- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తెలంగాణ చైతన్యపు జ్వాల దొడ్డి కొమురయ్య
మన దేశంలో వలసవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు స్వాతంత్రోద్యమ పోరాటం కొనసాగింది. ఇలా ప్రపంచ చరిత్రలో అనేక ఉద్యమాలు జరిగాయి. అలాగే 19వ శతాబ్దంలో ఆధిపత్యానికి, అహంకారానికి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన ‘తెలంగాణ సాయుధ పోరాటం’ మిగతా పోరాటాలకంటే భిన్నమైనది. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. ఈ స్ఫూర్తే నియంత పోకడలను నిలువరించడానికి అవసరమైన భావజాలాన్ని అందించింది. అన్యాయం శృతి మించితే ఆయుధాలను ఎత్తించి, ధిక్కార స్వరాలై నిలదీసేలా చేసింది. నిజాం నిరంకుశ పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకున్న మిలటరీ పాలనకు ఎదురొడ్డి 4000 మంది కార్యకర్తలు అమరులైనారు. ఆ కోవలో అమరుడై, తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమరత్వాన్ని ఇచ్చి స్పూర్తినిచ్చినవారే ‘దొడ్డి కొమురయ్య’.
దోపిడీ, పీడనల విముక్తి కొరకు..
ఒకవైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమ పోరాటం కొనసాగుతుంటే, మరొకవైపు తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందడానికి నిజాం ఆంధ్ర మహాసభ, భిన్న రూపాలలో ప్రజా ఉద్యమాలను లేవనెత్తింది. ఆ కోవకు చెందినదే జనగామ బేతవోలు రైతాంగ పోరాటాలు. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ ప్రోత్సాహంతో, కడివెండి ఆంధ్ర మహాసభ గ్రామ శాఖ నల్లా నర్సింహులు కార్యదర్శిగా ఏర్పడింది. దీనికి ప్రోత్సాహంగా వాలంటీర్ దళం కూడా ఏర్పడింది. ఈ సంఘం భూస్వాములు లేవీ ధాన్యం వసూలు చేసేటప్పుడు పేద, మధ్యతరగతి రైతుల విషయంలో గ్రేడింగ్ పాటించాలని తీర్మానం చేశారు. కానీ కడివెండి విసునూర్ రాంచంద్రారెడ్డి, ఆయన తల్లి జానమ్మ ఈ తీర్మానం పట్టించుకోకుండా దౌర్జన్యంగా ప్రజల నుండి లెవీ ధాన్యం వసూలు చేశారు. ఈ విధానాన్ని ర్యాలీల రూపంలో ప్రతిఘటిస్తున్నారు. దీంతో దీనిపై విచారణ కోసం ఆంధ్ర మహాసభ వాలంటీరును అక్కడికి పంపించింది. కాని అప్పటికే ఆ విషయం తెలుసుకున్న దొర తన గుమాస్తా అయిన మిష్కిన్ అలీ చొరవతో గూండాలను తీసుకొని గ్రామ బురుజులో మకాం వేశారు. రోజువారీ నిరసనలో భాగంగా వందలాది మంది ప్రజలు రైతులు 1946 జూలై 4 సాయంత్రం ఊరేగింపుతో దొడ్డి మల్లయ్య నేతృత్వంలో బయలుదేరారు. దీంతో దొర గుండాలు తమ దగ్గర ఉన్న తుపాకులతో వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దొడ్డి కొమురయ్య కుప్పకూలి వీరమరణం పొందాడు. అతని అన్న మల్లయ్యకు కూడా తుపాకీ గుళ్ళు తగిలాయి. కొమురయ్య బలిదానానికి స్పందించిన వేలాది మంది ప్రజానీకం కదిలి, నిందితుల మీద కేసు పెట్టించగలిగింది. అనంతరం కదిలిన ఆ ప్రజాశక్తి మహత్తర పోరాట రూపాన్ని సంతరించుకొని ధర్మారం, మొండ్రాయి, పాలకుర్తి ప్రాంతాలకు విస్తరించగలిగింది.
మట్టి మనుషులు చేసిన పోరాటం..
కొమురయ్య మరణంతో దొరల ఆరాచాకాలకు వ్యతిరేకంగా ఆయుధం పట్టకతప్పదని కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణ సాయుధ పోరాట నిర్ణయం తీసుకుంది. కష్టాలు, కన్నీళ్లు, వెట్టిచాకిరి, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అవమానాలే ఆ మట్టి మనుషులను తట్టిలేపినాయి. ఆలోచనలే పునాదులు అయ్యాయి.. పనిముట్లే ఆయుధాలయ్యాయి.. గడ్డి కోసిన చేతులే గొడ్డల్లను ఎత్తాయి.. దండం పెట్టిన చేతులే కొడవళ్లను పట్టాయి.. బంఛాన్ దొర కాల్మొక్తా అన్న గొంతులే భూస్వాములు, పటేళ్లు, దొరల అరాచాకలపై గర్జించాయి. సాయుధ పోరాట కేంద్రంగా అనేక మహిళా దళాలు సైతం ఏర్పడ్డాయి. ఈ పోరాటం మహామహులు చేసింది కాదు, మట్టి మనుషులు చేసిన పోరాటం. నిజాం సర్కార్‌ను నేలమట్టం చేసిన చరిత్ర వారి సొంతం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన ప్రతిఘటన అది. బానిసత్వానికి బలైపోయిన వెట్టిజీవుల తిరుగుబాటుకు ప్రతీక. నిజాం ప్రభుత్వంతో పాటు పల్లెల్లో భూస్వాముల అరాచాకలకు వ్యతిరేకంగా సంఘం పెట్టి ప్రజలు వీరోచితంగా పోరాటం నడిపించారు. నైజాం సర్కార్ పాలనను అంతమొందించడానికి తెలంగాణ పల్లెలన్నీ అగ్ని గుండాలై 1946 నుండి 1951 వరకు వీరోచితమైన పోరాటం చేశారు. దున్నేవానికి భూమి దక్కాలనే డిమాండ్‌తో లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచడంతో పాటు, నిజాం నిరంకుశ పాలన అంతమొందడంతో వెట్టి చాకిరి నుండి విముక్తి పొంది, వేలాది గ్రామాలు గ్రామ స్వరాజ్యాలతో విముక్తి చెందినాయి.
దారి చూపిన.. కొమురయ్య స్ఫూర్తి
నిజాం లొంగిపోయాక, భారత సైన్యాలు జనరల్ చౌదరి, వెల్లోడి నేతృత్వంలో తెలంగాణ మట్టి మనుషులపై రక్త దాహనికి ఒడిగట్టారు. సాయుధ పోరాటాన్ని అణిచివేసేందుకు అన్ని పద్దతులను భారత ప్రభుత్వం వినియోగించింది. సాయుధ పోరాటం ద్వారా సాధించుకున్న 10 లక్షల ఎకరాల భూమి, విముక్తి చెందిన 3500 గ్రామాలు తిరిగి యూనియన్ ప్రభుత్వం తమ ఖద్దరు దొరలకు అప్పజెప్పింది. సాయుధ పోరాట విరమణ అనంతరం దొడ్డి కొమురయ్య స్ఫూర్తి స్తబ్దతకు గురి కాలేదు. సీమాంధ్ర ప్రభుత్వంలో అది ముల్కీ రూపంలోనూ, అనంతరం 1969-70లో ప్రారంభమైన నక్సల్బరీ ఉద్యమ రూపంలోకి ప్రవహించింది. ఆ త్యాగాల వెలుగులోనే దేశం మొత్తానికి అవసరమైన భూ సంస్కరణ చట్టాలు రావడానికి భూ పరిమితి చట్టాలు రావడానికి దొడ్డి కొమురయ్య స్ఫూర్తి నక్సల్బరీ రూపంలో ప్రవహించడమే. అలాగే సీమాంధ్ర పాలనకు వ్యతిరేకంగా జరిగిన 1969 ఉద్యమంలోనూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ తెలంగాణ సమాజానికి దొడ్డి కొమురయ్య స్ఫూర్తి దారి దీపమైంది. ఆ క్రమంలోనే సూర్యాపేట, భువనగిరి, వరంగల్ డిక్లరేషన్లు తెలంగాణ సమాజం రూపొందించుకొని ప్రత్యేక తెలంగాణ కై ఉద్యమ బాట పట్టింది. ఈ స్ఫూర్తితో ప్రజలు అనేక సందర్భాలలో పాలకవర్గాలను ప్రతిఘటించి అనేక హక్కులను సాధించుకున్నారు. ప్రధానంగా ఆదివాసి భూ పంపిణీ చట్టాలు, 2013 భూసేకరణ చట్టం, కౌలుదారీ చట్టాలు రావడం వెనకాల దొడ్డి కొమురయ్య త్యాగం ఉంది.
పాలకులు అది గుర్తించాలి!
అయితే, నేటి పాలకులు ఈ త్యాగాలకు విలువనివ్వకుండా తూట్లు పొడిచినారు. ప్రజలకు, రైతులకు భూ పంపిణీ వదిలిపెట్టి కార్పొరేట్లకు వంత పాడుతూ భూమిని వారికి కట్టబెడుతున్నారు. లక్షలాది ఎకరాల భూమిని తన అనుంగు అనుచరులకు ఇవ్వడమే కాక గతంలో భూ పంపిణీ చేసిన భూములను కూడా తిరిగి ధరణి, 111 జీవో పేర్లతో లాక్కుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, కార్పొరేట్ శక్తుల కోసం, వ్యవసాయేతర కార్యక్రమాలకు వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున ఇస్తున్నారు. కానీ తెలంగాణ నేల దిక్కార స్వభావాన్ని గ్రహించని పాలకులకు దొడ్డి కొమురయ్య స్ఫూర్తి దినం ఒక హెచ్చరికను ఒక మెలకువను అందజేస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు చైతన్యవంతమై భీమిరెడ్డి నరసింహారెడ్డి,నల్లా నర్సింహులు,చిట్యాల ఐలమ్మ దొడ్డి నరసయ్య కాళోజీ, దాశరధిల ప్రేరణతో ఉద్యమాన్ని చేపట్టకపోతే యావత్ తెలంగాణను రక్షించుకోలేమని దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో దీనిని గుర్తించాలని సందేశం ఇస్తూనే ఎర్రబాడు దొరలు విసునూరు జనగామ ఆదిపత్య వర్గాలకు పట్టిన గతి ఏంటో గుర్తించకపోతే నేటి పాలకవర్గాలు కూడా అదే గతి ఏదో ఒక రోజు ప్రజా చైతన్యానికి గురికాక తప్పదని గ్రహించాలి.
(నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి)
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192
- Tags
- Doddi Komaraiah