అధికార పార్టీలకు ఎదురు లేకుండా చేస్తున్న విపక్షాలు!కేంద్రంలో, రాష్ట్రంలో అదే జరుగుతుందా?

by Viswanth |   ( Updated:2022-09-03 13:49:41.0  )
అధికార పార్టీలకు ఎదురు లేకుండా చేస్తున్న విపక్షాలు!కేంద్రంలో, రాష్ట్రంలో అదే జరుగుతుందా?
X

జాతీయస్థాయిలో బలమైన ప్రతిపక్షం లేకుండా మోడీ ఎంతగా బలపడ్డారో రాష్ట్రంలో సైతం కేసీఆర్ అదే తీరులో వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయి. ఉమ్మడి ఎజెండా ఉన్నా ఏకం కాలేకపోతున్నాయి. అన్ని ప్రతిపక్షాలూ బీజేపీని వ్యతిరేకించేవే. వాటికి ఉమ్మడి శత్రువే. కానీ ఒక్కటి కావడంలో విఫలమవుతున్నాయి. ఈ వైఫల్యమే బీజేపీకి కలిసొస్తున్నది. అసలైన యుద్ధం 2024 ఎన్నికలే అని చెప్పుకుంటున్నాయి. కానీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలోనే అవి ఐక్యంగా ఉండాలన్న లక్ష్యానికి బీటలు ఏర్పడ్డాయి. యుద్ధం మొదలు కాకముందే కాడి పడేశాయి. ఓటమిపాలై చేతులెత్తేశాయి.

నీ గురించి, నీ శత్రువు గురించి తెలిస్తే ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు.. అది తెలియకపోతే ఏ ఒక్క యుద్ధంలోనూ గెలవలేవు' చైనా దేశానికి చెందిన సైనిక నిపుణుడు సున్ జు రాసిన 'యుద్ధకళ' పుస్తకంలోని వాక్యాలు ఇవి. దీనిని ప్రస్తుత జాతీయ రాజకీయాలకు అన్వయించుకుంటే విపక్షాలు ఎంత ప్లాన్‌లెస్‌గా ఉన్నాయో అర్థమవుతుంది. రానున్న సార్వత్రిక (2024) ఎన్నికలను విపక్ష పార్టీలు అసలైన యుద్ధంగా తలుస్తున్నాయి. బీజేపీయే బలమైన శత్రువు అని అనుకుంటున్నాయి. దాన్ని ఢీకొట్టడానికి విపక్షాలన్నీ ఐక్యంగా ఉండడడం అనివార్యమనే భావిస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావించాయి. కానీ బొక్కబోర్లాపడ్డాయి.

నిజానికి ఐక్యత కోసం విపక్ష పార్టీలు చాలా ప్రయత్నాలే చేశాయి. ముగిసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరుస సమావేశాలు నిర్వహించాయి. కానీ, ఆ ఐక్యత సాధ్యం కాలేదు. అంచనాలు పటాపంచలయ్యాయి. రకరకాల కారణాలతో కొన్ని విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలికాయి. 'మా రాష్ట్రానికి చెందిన వ్యక్తి, మా ఆదివాసీ మహిళ. దేశంలోనే తొలిసారి అవకాశం వచ్చింది' అనే కారణాలతో విపక్షాల గూటి నుంచి అధికార పార్టీ గూటికి వెళ్లిపోయాయి కొన్ని పార్టీలు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కొన్ని ఓటింగుకే దూరంగా ఉండిపోయాయి. సెమీ ఫైనల్స్‌లోనే విభేదాలు, లుకలుకలు పొడసూపాయి. సార్వత్రిక ఎన్నికలనే అసలైన యుద్ధం మొదలు కాకముందే ఓడిపోయాయి.

ఐక్యత సాధ్యమవుతుందా?

మోడీ నేతృత్వంలోని బీజేపీని బలమైన శత్రువుగా విపక్షాలు భావిస్తున్నాయి. అన్నీ ఒక్క తాటి మీదకు వస్తేనే ఓడించడం సాధ్యమనే ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కానీ, అవి ఒక్కటి కావడం ఇక ఎప్పటికీ సాధ్యం కాదని తేలిపోయింది. విపక్ష పార్టీల ఐక్యతలోని ఇబ్బందులే బీజేపీకి బలమైన అస్త్రాలు. ఈ పార్టీలు వాటి మధ్య ఐక్యతనే సాధించలేనప్పుడు ఇక ప్రజలను ఎలా ఏకం చేస్తాయనే మౌలిక ప్రశ్న సహజం. అవన్నీ ఒక్కటవుతాయని భావించడం అత్యాశే. నిజానికి రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే కూటమికి పోటీగా విపక్షాలన్నింటి తరపున అభ్యర్థిని ఎంపిక చేయడానికి భారీ కసరత్తే జరిగింది. మమతాబెనర్జీ, శరద్ పవార్ తదితరులంతా లోతుగా చర్చించారు. అభ్యర్థిని ఖరారు చేశారు.

చివరకు ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారు కావడంతో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య విపక్షాలను నీరుగార్చింది. 'ఆదివాసీ మహిళను అభ్యర్థిగా ప్రకటిస్తారని ముందే తెలిసినట్లయితే మేం పోటీలో ఉండేవాళ్లం కాము' అని మమతా బెనర్జీ కామెంట్ చేయడం కన్‌ఫ్యూజన్‌కు పరాకాష్ఠ. నిజానికి ఎన్డీఏ తన స్వంత బలంతో అభ్యర్థిని గెలిపించుకునే అవకాశాలే లేవు. అనివార్యంగా వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్, జార్ఖండ్ ముక్తిమోర్చా లాంటి పార్టీల మద్దతుతో ఆమె విజయం సునాయాసమైంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు ఓటింగుకు దూరంగా ఉన్నాయి. ఇలాంటి నిర్ణయం ఆ పార్టీల అవివేకానికి, నిస్సహాయతకు నిదర్శనం.

బాధ్యత మరిచిన కాంగ్రెస్

నిజానికి బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ తన బాధ్యత నుంచి తప్పుకున్నది. ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడం మరే పార్టీకంటే దానికే ఎక్కువ అవసరం. దాదాపు 130 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పార్టీ అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆ దిశగా చేసిన కృషి ఏమీ లేదు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి బలమైన కూటమిగా ఒక దగ్గరకు తీసుకురావడంలో విఫలమైంది. వరుస సమావేశాలు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు శరద్‌పవార్ లాంటివారు చొరవ తీసుకోవాల్సి వచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలోనే ఈ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఐక్యత లేకపోవడం రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేదనే ధీమా ఏర్పడడానికి కారణమైంది.

నిజానికి అనేక ప్రాంతీయ పార్టీలు బీజేపీతో విభేదిస్తున్నాయి. అసంతృప్తితో ఉన్నాయి. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మోకరిల్లితే తప్ప నిధులు రావనే అభిప్రాయంతో ఉన్నాయి. దారిలో పెట్టుకోడానికి జాతీయ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని, బెదిరించి లొంగదీసుకుంటున్నదని, వేధింపులకు గురిచేస్తున్నదని, ఇవి పలు సందర్భాలలో ఆ పార్టీలు వ్యక్తం చేసినవే. ఈ ధోరణులకు వ్యతిరేకంగా ఒకే గూటి కిందకు చేరాల్సిన ఈ పార్టీలు స్వంత అవసరాలు, స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ పంచన చేరుతున్నాయి. కీలెరిగి వాత పెట్టడంలో ప్రావీణ్యత సాధించిన బీజేపీకి దర్యాప్తు సంస్థలే అన్నింటికంటే పెద్ద అస్త్రాలు.

నీరుగార్చిన మమత వ్యాఖ్యలు

ఇప్పుడు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఆ పార్టీలు ప్రదర్శించిన వైఖరే సార్వత్రిక ఎన్నికలలోనూ బీజేపీకి కలిసొస్తాయన్న వాదన లేకపోలేదు. నిన్నటిదాకా మోడీపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన సందర్భంగా మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాలపై స్పష్టత ఏర్పడింది. జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరేన్‌పై మైనింగ్ అక్రమాల ఆరోపణలు రావడంతో రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థికి అనుకూలంగా ఉండడంతో తాత్కాలికంగా రిలీఫ్ వచ్చింది. ఏపీ సీఎంగా జగన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మోడీకి అనుకూలంగానే ఉన్నారు. రాష్ట్ర అవసరాల కోసం నవీన్ పట్నాయక్ అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న ప్రాక్టీసే.

ప్రాంతీయ పార్టీలను ఒక్కటి చేయడానికి గతంలో ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. సక్సెస్ అయ్యారు. అది కొంతకాలానికే పరిమితమైంది. మోడీ ప్రధాని అయిన తర్వాత విపక్ష పార్టీలు గతంలో ఎన్నడూ లేనంతగా చెల్లాచెదురయ్యాయి. తగిన ప్రాభవాన్ని కోల్పోయాయి. బలహీనమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. జి-23 సంక్షోభంతో స్వంత పార్టీని చక్కదిద్దుకోవడమే గగనమైపోయింది. విపక్షాలను ఏకం చేస్తుందనే భ్రమలేమీ లేవు. తాజాగా నేషనల్ హెరాల్డ్ సంస్థపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుతో కకావికలమవుతున్నది.

బెడిసికొట్టిన విధానాలు

బీజేపీతో దాదాపు ఏడేళ్లకు పైగా టీఆర్ఎస్ స్నేహ సంబంధాలనే కొనసాగించింది. గతేడాది హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో బీజేపీ గెలుపు టీఆర్ఎస్‌కు మింగుడు పడలేదు. ఆ పార్టీ పట్ల వైఖరి మార్పుకు కారణమైంది. ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పులా మారాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మొదలైంది. కానీ, లోక్‌సభ ఎన్నికలలో 'సారు- కారు- పదహారు' స్లోగన్ బెడిసికొట్టి తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. ఊహకు అందని విధంగా నాలుగు స్థానాలలో బీజేపీ గెలుపొందింది. దీంతో ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను పక్కన పెట్టారు. ఇప్పుడు 'ప్రత్యామ్నాయ ఎజెండా' పేరుతో కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మమతా బెనర్జీ, దేవెగౌడ, హేమంత్ సోరేన్, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, స్టాలిన్.. ఇలా పలు ప్రాంతీయ పార్టీల నేతలతో మంతనాలను మొదలుపెట్టారు. జాతీయ పార్టీ ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాజ్యాంగాన్ని సవరించడం మొదలు 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో సాధించాల్సిన ప్రగతి సాధ్యం కాలేదంటూ సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్.. ఇలా ఒక్కో అంశాన్ని వారితో చర్చించారు. ఆ ప్రయత్నాల ఫలితాలు ఎలా ఉన్నా ఇప్పటికీ గాడిన పడలేదు. దాదాపు ఏడాది కాలంగా ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఫేస్ టు ఫేస్ మీటింగ్ సాకారం కాలేదు. చివరకు నీతి ఆయోగ్ లాంటి సమావేశాలను బహిష్కరించక తప్పలేదు.

అదే ఆయనకు బలం

జాతీయస్థాయిలో బలమైన ప్రతిపక్షం లేకుండా మోడీ ఎంతగా బలపడ్డారో రాష్ట్రంలో సైతం కేసీఆర్ అదే తీరులో వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయి. ఉమ్మడి ఎజెండా ఉన్నా ఏకం కాలేకపోతున్నాయి. అన్ని ప్రతిపక్షాలూ బీజేపీని వ్యతిరేకించేవే. వాటికి ఉమ్మడి శత్రువే. కానీ ఒక్కటి కావడంలో విఫలమవుతున్నాయి. ఈ వైఫల్యమే బీజేపీకి కలిసొస్తున్నది. అసలైన యుద్ధం 2024 ఎన్నికలే అని చెప్పుకుంటున్నాయి. కానీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలోనే అవి ఐక్యంగా ఉండాలన్న లక్ష్యానికి బీటలు ఏర్పడ్డాయి. యుద్ధం మొదలు కాకముందే కాడి పడేశాయి. ఓటమిపాలై చేతులెత్తేశాయి.

కె.విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story

Most Viewed