ఖద్దర్ ముసుగులో మాఫియా!

by Ravi |   ( Updated:2023-04-21 00:30:15.0  )
ఖద్దర్ ముసుగులో మాఫియా!
X

రాజకీయాలు, ప్రజాసేవ అంటే ఒకప్పుడు ఎంతో గౌరవంగా చూసేవారు. కానీ ఇప్పుడు అవి క్రిమినల్స్‌కు, అవినీతి పరులకు షెల్టర్లుగా మారాయి. దేశ ప్రజలను దోపిడీ చేసే వ్యాపారాలన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో రాజకీయ నేతల ముసుగులో మాఫియా రాజ్యం కొనసాగుతోంది. నేడు పాలిటిక్స్ ఈస్ ద పక్కా స్కౌండ్రల్స్ గేమ్‌ గా మారిపోయాయి. ప్రస్తుతం చాలా మంది కార్పొరేట్లు రాజకీయాలకు తమ ఆస్తులను పదిలం చేసుకోవడానికే వస్తున్నారు. వీరందరికి మాఫియా కనెక్షన్లు ఉండటం జగమెరిగిన సత్యం. వీరి గురించి నిజం తెలుసుకున్న వారిని చంపించి మరో మాఫియాను వీరే సృష్టిస్తూ ఉంటారు. ఇలాంటి వారు చేరి రాజకీయాలను అపవిత్రం చేయడంతో నేరస్తుల సంఖ్య పెరుగుతూ వచ్చి మాఫియా వ్యవస్థ బలపడుతున్నది.

ఎన్నో అనుమానాలు..

దేశంలో అవినీతి, అక్రమాలు పెరిగి, సగటు మానవుడు ప్రశాంతంగా జీవనం సాగించే పరిస్థితి లేదు. తన ఇంటిలో తాను సురక్షితమేనా అనే గ్యారెంటీ లేదు. బ్యూరోక్రాట్లను సైతం సామాన్య జనం నమ్మే పరిస్థితి లేదు. పోలీస్‌లు, న్యాయ వ్యవస్థ, రాజకీయ నేతల కారణంగానే ఇండిపెండెంట్‌గా వ్యవహరించలేని పరిస్థితి ఉంటున్నది. లా అండ్ ఆర్డర్ అధికారం ఉన్న నేతల గుప్పిటలో ఉంటున్నది. దేశంలోని పలు రాష్ట్రాల్లో గ్యాంగ్ వార్‌లు చర్విత చరణంగా కొనసాగడానికి, వారి పోషణ పెరగడానికి కారణం కూడా రాజకీయమే. దేశంలో ఒక మాఫియాను ఖతం చేయడానికి మరో మాఫియా పుట్టుకుని వస్తుంది(నేతలు పుట్టిస్తున్నారు) ఇదంతా మనం కల్పిత కథలతో, ఒక్కోసారి నిజ జీవిత కథల ద్వారా తీస్తున్న సినిమాల్లో చూస్తుంటాము. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం ఇవే పరిస్థితులు ఉన్నాయి. మాఫియా రాజ్యాన్ని తుడిచి వేస్తానని ప్రతిజ్ఞ చేసిన యోగీ ఆదిత్య నాథ్ సర్కార్ గత ఆరు సంవత్సరాలుగా 10,814 ఎన్ కౌంటర్లు జరిపింది. ఇందులో 189 మంది నేరస్తులను చంపారు. ఈయన పాలనలో రూల్ ఆఫ్ లా, పోలీస్‌లు ఎక్కడా అని వెతుక్కునే పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణే పోలీస్ కస్టడీలో ఉన్న మాఫియా వ్యక్తులు అతీఖ్ అహ్మద్, అతని సోదరుడు అశ్రాఫ్‌ల హత్య. పోలీస్ కస్టడీలో ఉన్న వీరిని ఆసుపత్రికి పోలీస్‌లు తీసుకుని వెళ్ళేటపుడు విలేఖరులతో మాట్లాడుతుండగా, ఆసుపత్రి ముందు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో విదేశీ పిస్టల్స్‌తో 10 రౌండ్స్ కాల్పులు జరిపి ముగ్గురు వ్యక్తులు ఆ ఇద్దరినీ చంపేశారు. అయితే ఈ హత్య ఘటనలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అసలు పోలీసులు రాత్రి 10 గంటలకు వాళ్ళను ఆసుపత్రికి తీసుకుని రావడం ఏమిటి? కస్టడీలో ఉన్నవారిని విలేఖరులతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం ఏమిటి? ఆసుపత్రి లోనికి తీసుకుని వెళ్లకుండా వారు ఉన్న వాహనాన్ని గేట్ వద్దే నిలిపి వారిని కిందకు దింపడానికి కారణం ఏమిటి? అసలు కోర్ట్ వద్దే ప్రెస్ మీట్‌తో మాట్లాడనీయని పోలీసులు ఆసుపత్రి వద్ద మాట్లాడించడం ఏమిటి?

అయితే వారిద్దరిని హత్య చేసిన వారు కేవలం 22 సంవత్సరాల వయసున్న యువకులే వారి నేపథ్యం కూడా పేదరికమే. అలాంటివారికి సుమారు 6-7 లక్షల రూపాయల విలువైన పిస్టళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి. అసలు వారిద్దరిని ఆసుపత్రికి తీసుకొస్తున్నట్టు డాక్టర్‌లకే సమాచారం లేకుంటే వారికి హత్య చేసిన వారికి సమాచారం ఎలా చేరింది? వారు విలేఖరులు ముసుగులో ఎలా వచ్చి హత్య చేశారు?

వణికిపోయే స్థితికి యూపీ

ఇదంతా పెద్ద మిస్టరీ ఏమీ కాదు! దీని వెనుకాల పెద్దల హస్తం ఉంది. నిజానికి అతీక్‌ను అరెస్ట్ చేసి అతని నేరచరిత్రపై ఎంక్వైరీ చేస్తే అతీక్ తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లు చెప్పాడు. అందులో కొందరి ఇండ్ల మీద కేంద్ర ఏజెన్సీల రైడ్స్ కూడా జరిగాయి. దీంతో అతీక్ హత్యకు ప్లాన్ జరిగిందనే అనుమానం. ఈ హత్యపై అక్కడి బీజేపీ నేతలేమో కర్మఫలితమని, విపక్ష నేతలేమో విచారణ న్యాయంగా జరగాలంటున్నారు. నిజానికి గత నెల రోజులుగా అతీక్ తనను చంపేస్తారని, భయం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే భయాన్ని వ్యక్తం చేశారు. వారు అనుమానించినట్టే ఈ హత్య జరిగింది. మరి ఈ సంఘటనకు బాధ్యులు ఎవరు? మాఫియాను పెంచిపోషిస్తున్న రాజకీయ పార్టీలా? ప్రభుత్వాలా? ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ హత్య చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తే, వారు అతీఖ్‌ను చంపి అయనకంటే పెద్ద మాఫియాలుగా అవతారం ఎత్తాలని ఇలా చేశామని వారు విచారణలో పేర్కొన్నారు. అయితే ఇది నిజమా? అబద్ధమా? అనేది తేలాల్సి ఉంది. ఈ ముగ్గురు కాల్పుల అనంతరం జై శ్రీరాం అని నినాదాలు చేశారు. అయితే ఈ సంఘటన పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారం చేసిందేనని సామాన్యులు సైతం అనుమానించే విధంగా ఉంది. రిపోర్టర్‌లు అందరూ అక్కడే ఉండడం వల్ల కెమెరాల్లో మొత్తంగా ఘటన రికార్డు అయ్యింది. ఇందులో ఒక పాత్రికేయుడు కూడా గాయపడ్డాడు. పోలీస్‌ల సమక్షంలో ఇంత బహిరంగంగా మాఫియాల హత్య జరిగినపుడు, సామాన్యుల సంగతి ఏమిటంటూ యూపీ వణికిపోయే పరిస్థితి వచ్చింది. మాఫియాల ఎన్‌కౌంటర్లు, హత్యలు, యూపీలో కొత్తేమీ కాదు. అక్కడ గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. యూపీలో క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది.

యూపీలో మాఫియా రాజ్యం

న్యాయం, అన్యాయం లేదు, నీతి, నియమం లేదు. న్యాయం అయితే అసలుకేలేదు. శనివారం ఫేక్ మీడియా కార్డులు తయారు చేసుకుని ఒకరోజు ముందు నుంచే అతిక్, అతని సోదరుడిని చంపిన ముగ్గురు యూపీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కలుసుకుని రెక్కి కూడా జరిపారని వార్త. ఇదో ప్రీ ప్లాన్ మర్డర్ అంటే అతిశయోక్తి కాదేమో. నిజానికి ఈ రోజు ప్రభుత్వ ఏజెన్సీలు అధికారంలో ఉన్న రాజకీయ నేతల చెప్పుచేతల్లో ఉంటూ, వారితో మింగిల్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఒక హై ప్రొఫైల్ క్రిమినల్స్‌ను తీసుకుని వచ్చేటప్పుడు ఎంత సెక్యూరిటీ ఉండాలి అనేది తెలియని విధంగా వ్యవహరిస్తే ఎలా? నిజానికి ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో మాఫియాలది కూడా ఓ రాజ్యం ఉంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వారికి ఎమ్మెల్యే, ఎంపీల టికెట్‌లు మాఫియా నేతలకు ఇస్తూ వస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ మాఫియా కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారు మంత్రులుగా కూడా ఉన్నారు. వారి మీద కేసులు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేసే ముందు అభ్యర్థులుగా నామినేషన్‌లు వేసినప్పుడు ఇచ్చిన వివరాలు, అఫిడవిట్లు దాఖలు పత్రాలను పరిశీలిస్తే వీరికి ఉన్న నేర చరిత్ర బయట పడుతుంది. యూపీలోని తొమ్మిది రాష్ట్రాల్లో నేరాల సంఖ్య పరాకాష్టకు చేరింది. దీనికి కారణం రాజకీయాలు! నేరస్తులకు రాజకీయ పార్టీలతో, నేతలతో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాఫియాతో సంబంధం ఉండడమే. మాఫియా కార్యకలాపాలు, గ్యాంగ్ వార్‌లు యూపీలో మాములు విషయం అయిపోయాయి. వివిధ వ్యాపార లావాదేవిల్లో, ముఖ్యంగా మద్యం, భూదందా, ఇసుక దందాలో నేతలకు వీరి అవసరం, వీరికి నేతల అవసరం అనివార్యం. ఇందుకు సంబంధించిన వారసత్వం కూడా అలాగే పుట్టుకుని వస్తున్నది. ముందు ఈ వ్యవస్థలో పరివర్తనకు ప్రయత్నాలు నిజాయితీగా జరగాలి. నేరస్తులకు, ముఖ్యంగా మాఫియాలకు రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వడం బంద్ చేయాలి. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు సైతం ఈ నిబంధనలు అమలు చేయాలి. కేవలం డబ్బు సంపాదన కోసం, పేరు కోసం, కాస్ట్‌లీ తుపాకులతో యువకులు హత్యలు చేయరు. వీరిని హైర్ చేసిన వారి పేర్లు చెబితే, ఆ మాస్టర్ మైండ్ వీరిని వదులుతాడా? సిట్ విచారణ నిష్పక్షపాతంగా ఉంటుందా? అనేది వేచి చూడాల్సిందే.

ఎండి.మునీర్

99518 65223

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed