డిజిటల్ 'దిశ'గా ప్రింట్ మీడియా..!

by Ravi |   ( Updated:2023-01-15 09:13:49.0  )
డిజిటల్ దిశగా ప్రింట్ మీడియా..!
X

కేవలం మూడేళ్లు కూడా నిండని 'దిశ' దినపత్రిక డిజిటల్ ప్లాట్ ఫాంపై సక్సెస్ కావడం దినపత్రికల రంగంలో పెను సంచలనం రేపింది. ప్రింట్ మీడియా విశ్వసనీయతతో సోషల్ మీడియా వేగంతో వార్తలను అందించే లక్ష్యంతో ప్రారంభమైన 'దిశ' ఒక్కొక్క మెట్టును అధిరోహిస్తూ మెయిన్ స్ట్రీమ్ పేపర్లకు దీటుగా, చాలాసార్లు ముందుంటూ దూసుకుపోతోంది. 'దిశ'ను శత్రువుగా భావించేవాళ్లు సైతం ఒప్పుకుంటున్న రీతిలో మూలమూలనా విస్తరిస్తోంది. 'దిశ' గురించి, 'దిశ' డైనమిక్ ఎడిషన్ల గురించి తెలియని పల్లె, 'దిశ' న్యూస్ క్లిప్పింగులు లేని వాట్సాప్ గ్రూపు నేడు లేదంటే అతిశయోక్తి కాబోదు.

వార్తలను, కథనాలను, విశ్లేషణలను జరిగింది జరిగినట్టు, ఎప్పటికప్పుడు వెబ్‌తో పాటు పేపర్ ఫార్మాట్‌లో ఇవ్వడం.. పెట్టుబడి ఒత్తిడులకు లొంగకుండా, పరిమితులు విధించుకోకుండా వాస్తవాలను నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు రాయడం.. ఆకర్షణీయ ప్రొమోలతో పాఠకుల్లో వాటిని వైరల్ చేయడం.. ఒక యాగంగా కొనసాగించడం ద్వారానే 'దిశ'కు ఇది సాధ్యమైంది. ఒక న్యూస్ బ్రేక్ అయిందంటే చాలు.. నిమిషాల వ్యవధిలోనే దిశ మీడియా ద్వారా అది దేశ విదేశాల్లో విస్తరించివున్న లక్షలాది తెలుగు పాఠకులకు చేరిపోతోంది.

డిజిటల్‌కు మారుపేరు 'దిశ'

'దిశ' సక్సెస్ తెలుగు మీడియా మార్కెట్‌లో కొన్ని మార్పులకు కారణమైంది. మొదటగా, అనేక 'ఈ-పేపర్లు' పుట్టుకువచ్చాయి. ఇంకా పుట్టుకువస్తున్నాయి. వీటిలో కొన్ని కేవలం పీడీఎఫ్‌లకే పరిమితం కాగా, మరికొన్ని డిజిటల్ డొమైన్లలోనూ లభ్యమవుతున్నాయి. బడా సంస్థల నుంచి తొలగించబడ్డవాళ్లు, వైదొలగినవాళ్లు, ఖాళీగా ఉన్నవాళ్లు పలువురు సూత్రధారులు, పాత్రధారులుగా ఇవి నడుస్తున్నాయి. కొన్ని కొత్త సంస్థలూ ఏర్పడుతున్నాయి. సాధారణంగా 4 నుంచి 8 పేజీలతో వెలువడుతున్నాయి. అయితే, వీటి విశ్వసనీయత ప్రశ్నార్థకం కాగా, విస్తరణ నామమాత్రమని చెప్పవచ్చు. కేవలం వేళ్ల మీద లెక్కబెట్టదగిన 'ఈ-పేపర్లు' మాత్రమే కొంత ఉనికిని, వ్యూయర్‌షిప్‌ను కలిగివున్నాయి.

రెండవది, ఇప్పటికే ఏళ్ల తరబడి పాతుకుపోయిన ప్రజాదరణ పొందిన పేపర్లు కూడా డిజిటల్ బాట పట్టాయి. కొవిడ్ మహమ్మారి కొట్టిన దెబ్బ, పెరిగిన న్యూస్ ప్రింట్ ఖర్చు, జేబులో స్మార్ట్ ఫోన్‌తో సహజీవనం చేస్తున్న ఆధునిక మానవులు.. కారణాలు ఏమైనా కావచ్చు.. కానీ ఈ సంస్థలన్నీ తమ ప్రింట్ సర్క్యులేషన్‌ను, పేజీల సంఖ్యను తగ్గించుకున్నాయి. మరోవైపు, డిజిటల్ మీడియా విభాగాలను బలోపేతం చేస్తున్నాయి. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) ప్రకారం మార్కెట్‌లో మొనగాళ్లుగా నిలిచిన పత్రికలు సైతం ప్రస్తుతం డిజిటల్ వ్యూయర్‌షిప్‌పైనే దృష్టి పెట్టాయి.

ప్రింట్ ఎడిషన్లకు చెల్లుచీటీ!

తెలుగులో నెంబర్ వన్‌గా ఉన్న ఓ పత్రిక మొత్తం ప్రింట్ ఎడిషన్లను ఎత్తేయడానికి నిర్ణయించుకుని, పెద్ద సంఖ్యలో ఉన్న ఉద్యోగులను ఇంటికి ఎలా పంపించాలో అర్థం కాక సమస్యలతో సతమతమవుతున్నదని సమాచారం. ఒక్కసారిగా కాకుండా దశలు దశలుగా ఈ ప్రక్రియను అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నెంబర్ టూ, త్రీ, ఫోర్‌లుగా ఉన్న పత్రికలు సైతం ఇదే బాటలో పయనించ బూనుకున్నాయని అంటున్నారు. కాకపోతే, వచ్చే రెండేళ్లు ఎన్నికల సీజన్ కనుక, వాటి యాజమాన్యాలకున్న ప్రయోజనాల రీత్యా ఆగుతున్నాయట. అలాగే, అడ్వర్టయిజ్‌మెంట్ల రూపంలో, ప్యాకేజీల రూపంలో సమకూరే రెవెన్యూ కూడా తాత్కాలికంగా ఆ ప్రయత్నాలకు బ్రేకులు వేయడానికి కారణమని తెలుస్తోంది.

కాగా, ఐదేళ్ల క్రితం రాజకీయ నాయకుడైన ఓ పారిశ్రామికవేత్త ఆధ్వర్యంలో ప్రారంభమైన పేపర్.. 'దిశ' దారిలో నడవడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకుందని సమాచారం. దిశ డైనమిక్ ఎడిషన్లను పోలిన రీతిలోనే రేపో మాపో పగలు, సాయంత్రం ఎడిషన్లు తీసుకువచ్చే పనిలో ఆ సంస్థ నిమగ్నమైవుంది. ఇందుకు అవసరమైన జర్నలిస్టుల నియామకం కూడా జరిగిపోయింది. మిగతా ప్రింట్ పేపర్లు కూడా నేడు కాకపోతే రేపైనా పాఠకులకు ఎప్పటికప్పుడు వార్తలు అందించే పద్ధతికి మారక తప్పదని మీడియా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటిదాకా వెబ్ సైట్లు, న్యూస్ చానెళ్లు మాత్రమే ఆ పని చేస్తున్నాయని, వాటికి విశ్వసనీయత అంతగా లేదని అందరికీ తెలుసని వాళ్లంటున్నారు. ప్రింట్ మీడియాకు మాత్రమే అత్యధిక విశ్వసనీయత ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మార్నింగ్ ఎడిషనే కాకుండా మూడుసార్లు డైనమిక్ ఎడిషన్లు తేవడం ద్వారా దిశ పేపర్ ఒక కొత్త ఒరవడిని క్రియేట్ చేసిందని, మిగతావాళ్లు దానిని అనుసరించక తప్పదని స్పష్టం చేస్తున్నారు. లేదంటే మార్కెట్‌లో వెనకబడిపోతారని వాదిస్తున్నారు.

మెరుపువేగంతో ఇచ్చేదే ఇప్పుడు వార్త..

నిజంగానే నేడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ఈ రోజు వార్తలను రేపు ఉదయం చదివే ఓపిక, ఆసక్తి ఇప్పుడు ఎవరికీ లేదు. ఎక్కడ ఏం జరిగిందో ఎప్పటికప్పుడు కావాలి. ప్రతి ఒక్కరి వద్దా మొబైల్ ఉంటుంది. అందులో వాట్సాప్ తదితర సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ లోకి వెళ్లి కనిపించిన పోస్టుల్లో, లింకుల్లో తమకు నచ్చిన వాటిని క్లిక్ చేసి చదవడమే ఇప్పటి పద్ధతి. పేపర్ కొని, ఇంటికి తెప్పించుకుని చదివే, టీవీ ముందు కూర్చుని వార్తలు చూసే టైం ఎవరికీ ఉండడం లేదు. ఇళ్లల్లో, బస్సుల్లో, బస్టాండ్లలో, రైళ్లలో, రైల్వేస్టేషన్లలో, పాన్ షాపుల్లో, వీధి మూలల్లో ఒకప్పుడు కనిపించే పేపర్ల హడావుడి ఇప్పుడు లేకపోవడమే ఇందుకు ప్రబల తార్కాణం. యాభైలు, అరవైల వయసు దాటిన పెద్దవాళ్లు సైతం మొబైళ్లనే ఆశ్రయిస్తున్నారు.

డిజిటల్ 'దిశ'ను ఆదరించాలి

రాబోయేది ఖచ్చితంగా డిజిటల్ మీడియా విప్లవించే యుగం. 'ఈ-పేపర్‌లు', వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు విస్తృతంగా విలసిల్లే యుగం. వచ్చే 2024 ఏప్రిల్, మే సాధారణ ఎన్నికల తర్వాత ప్రింట్ మీడియా అనేది దాదాపు ఉండకపోవచ్చు. లేదంటే కేవలం నామమాత్రంగానే కొనసాగవచ్చు. బడా వ్యాపార సంస్థలే కాకుండా చిన్న కంపెనీలు, వ్యక్తులు సైతం మీడియాలో ప్రాబల్యం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అనేక కొత్త సంస్థలు ఈ రంగంలోకి అడుగిడతాయి. అయితే, పాఠకులకు, వీక్షకులకు నచ్చే కంటెంట్‌ను, విశ్వసనీయతతో, నిష్పాక్షికంగా ఎవరు అందుబాటులో ఉంచుతారో ఆ పేపర్లు, సైట్లు, చానెళ్లు మాత్రమే ఆదరణ పొందుతాయి. ప్రభుత్వాలు సైతం డిజిటల్ వ్యూయర్‌షిప్ ప్రాతిపదికనే గుర్తింపునిచ్చే, అడ్వర్టయిజ్‌మెంట్లు, అక్రెడిటేషన్లు జారీ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి ప్రకటనలను జారీ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ వ్యూయర్‌షిప్‌ ఆధారంగా సైట్లకు గుర్తింపునిస్తున్నది.

నిజమైన పత్రికా స్వేచ్ఛను, నిష్పాక్షికతను కోరుకునే వాళ్లందరూ ఆ రోజును ఆహ్వానించాలి. మీడియాపై కొన్ని సంస్థల గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకించాలి. 'దిశ' లాంటి డిజిటల్ పేపర్లను ఆదరించాలి. ఆర్థికంగా ఆదుకోవాలి. పత్రికలు ప్రజల తరఫున ప్రతిపక్షంగా పని చేయడానికి తోడ్పడాలి.

– డి మార్కండేయ

Advertisement

Next Story