తెలంగాణ ఉద్యమ గళం

by Ravi |
తెలంగాణ ఉద్యమ గళం
X

తెలంగాణ ఉద్యమంలో తన ప్రతిభావంతమైన గొంతుతో ప్రజల హృదయాలను దోచిన ఓ గొప్ప గాయకుడు సాయిచంద్. తన పాటతో ఉద్యమ జ్వాలను రగిలించిన మాన్యుడు. ఆయన పాడిన పాటలు తెలంగాణ ప్రజల ఆత్మగా మారి ఉద్యమాన్ని మరింత బలపరిచాయి. గిరిజన గూడెం నుండి, నగర వీధుల వరకు ప్రతి మనసును తాకింది. తెలంగాణ పోరాట జ్వాలలను రేకెత్తించింది. తెలంగాణ ప్రజలకు ప్రేరణనిచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసింది. విప్లవ గీతాలతో ఉద్యమాన్ని నడిపించి, కళాకారుడిగా, ఉద్యమకారుడిగా, జీవితాంతం పోరాడి, తెలంగాణ చరిత్రలో తన పేరును స్థిరస్థాయిగా పాటలతో తనకు తానే చెక్కుకున్న అభ్యుదయ అక్షర శిల్పి తాను.

సాయి‌చంద్ తన చిన్ననాటి నుండే సంగీతం పట్ల మక్కువ చూపారు. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆయన, తెలం గాణ సంస్కృతి, జానపద కళలను తనలో ఇముడ్చుకుని. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత, తన పాటల ద్వారా ఉద్యమానికి తన వంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. సాయి‌చంద్ పాటలు ఉద్యమకారులకు ఒక ప్రేరణగా మారాయి. ఆయన పాటలు తెలంగాణ ప్రజల ఆవేదనను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఉండేవి. ఉద్యమ కార్యకర్తలను ఉత్సాహపరిచి, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేవి. సాయిచంద్ పాటలు తెలంగాణ ఉద్యమ గళంగా మారాయి.

ప్రజల ఆక్రోశాన్ని పాటగా మలిచి

సాయి‌చంద్ 1984 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వనపర్తి జిల్లాలోని అమరచింత గ్రామంలో వెంకటరాములు మణేమ్మ దంపతులకు జన్మించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ తెలుగు పట్టభద్రులై తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేశారు. అణగారిన వర్గాల ప్రజలపై జరుగుతున్న అన్యాయాలను అంటగడుతూ, ఐదు దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రజల ఆవేదనను ఆక్రోశాన్ని పాటల రూపంలో ప్రతిధ్వనింప చేశారు.

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా అంటూ తెలంగాణ ఉద్యమంలో కొడుకులను కోల్పోయిన తల్లుల బాధలను వివరించే పాట అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ హృదయాన్ని సైతం కరిగించింది అంటే ఏ స్థాయిలో పాటపై, ఉద్యమంపై ప్రాణం పెట్టాడు అర్థం అవుతుంది. రైతుల కష్టాల గురించి, మమతల కోవెల మణిదీపం అమ్మ గురించి, నీ మనసు ఎంత మంచిదో నాన్న అంటూ సాయిచంద్ పాడిన ప్రతి పాట తెలంగాణ ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచి ఉంటుంది.

రాజకీయం కంటే పాటకే ప్రాధాన్యం!

సాయి‌చంద్ తన పాటల ద్వారా రాజకీయంగా చురుకుగా పాల్గొన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మద్దతు నిచ్చారు. తను ప్రత్యక్ష రాజకీయ పదవులు ఏవీ అందిపుచ్చుకోనప్పటికీ తన పాట తన ప్రయాణం మాత్రం ఎప్పుడు ప్రజలతోనే సాగిపోయింది. తన సాహిత్య, సామాజిక రాజకీయ సేవను గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ 2021 డిసెంబర్ 15న సాయిచంద్‌కి గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ పదవి బాధ్యతలను అప్పజెప్పింది. అప్పటి నుంచి తన చివరి శ్వాస విడిచేంతవరకు అంటే 2023 జూన్ 29 వరకు కూడా నీతి నిజాయితీలతో తన ధర్మాన్ని నిర్వర్తించారు. తను రాజకీయ పదవుల కంటే కూడా ఉద్యమపాటకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.

యాస గోసని గొంతులో దాచి...

సాయి‌చంద్ లేని లోటు వారి కుటుంబానికే కాదు తెలం గాణ సమాజానికి కూడా తీరని లోటు. సాయిచంద్ ఆశించి న తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటూ, తెలంగాణ మట్టి పదాలలో నుంచి పుట్టిన అతి సామాన్యమైన బిడ్డ తెలంగాణ యాస గోసని తన గొంతులో దాచుకుని అవే ఆయుధాలుగా చేసుకొని తెలంగాణ పోరు బాటలో పాటలతో ప్రయాణం కొనసాగించిన, సాయిచంద్ తెలంగాణ ఉద్య మంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన తన పాటల ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేకమైన స్వరం ఇచ్చారు. ఆయన జీవితం ప్రతి తెలంగాణ వాసికి స్ఫూర్తిదాయకం.

పూసపాటి వేదాద్రి

99121 97694

Advertisement

Next Story

Most Viewed