సెప్టెంబర్ 17 విలీన దినోత్సవమే..!

by Ravi |   ( Updated:2024-09-17 00:45:23.0  )
సెప్టెంబర్ 17 విలీన దినోత్సవమే..!
X

తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా హైదరాబాద్ సంస్థానంతో పాటు దేశవ్యాప్తంగా భూసంస్కరణ ఎజెండాను ముందుకు తెచ్చింది. భూమికోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం..పేదలకు న్యాయం కోసం.. నైజాం రాచరిక వ్యవస్థ నిర్మూలన, నైజాం సంస్థానం విలీనం కోసం జరిగిన మహత్తర సాయుధ రైతంగ పోరాటం 76వ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకుందాం.. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరుపుకొని తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం! వారి ఆశయ సాధన కోసం పునరంకితమవుదాం!

హైదరాబాద్ సంస్థానం నుండి విడిపోయిన కర్ణాటక, మరాట్వాడా ప్రాంతాల్లో విలీన దినా న్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుంటే.. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పాలకులు తెలం గాణ విలీనాన్ని అధికారికంగా జరపకుండా దశాబ్దాలుగా తొక్కిపెడుతూ వచ్చారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం, విలీన దినోత్సవాన్ని పట్టించుకోలేదు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విలీనమో, విమోచనమా అని పక్కకు పెట్టి ఈ రోజును ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతోంది.

ఆంధ్ర మహాసభ పోరాట శంఖం

1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభలో రావినారాయణరెడ్డి అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత గ్రామగ్రామానికి ఆంధ్ర మహాసభ విస్తరించింది. అప్పటికే ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభలో కీలక పాత్రధారిగా మారింది. నిజాం తాబేదారులుగా జాగిర్దార్లు, జమీందారులు, దొరలు, దేశ్‌ముఖ్‌ లు, భూస్వాముల విచ్చల దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నించే, ఎదిరించే శక్తి లేని ప్రజలు కష్టాలను భరిస్తూ, వెట్టిచాకిరి చేస్తూ కన్నీళ్లు మింగుతున్న తరుణంలో ఆంధ్ర మహాసభ రూపంలో కమ్యూ నిస్టు పార్టీ ప్రజలను సమాయత్తపరిచింది. గ్రామాలలో సంఘాలు ఏర్పడ్డాయి. సంఘ సభ్యు లపై నిజాం తొత్తులు దాడులకు గుండా లను ప్రయోగించాయి. అక్రమ కేసులు బనా యించి జైళ్లకి పంపారు. ఇక దెబ్బకు దెబ్బ తప్పదని ఆంధ్ర మహాసభ- కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించారు.

సాయుధ పోరుకు పిలుపు..

1947 సెప్టెంబర్ 11వ తేదీన ఆంధ్ర మహాసభ - కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్దుం మొయినుద్దీన్ వంటివారు సాయుధ పోరుకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో నాటి కమ్యూనిస్టు పార్టీతో పాటు నైజాం రాచరిక వ్యవస్థను వ్యతిరేకిస్తున్న నాయకులతో పాటు వేలాది మంది ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు సమర శంఖం పూరించారు. 'అయ్యా నీ బాంచన్ దొర 'అని తరతరాలుగా వెట్టి చేసిన ఆ చేతులతో బంధుకులు పట్టారు. పలుగు -పారా, కారం-రోకలి, వరిసెల -బరిసె అందిందల్లా ఆడ- మగ తేడా లేకుండా ఆయుధాలుగా మారాయి. అందరూ రజాకార్లను, నిజాం బలగాలను ఎదుర్కొనడానికి సంసిద్ధులయ్యారు. 10వేల మంది గెరిల్లా దళ సభ్యులుగా, లక్షమందికి పైగా రక్షక దళ సభ్యులుగా చేరా రు. తెలంగాణలోని దొరలు- భూస్వాములు, ప్రభుత్వ ఏజెంట్లు తప్ప తెలంగాణ ప్రజలంతా ఒక్కటిగా కదిలారు. ప్రాణాలకు తెగించారు, లక్ష్యసాధనకు నడుం బిగించారు. ఊరురూ ఒక విప్లవ కేంద్రమైంది. ప్రతి వ్యక్తి ఒక సైనికుడు అయ్యాడు. తెలంగాణ ఎరుపెక్కింది. ప్రజా చైతన్యానికి ప్రతీక అయింది. తెలంగాణ అంతట రజాకార్లు నిజాం సేవకులకు వ్యతిరేకంగా పోరాటం సాగింది.

ప్రభుత్వమే నిర్వహించాలి!

ప్రజాస్వామిక హక్కులు ఒనగూరిన రోజును ఘనంగా జరుపకుండా ముస్లిం చాందసవాదులకు తలొగ్గి వేడుకలను నిరాకరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం కాలం గడిపింది. నేడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, నైజాం స్టేట్ భారత యూనియన్‌లో విలీనమైన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని.. తెలంగాణ అమరవీరులను స్మరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ అమరవీరులకు జోహార్లు..

- ఉజ్జిని రత్నాకర్ రావు

94909 52646

Advertisement

Next Story