పీడీఎస్‌యూది 50 ఏళ్ళ పోరాట చరిత్ర

by Ravi |   ( Updated:2024-09-29 00:46:10.0  )
పీడీఎస్‌యూది 50 ఏళ్ళ పోరాట చరిత్ర
X

ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి ఉద్యమం 1969 నుండి కొత్త పుంతలు తొక్కింది. నూతన జవసత్వాలు సంతరించుకొని, నిస్తేజమైన వాతావరణాన్ని పటాపంచలు చేసింది. నూతనత్వానికై వెంపర్లాడుతున్న తరుణాన నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాలు వేగుచుక్కలై విద్యార్ధి ఉద్యమాన్ని వెన్ను తట్టి నడిపించాయి. ఆ వరవడిలో నిర్మాణాత్మక రూపాన్ని సంతరించుకొంది ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం (పీడీఎస్‌యూ). ఒక విద్యార్థి సంఘం తన ఉద్యమ చరిత్రను నెమరు వేసుకోవడం, స్ఫూర్తి పొందడం అవసరం, ఆవశ్యకత కూడా.

ఆనాడు, ఈనాడు, ఏనాడైనా మతోన్మాదానికి విచక్షణ వుండదు. పైశాచికత్వం దాని క్రీడ. దౌర్జ న్యం దాని ఊపిరి. దుర్మార్గం దాని విధానం. మూర్ఖత్వం దాని లక్షణం. అది వికృత రూపాలలో అవతరించి సమాజాన్ని విషపూరితం చేస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఇందుకు మినహాయింపుకాదు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని తమ స్థావరంగా చేసుకొని, అరాచక, రౌడీ, సంఘ విద్రోహ, అవినీతికర విధానాలతో విద్యార్థులను బాధించేది. బోగస్‌ అడ్మిషన్లతో, రౌడీలు హాస్టల్స్‌ లో తిష్ట వేసేవారు. విద్యార్థుల కోసం మెస్‌ అధికారులు వండిన మాంసం తదితర ప్రత్యేక భోజ నాలు కూడా విద్యార్థులకు సక్రమంగా అందనివ్వకుండా చేసేది. ఇక విద్యార్థినుల పట్ల అసభ్యంగా, అవమానకరంగా ప్రవర్తించేవారు.

పీడీఎస్‌ పుట్టుక

అదే సమయంలో యూనివర్సిటీ సమస్యలతోపాటు, దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశా లపై నిరంతర చర్చలతో, సమావేశాలతో విప్లవ భావాలు గల విద్యార్థుల బృందం ఎడతెరిపిలేకుండా కృషిచేసింది. ఈ విద్యార్థులంతా సమావేశమై తమ బృందానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థులు (పిడిఎస్‌)గా నామకరణం చేసుకున్నారు. పీడీఎస్‌ అత్యంత మెలకువతో, ఎక్కువ మంది విద్యార్థులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నది. తన బృందాన్ని రాజకీయంగా, భౌతి కంగా సామాజికంగా చైతన్యం చేసింది. ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. అన్యాయాన్ని ఉపేక్షించొద్దనే దృఢమైన సంకల్పాన్ని వారి ముందు ఉంచింది.

ఆ శక్తులన్నీ ఒక్కటై..

క్యాంపస్‌లో ప్రగతిశీల భావాల పుట్టుకను సహజంగా అభివృద్ధి నిరోధక ముఠా సహించలేక పోయింది. గాంధీ మెడికల్‌ కాలేజీ ఎన్నికల సందర్భంగా పీడీఎస్‌ విద్యార్థులపైన ఆర్‌ఎస్‌ఎస్‌ గుండాలు మొదటి దాడిచేశారు. అక్కడే వున్న క్యాంపస్‌ విద్యార్థుల సహాయంతో ఆ దాడిని ప్రతిఘటించారు. 1971 సెప్టెంబర్‌ 5న పీడీయస్‌ విద్యార్థులపైన దాడి చేశారు. దానిని కూడా తిప్పికొట్టారు. పై రెండు దాడుల తరవాత పీడీఎస్‌ విద్యార్థులు మరింత మెలకువలను ప్రదర్శించారు. ఒకవైపు విద్యార్థులతో విస్తృత సంబంధాలు కొనసాగిస్తూనే, మరొకవైపు ఆత్మరక్షణా చర్యలు తీసుకొన్నారు. పీడీఎస్‌ కార్యకర్తలు నిత్యం ఒక బృందంగా తిరగాల్సి వచ్చింది. ఒంటరిగా తిరగడం ప్రమాదకరంగా మారింది. ఆ సమయం లో నాయకత్వం ప్రధానంగా ధైర్య సాహసాలను కార్యకర్తలకు ప్రబోధించింది. ‘‘చేగువేరా’’ విప్లవ సాహస గాధలను బోధించడం గమనార్హమైంది. ఆ తర్వాత 1971 నవంబర్‌ 24వ తేదీన పీడీఎస్‌ కార్యకర్తలపైన మరొకదాడి జరిగింది. మళ్లీ పీడీఎస్‌ విద్యార్థులు తిప్పికొట్టారు. ఈ సారి ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు, పరిపాలకులు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబీవీపీ మతోన్మాద శక్తులు కుమ్మక్కై వర్సిటీలో వేలాది పోలీసులను దింపి విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి, అక్రమ కేసులు బనాయించారు. 11 మంది విద్యార్థు‌లను శాశ్వతంగా బహిష్కరించారు. కానీ విద్యార్థుల నిరసన తీవ్రం కావడంతో విశ్వవిద్యాలయాన్ని నిరవధికంగా మూసివేశారు.

పీడీఎస్‌యూ ప్రథమ రాష్ట్ర మహాసభ

విప్లవ విద్యార్థి సంస్థ పీడీఎస్‌యూకి 2024 అక్టోబర్‌ 12, 13 తేదీల నాటికి 50 సంవత్సరాలు నిండుతున్నది. హైదరాబాద్‌ ఉస్మానియా గడ్డ మీద జార్జి రక్తంతో తడిసిన ఆ బిగిపిడికిలి పతాక జేసీఎస్‌ ప్రసాద్‌, శ్రీపాద శ్రీహరి, చేరాలు, చాంద్‌ పాషా, స్నేహలత రంగవల్లి, రమణయ్య, సాంబయ్య తదితరుల త్యాగాలతో పులకరించింది. తెలంగాణ సాయుధ పోరాట వరవడిలో భారత రాజకీయ రంగానికి ప్రకంపనలు సృష్టించిన నక్సల్బరి, శ్రీకాకుళ, గోదావరి లోయ రైతాంగ పోరాటాలు ప్రజల విముక్తి బాటను గుర్తు చేశాయి. ఫ్రాన్స్‌ విద్యార్థుల పోరాటం, వియత్నం, కంపూచియాలో సాగిన విముక్తి పోరాటంలో విద్యార్థి కెరటాలు చేసిన సాహసాలు లాటిన్‌ అమెరికాలో ఎర్నెస్ట్‌ ‘చేగువేరా’ సాహసోపేత త్యాగం క్యాంపస్‌ విద్యార్థులపై ప్రభావం చూపాయి. ఆ పోరాటాల స్ఫూర్తితో త్యాగాల తెలుగునేల మీద, ఉస్మానియాలో జార్జిరెడ్డి పోరాట బాటను ఎంచుకున్నాడు. క్యాంపస్‌లో విద్యార్థులకు పెద్దన్నగా, కొండంత ధైర్యంగా ఉన్నాడు. ఆయనను మతోన్మాద గుండాలు 1972 ఏప్రిల్‌ 14న అతి కిరాతకంగా కత్తులతో హత్యచేశారు. జె.సి.ఎస్‌. ప్రసాద్‌ ఆ పోరాట వారసత్వాన్ని అందుకున్నాడు. పోరాట ప్రస్థానాన్ని సాగిం చాడు. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మరింతగా నిర్మాణ రూపం తీసుకుని, ఇదే భావాలతో వున్న పీఎస్‌ఎఫ్‌, ఎస్‌.ఎఫ్‌. తదితర పేర్లతో వున్న సంస్థలన్నింటిని కలిపి 1974 అక్టోబర్‌ 12, 13 తేదీ లలో హైదరాబాద్‌లో మొదటి మహాసభ జరిపి పీడీఎస్‌యూ సంస్థను రాష్ట్రవ్యాపితం చేశారు.

పీడీఎస్‌యూకి 50 ఏళ్లు

మొదటి మహాసభ జరిగి ఈ సంవత్సరం అక్టోబర్‌ 12,13 నాటికి 50 ఏండ్లు పూర్తవుతుంది. ఈ 50 ఏండ్లలో పీడీఎస్‌‌యూ రాష్ట్ర వ్యాపితంగా ఎన్నో పోరాటాలకు వేదిక అయింది. విద్యార్థుల సమస్యల నుంచి, అధిక ధరలు, రాజకీయ సమస్యల దాకా, ర్యాగింగ్‌ నుంచి మహిళలు, దళితులు, బలహీనవర్గాలపై జరిగే వివక్షల దాకా ఎన్నో పోరాటాలను స్వంతం చేసుకుని విజయాలు సాధించింది. జార్జి నుంచి ఆరంభించి ఈ 50-52 ఏండ్ల కాలంలో ఎన్నో మెదళ్ళకు చైతన్య బాటలు అందించింది. సామాజిక స్పృహను, ప్రజాస్వామిక విప్లవ చేవను అందిం చింది. 1975 ఎమర్జెన్సీలో నిషేధం ఎదుర్కొన్నది. జంపాల చంద్రశేఖర్‌ ప్రసాద్‌, శ్రీపాద శ్రీహరిని ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపేసినా, చీకటి కాలంలో అజ్ఞాత సూర్యుడిలా వెలుగొందింది. ఎమర్జెన్సీ అనంతరం తిరిగి తెలుగు సీమలో పోరాట పరవళ్ళను సృష్టించింది. ఈ సంస్థ మొదటి సభ జరిగి 50 ఏండ్లు అయిన సందర్భంగా 2024 అక్టోబర్‌ 30 నాడు పీడీఎస్‌‌యూ 50 ఏండ్ల అనుభవాన్ని నెమరువేసుకుందాం. చరిత్ర మనకు అందించే అనుభవ పాఠాల నుంచి నేర్చుకుని, తగిన ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం వుంది. గత అనుభవాలను నెమరువేసుకొని భవిష్యత్‌ ఉద్యమ రూపకల్పన కోసం 2024 సెప్టెంబర్‌ 30న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్‌ ఆడిటోరియంలో నిర్వహించే 50 వసంతాల సభలో పాలుపంచుకుందాం.

(సెప్టెంబర్ 30న ఓయూలో పీడీఎస్‌యూ 50 వసంతాల సభ)

పెద్దింటి రామకృష్ణ,

పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు,

97055 18978

Advertisement

Next Story

Most Viewed