- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పదునైన అక్షర కవిత్వ సూర్యుడు
కాలగమన చక్రంలో సామాజిక, ఆర్థిక స్థితిగతులన్నీ భిన్నమైన రూపాలుగా అక్కడి పరిస్థితుల ప్రభావం వలన మానవుడిలో విపరీతమైన మార్పులు వస్తాయి. అందుకే ఒక్కొక్కరు ఒక్కో విధమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే సామాజిక వ్యవస్థలో జనుల నాడులను తదేక దూర దృష్టితో దర్శించి బాధితుల పక్షాన అక్షర గొంతుకను, రాగ ద్వేషాల కాలాన్ని తక్కెడలో కొలిచే వారు చాలా అరుదు. ఇలాంటి పదునైన భావజాలాన్ని సిరాక్షరంతో సిజేరియన్ చేసిన అక్షర కవితా కార్మికుడు 'అలిశెట్టి ప్రభాకర్'. అక్షర తూటాలతో అగ్ని పుట్టించి భావాల జన ఘోషను మినీ కవితల రూపంలో చురకలు వదిలిన అసామాన్య కవిత్వా సూరీడు. అల్ప పదాలతో ఆకాశమంత అనంత భావవ్యక్తీకరణ పండించి పదాల పద్మ గర్భానికి ఆయువును పోసి, సూక్ష్మ వాక్య చతురతతో, సామాజిక రుగ్మతలపై విప్లవ బాణాలను సంధించి స్ఫూర్తి రగిలించిన సాహిత్య శేఖరుడు అలిశెట్టి ప్రభాకరుడు.
ప్రజలకు అర్థమయ్యేలా, నిర్మొహమాటంగా
తన జెండాను, ప్రతిఘటన ఎజెండాను దింపకుండా తనదైన శైలిలో జనుల పదాలతో సామాజిక అంశాలను, సామాన్య వస్తువులను, ఎదురైన సమస్యల ఆనవాళ్ళను తన కలంలో ఒంపుకొని సూటిగా ఆ భావం గుండెల్లో గుచ్చుకునేలా, చెంప చెళ్లుమనేలా వ్యక్తపరిచిన కవిత్వ మాంత్రికుడు. జననం, మరణం ఒకేరోజు కలిగిన అభ్యుదయ జననీయుడు ఆయన. 1954 జనవరి 12న జగిత్యాలలో పుట్టాడు. ఆయన యుక్త వయసులోనే ఆర్టిస్ట్‌గా ఎదిగి తర్వాత సాహితీ మిత్ర దీప్తి పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించారు. జీవనం కోసం జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్‌లలో స్టూడియోలు నెలకొల్పి ఫొటోగ్రాఫర్‌గా జీవిత ప్రస్థానం సాగించాడు. కుంచె బొమ్మల్నీ, కెమెరా బంధించిన ఫోటోల్నీ తన కవిత్వానికి ఆసరా చేసుకున్నాడు. వాటిని తాను చెప్పే భావాల్నీ వెలిగించే దివిటీలుగా మార్చుకున్నాడు.
తన కవిత్వ అక్షరాలతో సృజనాత్మకతతో సునాయాసంగా ప్రజలకు అర్థమయ్యేలా, నిర్మొహమాటంగా కలంతో అక్షరాలను అందించారు. విభిన్నమైన కవిత్వాలు వెలువడుతున్న సమయంలో పేదరికంలోని మరింత పేదరికాన్ని, బాధల నుంచి మరింత బాధలను, కన్నీళ్ళను కవితా వస్తువుగా చేసుకొని కవితలు రాశాడు. ఎర్రపావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ మొదలైన కవితలకు అలిశెట్టి మిత్రులైన నిజాం వెంకటేష్, బి.నర్సన్ కదలిక తెచ్చారు. అలాగే దాసరి నాగభూషణం, వి.సామ్రాట్, అశోక్ కుమార్, గుండేటి గంగాధర్, దీవి సుబ్బారావు, జయధీర్ తిరుమలరావు ధీమాతో ఓ పుస్తక సంకలనం వెలువరించారు.
ఆయన రచనల్లోని కవితలు
అలిశెట్టి ప్రభాకర్ కవితల పుస్తకంలోని మచ్చుతునక రవ్వలు కొన్ని గొంతుకోస్తే పాట ఆగిపోదు అది ముక్త కంఠం, గొలుసు లేస్తే పోరు నిలిచిపోదు, అది ప్రజా యుద్ధం. అని ఒక కళాకారుడి మీద హత్యాయత్నం జరిగినప్పుడు చలించి రాసిన పంక్తులు. 'భయం' అనే కవితలో బాంబుని చూడగానే బెంబేలు పడితే అదెప్పుడూ నీ గుండెల్లోనే పేలుతుందని, దేనిని చూసి భయాందోళన చెందకూడదని ఉద్ఘాటించారు. అలాగే ఒక వేశ్య గురించి తను శవమై, ఒకరికి వశమై, తనువు పుండై, ఒకరికి పండై, ఎప్పుడూ ఎడారై, ఎందరికో ఒయాసిస్సై అని అనంతభావాల్ని చిన్న కవితలో పేర్చారు. అలాగే దేవుళ్ళు తమ గుళ్ళకి రాత్రిళ్లంతా తాళాలు వేసుకుంటున్నారెందుకో బహుశా మనుషుల మీద నమ్మకం పోయిందేమోనని అంటారు. న్యాయాన్ని ఏ కీలు కా కీలు విరగొట్టగలవాడే వకీలని, అలాగే సినిమాలు- ప్రేక్షకులపై కోచింగ్ లేని మ్యాచికి చప్పట్లు కొట్టే సన్నాసులని, కొవ్వెక్కి ఉండటం, కొవ్వొత్తులూదటమని బర్త్ డే పార్టీలపై చురకలు అందించారు. నగరాల్లో 'అత్యధికంగా, అత్యద్భుతంగా, అస్థి పంజరాలని చెక్కే ఉలి-ఆకలి' అని నగరాల్లో పేద మధ్య తరగతి మనో గాథలు అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే మరో కవితలో గడియారం పెట్టుకున్న ప్రతివాడూ పరిగెడుతున్న కాలాన్ని పట్టుకోలేడని, కుక్కలూ లేని, కుక్కరూ లేని ఇల్లే ఒకింత ప్రశాంత ఉంటుందని, విద్యార్థుల ఎగుమతి, నిరుద్యోగుల దిగుమతి చేయగల రేవులు యూనివర్సిటీలు అంటూ 'సిటీ లైఫ్' సంకలనంలో కవితలు రాశాడు.
అలిశెట్టి ఏ కవిత రాసినా దానిలో పరమార్థంతో పాటు నిజానిజాలు నర్మగర్భంగా గోచరిస్తాయి. వాస్తవాలను రాయడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. కవిత్వాన్నే శ్వాసగా, ఆశగా చేసుకుని అనుభూతి, భక్తి, ముక్తి, సరసం, వినోదానికి పరిమితమైన పాఠకుల మనసులను ప్రగతిశీల ఆలోచనా ధృక్పథంలోకి మళ్ళించగల నేర్పరి అనడంలో అతిశయోక్తి లేదు. వర్తమాన కవిత్వానికి కాయినేజ్ పెంచిన కవినతడు. కవిత్వంతో తను తానుగా వుండిపోతూ, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా టీబీ సోకి ఒంటిని కబళిస్తున్నా లెక్కచేయలేదు. ఈ విషయమై మిత్రులు హెచ్చరించినా లెక్కచేయలేదు. ఎన్నో అద్భుతమైన కవితలను శిలా కాగితంపై అక్షరాల ఉలితో చెక్కి చెదరనివ్వని ముద్రలా నిలిచిపోయాడు. 'డబ్బు మనిషిలా నువ్వు, జబ్బు మనిషిగా నేను అందుకే నువ్వెప్పుడు డాక్టరువి... నే పేషంటుని' అంటూ మినీ కవితలు రాస్తూనే 1993 జనవరి 12 న కన్నుమూశాడు. ఆయనకు జోహార్లతో సాహిత్యాభివందనాలు అందించడం మనందరి కర్తవ్యం.
( నేడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి - వర్ధంతి సందర్భంగా )
డా. పగిడిపల్లి సురేందర్
80748 46063