పాఠశాలల్లో దండనపై పునరాలోచించాలి..!

by Ravi |   ( Updated:2024-05-18 00:45:30.0  )
పాఠశాలల్లో దండనపై పునరాలోచించాలి..!
X

నేటితరం విద్యార్థిని విద్యార్థులకు సమాజం పట్ల కనీస అవగాహన, గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయి. అందుకు కారణాలు అనేక విధాలుగా ఉండవచ్చును. కానీ తల్లిదండ్రులే పిల్లలకు స్వేచ్ఛనిచ్చి వారు ఏమి చేస్తున్నారనే విషయాలను పట్టించుకోకపోవడంతో.. వారు ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారు. ఆ పిల్లవాడు పెద్ద తప్పు చేసినట్టు తల్లిదండ్రుల వరకు వచ్చే వరకు కూడా తమ పిల్లలు ఇలా చేస్తున్నారనే విషయాలు బయటకు రావు.

పాఠశాల దశ కీలకం..!

సాధారణంగా పాఠశాల దశ ప్రతి ఒక్కరికీ జీవితాన్ని పరిచయం చేస్తుంది. చదువు, స్నేహం, పెద్దల పట్ల గౌరవం, కుటుంబ సభ్యులతో, బంధువులతోనూ స్థాయికి తగ్గ ప్రవర్తించుటకు పాఠశాల దశ కీలకంగా ఉంటుంది. పాఠశాలలో ఉపాధ్యాయులు సంబంధిత సబ్జెక్టు విషయాలతో పాటు ఇవన్నీ విషయాలు విద్యార్థులకు బోధించేవారు. దాదాపు పదిహేనేళ్ల నుంచి క్రమక్రమంగా విద్యార్థులో ఈ మానవీయ విలువలు తగ్గిపోతున్నాయి. తోటి వారితోనే కలహాలు పెట్టుకుంటూ పాఠశాల దశలోనే అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడుతున్నారు. మద్యం సేవిస్తూ తిరుగుతున్నారు. చదువు చెప్పే గురువులకు కూడా కనీస విలువ ఇవ్వడం లేదు. ఇందుకు కారణం నూతనంగా విద్యావిధానంలో మార్పులు చోటు చేసుకోవడం. ప్రధానంగా ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య, విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానంగా మారటంతో ఈ పరిస్థితి తలెత్తింది.

2009లో వచ్చిన విద్యా హక్కు చట్టం సెక్షన్ 17 ప్రకారం బాలలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. దాని ప్రకారం ఎవరైనా ఉపాధ్యాయులు శారీరక శిక్షలకు, మానసిక వేధింపులకు గురి చేసినట్లయితే ఈ చట్టం ప్రకారం ఉద్యోగ నియామకాల ఆధారంగా క్రమశిక్షణ చర్యలకు గురవుతారని ఆ చట్టం పేర్కొంటుంది. అందువలన పిల్లల్లో పాఠశాల స్థాయి నుంచే దాదాపు పదిహేనేళ్ల నుంచి వారి స్టైలిష్ వస్త్రధారణ, కటింగ్‌లు చేసుకుంటూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు. కనీసం పరీక్షల సమయంలో అయినా చదువుకోవడానికి శ్రద్ధ చూపడం లేదు.

పరిమితులతో కూడిన దండన..

ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్షల్లో ఓ పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్‌ కొరకు సహకరించలేదని ఓ విద్యార్థినిని వేరే పాఠశాల విద్యార్థి పరీక్ష అనంతరం వేధించాడు. ఈ గొడవ రెండు పాఠశాల విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రధానంగా పాఠశాల దశలో దండన చేస్తే విద్యార్థుల్లో ప్రతికూల ఆలోచనలకు తావు ఉండదని మేధావుల అంచనా. కరోనా వైరస్ ద్వారా విద్యా విధానం చిన్నాభిన్నం కావడంతో కొంత వరకు విద్యార్థుల్లో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. ఆన్లైన్ తరగతుల పేరుతో చాలా వరకు విద్యార్థులు అంతర్జాలంలో మునిగిపోతూ ఆన్లైన్ గేమ్స్‌లో బెట్టింగులకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల ఖాతాల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత ఆలోచనలకు బదులు ‌ఇతరత్ర చెడు ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. విద్యార్థుల్లో మందగించిన క్రమశిక్షణ విలువలు, చదువును అశ్రద్ధ చేయడం వంటి వాటిపై ప్రభుత్వాలు దృష్టి సారించి పాఠశాల సముదాయల ద్వారా, తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశాల ద్వారా సమగ్రంగా అధ్యయనం చేసి దండన పైన పునరాలోచన చేయాలి. తప్పనిసరిగా కొన్ని పరిమితులతో కూడిన విధించేలా ఉపాధ్యాయులకు ఆదేశాలివ్వాలి. ఎందుకంటే మొదట పాఠశాలలో క్రమశిక్షణకు అలవాటుపడ్డ విద్యార్థిని విద్యార్థులు కళాశాల, ఉన్నత చదువుల్లో రాణిస్తారు. సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటారు. సానుకూల ఆలోచనలు చేస్తారు. గురువును గౌరవించని వారెవరు ఇతరులను గౌరవించలేరు. దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్యనే నిర్మితమవుతుందన్న డి.ఎస్.కొఠారి కమిషన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు.

-ఎజ్జు మల్లయ్య

తెలుగు లెక్చరర్

9100610501

Advertisement

Next Story