- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంచే (న్యాయం చేసే వారే) చేను మేస్తే ఎలా!?
అది 1987 సంవత్సరం మే 23వ తేదీ మీరట్ నగర శివారులలోని, మిలియానా గ్రామంపై, ఒక పోలీసు కానిస్టేబుల్ బృందం, అర్ధరాత్రి సమయంలో అల్లరి మూకలతో కలిసి, విచక్షణా రహితంగా అమాయక ప్రజలపై కాల్పులు జరిపింది. దీంతో 72 మంది ముస్లింలు అక్కడికక్కడే మరణించారు. ముప్ఫై ఆరు సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మిలియానా గ్రామంలో జరిగిన దుర్మార్గమైన ఊచకోత సంఘటన అప్పట్లో దేశంలో భయాందోళన కలిగించింది. అయితే ఈ కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తు విధానం, కోర్టులో విచారణ దశాబ్దాలుగా నత్తనడకన సాగడంతో ఈ దాడిలో పాల్గొన్న వారిలో చాలామంది చనిపోయారు కూడా. కొన్ని రోజుల క్రితం ఈ కేసు విచారణలో నేరారోపణ ఎదుర్కొంటున్న 40 మంది నిందితులను, స్థానిక న్యాయస్థానం, నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు దేశ ప్రజలందరినీ ఆశ్చర్యంతో పాటు, తీవ్ర నిరాశకు గురిచేసింది. ఏ నాటికైనా కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనీ, గత 36 సంవత్సరాలుగా ఓపికగా, ఆశగా నిరీక్షించిన బాధిత కుటుంబాలకు చివరకు ఆశాభంగమే మిగిలింది. ఈ కేసులో దర్యాప్తు చేసిన ఏజెన్సీలు, దాంతో పాటు ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో సుదీర్ఘ జాప్యం జరిగి బాధితులకు ఎదురుచూసిన న్యాయం ఏ మాత్రం దొరకలేదు.
ఎన్ని సాక్ష్యాలున్నా..
ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే, వివాదాస్పద బాబ్రీ మసీదు, తాళాలు తెరిచాక 1987 మే 17న, మీరట్‌లో పెద్ద ఎత్తున మత సంఘర్షణలు చెలరేగాయి. దీంతో నగరంలో కర్ఫ్యూ విధించారు. ఈ సమయంలో ప్రాంతీయ పోలీసు దళం అల్లరి మూకలతో కలిసి, అక్కడి ప్రజలను అపహరించి, వారిని ఢిల్లీ, యూపీ బార్డర్‌కి తరలించి వారందరినీ కిరాతకంగా కాల్చి చంపింది. శవాలను ఎగువ గంగానది కాలువలో పడేశారు. అయితే, ఈ కేసును తన మొదటి ప్రయత్నంలోనే ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేయటంలో వైఫల్యం చెందింది. ట్రయల్ కోర్టులో సైతం ఈ కేసుకు సంబంధించిన సాయుధ దళం, తన జనరల్ డైరీని చూపించలేదు. దీనిని అవకాశంగా తీసుకోవాల్సిన ప్రాసిక్యూషన్ లోపభూయిష్టంగా పనిచేసి కోర్టుకు అందజేయాల్సిన డాక్యుమెంట్లను, కనీసం క్రమ పద్ధతిలో కూడా ఫైలు చేసి చూపెట్టకపోగా, పోస్టుమార్టం రిపోర్టులు ఒరిజినల్ కు బదులు జిరాక్స్ కాపీలను న్యాయస్థానానికి నిర్లక్ష్యంగా సమర్పించింది. అందుకే కోర్టు వాటిని విశ్వసించలేదు. అయితే ఈ సాక్ష్యాలను కావాలనే కోర్టు అంగీకరించని విధంగా ప్రాసిక్యూషన్ అందించిందనే అనుమానం ఉంది. అలాగే నిందితులలో కొందరు సంఘటనకు ముందే చనిపోయారంటూ, ఓటర్ల జాబితాలో వాళ్ళ పేర్లను మార్చే ప్రయత్నం పోలీసులు చేశారనే విషయం కూడా కోర్టు దృష్టికి వచ్చింది. అయినా, ప్రాసిక్యూషన్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయలేదు. ఇంత దారుణంగా ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ పని చేసినందున న్యాయస్థానంలో కేసు వీగిపోయింది. నేరస్తులందరూ క్షేమంగా, నిర్దోషులుగా బయటపడ్డారు.
నేర పరిశోధన ఆలస్యం
నిజానికి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మత ఘర్షణల కేసుల్లో నిందితులకు శిక్షలు అతి తక్కువగా పడ్డాయి. గడిచిన ఎనిమిదేళ్ళలో 30 శాతం కేసుల్లో మాత్రమే శిక్ష పడినట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదికల్లో బయటపడింది. ఢిల్లీలో 1944లో సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా అల్లర్లు కేసులోనూ కేవలం విచారణ సంస్థల, దర్యాప్తు సంస్థల ఆలస్యం కారణంగా నిందితులు తెలివిగా తప్పించుకున్నారు. అధికార రాజకీయ పార్టీ ప్రభావం దర్యాప్తు వ్యవస్థలపై ఉండటం వల్లన కేసులు నీరు కారిపోవడానికి, న్యాయస్థానంలో విచారణ ఆలస్యం కావడానికి, బాధితులకు న్యాయం దక్కకపోవడానికి ఆస్కారం ఏర్పడుతోందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే బిల్కిస్ బానో కేసులో శిక్షలు పడ్డ నిందితులను జైల్లో సత్ ప్రవర్తన ఆధారంగా, క్షమాభిక్షతో శిక్షా కాలం తగ్గించి వదిలిపెట్టారు. నిజానికి ప్రభుత్వాధికార సభ్యులు లేదా వారి అనుయాయులు నేరాలకు పాల్పడితే పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తును శాస్త్రీయ పద్ధతిలో జరిపించటం లేదని. అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగా, పోలీసులే సాక్ష్యాధారాలను చెరిపివేసి, కోర్టులలో నేరస్తులకు శిక్ష పడకుండా కాపాడటం చూస్తూంటే, కంచె చేను మేస్తే సామెత గుర్తుకు వస్తుంది. బాధితులకు పోలీసులే న్యాయం చేయకపోతే ఎవరు చేయాలి?
వాకపల్లి కేసూ వీగిపోయింది
అలాగే 2007 ఆగస్టు 7న వాకపల్లి అటవీ ప్రాంతానికి చెందిన 11 మంది ఆదివాసీ మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం చేశారని బాధితులు ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకుండా జాప్యం చేశారు. ఆ ఘటనపై సామాన్య ప్రజలు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేయడంతో ఎట్టకేలకు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆదివాసీలపై కనికరం లేని నాటి ప్రభుత్వం వాకపల్లిలో అత్యాచార సంఘటన జరగలేదని బుకాయించి, కేవలం నక్సలైట్లపై పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు జరపకుండా, పోలీసులను నిలువరించేందుకు, గిరిజన మహిళల చేత తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని పేర్కొంది. కానీ నిజానికి ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధిత మహిళలను వైద్య పరీక్షలకు పంపి, నేర స్థలంలో లభించిన వస్తువులను, వారి దుస్తులను వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే సాక్షాధారాలు లభించేవి. కానీ అలా చేయకుండా తప్పుడు కేసు అంటూ బుకాయించారు.
పై కేసులను పరిశీలిస్తే నేర పరిశోధన చేసే దర్యాప్తు అధికారులు ఉద్దేశపూర్వకంగానే కేసు వీగిపోయే విధంగా నేర పరిశోధన చేశారన్నది కనిపిస్తున్న వాస్తవం. అందుకే ఇలాంటి సున్నితమైన కేసులను స్వతంత్ర ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థతో హైకోర్టు పర్యవేక్షణలో నేర పరిశోధన దర్యాప్తు జరిపిస్తే న్యాయం జరుగుతుంది. నేరస్థులు ఎవరైనా నిష్పాక్షికంగా విచారణ జరిపి చట్టపరంగా శిక్షిస్తే వ్యవస్థల పట్ల ప్రజలలో గౌరవం పెరుగుతుంది. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల చైతన్యం మీదనే ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేస్తాయి. వారు ఐక్యంగా ప్రజాస్వామిక హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలి.
డా. కోలాహలం రామ్ కిషోర్
9849328496
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672