కేసు
సాధారణంగా ఒకరికి బాగా డబ్బులు, పేరు వస్తుంటే చూడలేని కళ్లు మనవి. ఇప్పుడు కాకపోయినా జీవితంలో ఏదో ఒక సందర్భంలో అసూయ, ఈర్ష్య అనేవి ప్రతి ఒక్కరికీ కలుగుతాయి. ఇండియాస్ గాట్ లేటెంట్ షో పాపులారిటీని చూసి కూడా చాలా మందికి అలాంటి అసూయ సందర్భం వచ్చింది. ఒక్క ఎపిసోడ్‌తో సమయ్ రైనా, రూ. 150 కోట్ల వరకు సంపాదిస్తున్నాడని విశ్లేషణ వీడియోలు బయటికి వచ్చాయి. షూటింగ్ కోసం కనీసం ఒక్క రోజు కూడా పట్టని కార్యక్రమానికి ఇంత స్థాయిలో డబ్బులు రావడం అంటే సాధారణ విషయం కాదు. పైగా ఇది యూట్యూబ్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఎక్స్‌క్లూజివ్ షో. అలాగే ఒక ఎపిసోడ్‌ను రిపీట్‌లో చూడవచ్చు. చాలా కాలం పాటు సేలబిలిటీ కూడా ఉంది. అంతేకాకుండా ఈ మధ్య స్పాన్సర్‌లు కూడా పెరిగారు. కాబట్టి ఏ చిన్న తప్పు జరిగినా రచ్చ చేయడానికి రెడీగా ఉండే బ్యాచ్‌కి రణ్‌వీర్ ప్రశ్నతో మంచి చాన్స్ దొరికింది. అందుకే నాలుగు సెకన్ల జోక్ కాస్త, నలుగురి మీద కేసు లాగా మారిపోయింది.
విమర్శించే హక్కు నిజంగా మనకుందా?
అయితే ఈ వివాదం కారణంగా ఇంటర్నెట్ కంటెంట్‌పై సెన్సార్ పడే ప్రభావం ఉంటుందేమో అని ఇన్‌ఫ్లూయెన్సర్‌లు కంగారు పడుతున్నారు. ఇంటర్నెట్ విషయంలో బూతులకు హద్దులు పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. కాకపోతే ఈ వివాదం నేర్పిన పాఠం ఏంటంటే, సందర్భానుసారంగా మాట్లాడటమే నిజమైన క్రమశిక్షణ. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సోషల్ మీడియా పది కాలాల పాటు చల్లగా ఉండొచ్చు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకుంటే, రణ్‌వీర్ పాడ్‌కాస్ట్‌లను ఆదర్శంగా తీసుకొని బాగుపడ్డ వాళ్లు చాలా మంది ఉన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు కూడా అందుకున్న రణ్‌వీర్‌ను, కాపీ చేసి వాడుకున్న ఒక్క ప్రశ్న కారణంగా ఈ స్థాయిలో తప్పుబట్టడం నిజంగా తెల్లకాగితంపై నల్ల చుక్కను ఫోకస్ చేసి చూడటం లాంటిదే అవుతుంది.
ప్రగత్ దోమల,
63001 05472