ఆ టీచర్లకూ ఓటు హక్కు కల్పించాలి!

by Ravi |   ( Updated:2024-10-26 01:15:39.0  )
ఆ టీచర్లకూ ఓటు హక్కు కల్పించాలి!
X

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు టీచర్ ఎంఎల్‌సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. త్వరలో తెలంగాణాలో రెండు (కరీంనగర్, నల్గొండ), ఏపీలో రెండు (ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర) టీచర్ ఎంఎల్‌సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రధానంగా పనిచేస్తున్నది సెకండరీ గ్రేడ్ టీచర్లే కాబట్టి, తమకు ఓటు హక్కు కల్పించాలని వారు గట్టిగా కోరుతున్నారు. ఓటు హక్కు లేకపోవడం వల్లనే టీచర్ ఎంఎల్‌సీలు తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదనతో ఉన్నారు. వారి ఆవేదనలో అర్థం లేకపోలేదు. తెలంగాణలో పదివేల ఎస్జీటీ పోస్టులను ఎల్ఎఫ్ఎల్‌ హెచ్ఎం పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకొని ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఉత్తర్వులు రాలేదు. ఈ విషయాన్ని ఎంఎల్‌సీలు ఏనాడూ సీరియస్‌గా తీసుకోలేదని ఎస్జీటీలు వాపోతున్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో పనిభారం విపరీతంగా ఉం దని, మెజారిటీ ప్రాథమిక పాఠశాలల్లో ఒక ఎస్జీటీ పద్దెనిమిది సబ్జెక్టులు బోధించవలసి వస్తోందని అంటున్నారు. అయినా టీచర్ ఎంఎల్‌సీలు స్పందించడం లేదని, శాసనమండలిలో సమస్యను లేవనెత్తడం లేదని గుర్రుగా ఉన్నారు. తరగతికి ఒక టీచర్ ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదని వారు బాధపడుతున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడం వల్లనే టీచర్ ఎంఎల్‌సీలు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారి భావన. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ తదితర ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ ఎంఎల్‌సీలతో సహా పలు రాజకీయ పార్టీలు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఓటు హక్కు కల్పించే విషయమై పలుమార్లు వివిధ స్థాయిల్లో రిప్రజెంట్ చేశాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ‌స్పందిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 21, 2024 నాడు జారీ చేసిన లేఖ నం.30/ఎల్‌సీ/2024/ ఈఆరె స్‌‌లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ఓటర్ లిస్టు లు ప్రిపేర్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారులుగా కూడా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు అక్టోబర్ 22, 2024 నాడు మెమో నం. 7300/ఎలెక్స్.బి/బి1/2024-3 జారీ చేశారు. కాగా, ప్రజా ప్రాతినిథ్య చట్టం-1950 ప్రకారం అర్హులైన టీచర్లతో ఓటర్ల జాబితాలు రూపొందించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 21న జారీ చేసిన లేఖలో స్పష్టంగా పేర్కొంది.

చట్ట ప్రకారం అర్హులు ఎవరంటే..!?

టీచర్ ఎంఎల్‌సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందడానికి ఉండాల్సిన అర్హతలను ప్రజా ప్రాతినిథ్య చట్టం-1950లో పేర్కొన్నారు. ది రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్, 1950 సెక్షన్ 27(3)(బి) ప్రకారం టీచర్ ఎంఎల్‌సీ ఎన్నికల కోసం అర్హులైన టీచర్లతో ఓటర్ల జాబితాలు రూపొందించాల్సి ఉంది. ఈ యాక్ట్ ప్రకారం సెకండరీ స్కూల్ (ఉన్నత పాఠశాల) కంటే తక్కువకాని విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే టీచర్ ఎంఎల్‌సీ ఎన్నిక ల్లో ఓటు హక్కు ఉంటుంది. సూటిగా చెప్పాలంటే, హైస్కూల్ ఆపై ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు మాత్రమే టీచర్ ఎంఎల్‌సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న లక్షలాది మంది టీచర్లకు ఓటు హక్కు లేదు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అక్టోబర్ 22 నాడు జారీ చేసిన తాజా మెమోలో తేల్చి చెప్పిన విషయమూ ఇదే.

చట్ట సవరణే ఏకైక మార్గం!

ఎప్పుడో ఏడు దశాబ్దాల క్రితం రూపొందించిన ప్రజా ప్రాతినిథ్య చట్టం-1950లో టీచర్ ఎంఎల్‌సీ ఎన్నికల్లో ఓటు హక్కుకు అర్హతలు నిర్దేశించారు. వాటిని ఇప్పటికీ సవరించకపోవడమే సమస్యకు అసలు కారణం. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తొలినాళ్లలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే టీచర్ల విద్యార్హతలు కేవలం ఏడవ తరగతి మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నత విద్యార్హతలతో నియామకమై, హైస్కూల్ ఆపై ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లకు మాత్రమే అప్పుడు టీచర్ ‌ఎంఎల్‌సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు. కానీ, గడిచిన డెబ్భై ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల కనీస విద్యార్హతే ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. డాక్టరేట్, పీజీలు వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు సైతం వేలల్లో పనిచేస్తున్నారు. ఈ మార్పులను పరిగణనలోకి తీసుకొని ప్రజా ప్రాతినిథ్య చట్టం-1950ని వెంటనే సవరించాలి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లపై ఉన్న వివక్షను తొలగించాలి. వారికి టీచర్ ఎంఎల్‌సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి.

రెండు రాష్ట్రాల టీచర్లూ ఉద్యమించాలి..

ఇది ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. విడివిడిగా కాకుండా, సంఘాలు ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాలి. సమస్యను ఇరు రాష్ట్రాల సీఎంలకు వివరించాలి. అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించమని కోరాలి. అసెంబ్లీ తీర్మా నం చేస్తే, సమస్యకు ప్రాధాన్యత పెరిగి, కేంద్రం సత్వరం స్పందించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తేవాలి. ప్రజా ప్రాతినిథ్య చట్టం-1950కి సవరణలు పెద్ద కష్టతరమైన పనేం కాదు. కేవలం సింపుల్ మెజారిటీతో సవరణలు చేయవచ్చు. గతంలో చాలాసార్లు సవరణలు జరిగాయి కూడా. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న లక్షలాది మంది టీచర్ల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. వారికి ఓటు హక్కు కల్పించేందుకు చట్ట సవరణ చేయడానికి సత్వరం చర్యలు ప్రారంభించాలి.

మానేటి ప్రతాపరెడ్డి,

టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు,

Advertisement

Next Story

Most Viewed