సంక్షేమ పథకాల్లో.. ఉద్యమకారులకు రిజర్వేషన్ అందించాలి!

by Ravi |   ( Updated:2023-09-14 00:01:00.0  )
సంక్షేమ పథకాల్లో.. ఉద్యమకారులకు రిజర్వేషన్ అందించాలి!
X

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల విలువ వెలకట్టలేనిది. స్వరాష్ట్రం కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా భవిష్యత్ తరాల బాగు కోసం తమ విలువైన జీవితాలను త్యాగం చేసుకున్న ఉద్యమకారుల కోసం ఏం చేసినా తక్కువే. వారు చేసిన త్యాగాల జ్ఞాపకాలతో ఏర్పడిన రాష్ట్రంలో..ఉద్యమంలో అమరవీరులైన కుటుంబాలకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఈ ఉద్యమంలో పోరాటం చేసి ప్రాణాలతో బయటపడి ఉద్యమకారులుగా గుర్తింపు పొందిన కొందరు మాత్రం బతికున్న జీవచ్ఛవాలుగా బ్రతుకు ఈడుస్తున్నారు.

ద్రోహులకు.. ఊడిగం చేయలేక!

రాష్ట్రం కోసం ఎందరో ఉద్యమకారులు పోరాడితే ఆ వర్గాలలో ఒకరికి అవకాశం ఇచ్చి మొత్తం సమూహానికి న్యాయం చేసినట్టుగా ప్రభుత్వం భ్రమల్లో ఉంటోంది. ఉదాహరణకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో ఎందరో విద్యార్థులు ప్రాణాలకు తెగించి పోరాడి, జైలు జీవితాలు, పోలీసుల దెబ్బలు, రబ్బరు బుల్లెట్లు, చలికాలంలో శరీరాన్ని అతలాకుతలం చేసే గాయాలు ఎన్నో ఓర్చుకుంటే కేవలం ముందు వరసలో ఉన్న నలుగురు అయిదుగురికి ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దొరికింది. అంతమాత్రాన OU, KU లో పోరాటం చేసిన వారందరికీ న్యాయం జరిగిందంటే దానంత మూర్ఖత్వం మరొకటి లేదు.

ఇంకా విచిత్రంగా మొదటి దఫాలో అవకాశాలు పొందిన విద్యార్థి నాయకులు ఒక కోటరీగా ఏర్పడి మరో విద్యార్థి నాయకుడిని ఆ కోటరీలోకి వెళ్ళకుండా ప్రభుత్వంలో వాళ్ళ స్థానం పదిలంగా కాపాడుకుంటున్నారు. ఈ కోటరీలను దాటుకొని వెళ్లి ప్రగతి భవన్‌లో పదవి పొందటం సాధ్యమయ్యే పనేనా? తెలంగాణ ఉద్యమ నాయకుడిగా గర్వంగా చెప్పుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అందరికి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా? ఇవాళ తెలంగాణాలో అధికారం అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూర్చున్న సింహాసనాలు ఎందరో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో తయారైనవి అని గుర్తులేదా?

ఇంకా పరిశీలిస్తే..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత రాజకీయ సుస్థిరత కోసం కేసీఆర్ ఇతర పార్టీల నాయకులను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. దీంతో తెలంగాణ ఉద్యమంలో లేని నాయకులు, తెలంగాణ బలంగా వ్యతిరేకించిన నాయకులు ఉద్యమకారులుగా, నాయకులుగా తయారయ్యారు! దీంతో ఉద్యమంలో నిజంగా నాటి ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడినవారు నాయకుల ముందు ఊడిగం చేయలేక, వాళ్ళ నాయకత్వాన్ని బలపరచలేక, మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి పరిస్థితి ముందుకు పోతే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి చందాన ఉంది. వారికి కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. అవి అందక ఎవరికి మొర పెట్టుకోవాలో తెలియక దిక్కుతోచని పరిస్థితులు అనుభవిస్తున్నారు.

అందరికీ న్యాయం చేసేందుకు..

అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం 1969 నుండి ఇప్పటి వరకు పోరాడిన ఉద్యమ కారులకు, వారి కుటుంబాలకు అన్ని సంక్షేమ పథకాలలో 50% రిజర్వేషన్ కల్పించాలి. ఇది అమలుపరిస్తే ఉద్యమకారులందరికి న్యాయం చేకూరుతుంది. అందరికి రాజకీయ పరమైన అవకాశాలు ఏ పార్టీ ఇవ్వలేదు కానీ ఈ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అందరికీ న్యాయం చేయవచ్చు.

ఉద్యమ పార్టీ అని ఘనంగా చెప్పుకొనే పార్టీ ఉద్యమకారులకు న్యాయం చేసే బాధ్యత తీసుకోవాలి. ఎటువంటి రాజకీయ అపేక్ష లేకుండా ఉద్యమం చేసిన వారికి కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించకుంటే వాళ్ళ పోరాటాలకు మనమిచ్చే గౌరవం ఏంటనేది నాయకత్వం ఆలోచించాలి! తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు, అమరవీరుల స్థూపాల కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్న మన ప్రభుత్వం బ్రతికి ఉన్న ఉద్యమకారులకు కనీసం పట్టెడు అన్నం పెట్టాలి. తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమకారుల ప్రాణాలతో చెలగాటం ఆడి వందల మంది మంది ఆత్మ బలిదానాలకు కారణమయిన నాయకులను రాజకీయ సుస్థిరత పేరుతో మంత్రి పదవుల్లో కూర్చోబెడుతున్న మన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వారి కోసం ఏం చేస్తున్నామనేది పునరాలోచించాలి! తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వణికించి చరిత్రను తిరగరాసిన చరిత్ర ఉద్యమకారులది. వారిని విస్మరించి ఉద్యమ మూలాలను మరిస్తే ఏ ప్రభుత్వమైనా బతికి బట్ట కట్టడం సాధ్యం కాని పని ! అందుకే ఉద్యమ నాయకుడైన కేసీఆర్ పెద్ద మనసుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 50% రిజర్వేషన్ కల్పించి సైనికుల లాంటి ఉద్యమకారులను కాపాడుకోవాలి! ఎందుకంటే తెలంగాణ అంటే… తెలంగాణ అమరవీరుల నెత్తుటి శ్వాసల వీలునామా!

డా. కందుల మధు

TSJAC-OU JAC రాష్ట్ర అధ్యక్షుడు

95952 66666

Advertisement

Next Story