తెలంగాణ వైతాళికులు సురవరం

by Ravi |   ( Updated:2023-08-25 00:01:25.0  )
తెలంగాణ వైతాళికులు సురవరం
X

తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలు హిందూ పండుగలు కోసం తెలంగాణ సమాజం కోసం శ్రమించిన వారిలో చిరస్మరణీయులు సురవరం ప్రతాపరెడ్డి. నిజాం పాలనలో నలిగిపోతున్న భాషా సంస్కృతులకు దిశా నిర్దేశం చేసిన ప్రజ్ఞాశాలి. నిద్రాణమైన తెలంగాణ సమాజాన్ని తన కలంతో మేల్కొల్పి జాగరూకం చేసిన తెలంగాణ వైతాళికులు సురవరం. తన కలంతో నిజాం రాజు పైన నిప్పుల వర్షం కురిపించాడు. జోగిపేటలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా చేసిన ప్రసంగం మరపురానటువంటిది. పాతికేళ్ళ వయసులో గోల్కొండ పత్రిక సంపాదకుడుగా ఎన్నో కథలు వ్యాసాలు, సమీక్షలు, వ్యాసాలు, కవితలు, కథలు, మొదలగునవి ప్రచురించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల బాధలను, గోసను చెప్పడానికి గోల్కొండ పత్రికను ఆయుధంగా మలిచి, కృత కృత్యుడయ్యాడనటంలో సందేహం లేదు.

బహుముఖాలుగా ఆయన ప్రతిభ..

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించాడు. సురవరం గారు మంచి పండితుడు. 1926లో ఆయన నెలకొల్పిన ‘గోలకొండ పత్రిక’ తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాపరెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి.

ప్రజలను చైతన్యం చేస్తూ..

తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు. నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు . జీవితం చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను ‘కేంద్ర సాహిత్య అకాడమి’ అవార్డు లభించింది.

(నేడు సురవరం వర్ధంతి)

యాడవరం చంద్రకాంత్ గౌడ్

94417 62105

Advertisement

Next Story

Most Viewed