జమిలి ఎన్నికలు అనివార్యమే!

by Ravi |   ( Updated:2023-09-03 00:15:36.0  )
జమిలి ఎన్నికలు అనివార్యమే!
X

ప్రస్తుతం దేశంలో నడుస్తున్న చర్చ ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’. కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఒకే దేశం ఒకే ఎన్నికపై ఏర్పాటు చేసింది. త్వరలో సభ్యుల నియామకం చేపడతారని తెలపడంతో దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? అనే సందేహాలు ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో కలుగుతున్నాయి. అయితే ఈ జమిలి ఎన్నికల చర్చ దేశంలో కొత్తేమి కాదు. గతంలో కూడా దీనిపై పలు చర్చలు జరిగాయి. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరపడం కోసం ఈ కమిటీని వేశారా? అప్పట్లోగా ఈ కమిటీ ఎలాంటి సిఫారసులు చేస్తుంది?. దీనిపై పలు జాతీయ ప్రాంతీయ పార్టీలు ఎలా స్పందిస్తాయి? అదే విధంగా ఒకేసారి దేశం మొత్తం ఎన్నికలు జరపడం సాధ్యమేనా? అనేటువంటి పలు ప్రశ్నలు లేవనెత్తుతున్న సందర్భంలో దీనిపై అందరికీ పలు అనుమానాలు వస్తున్నాయి. గతంలో లా కమిషన్, పార్లమెంట్ స్థాయి సంఘం జమిలి ఎన్నికలకు మద్దతుగా నివేదికలు ఇచ్చినప్పటికీ ఇందులో అధిగమించాల్సినటువంటి రాజకీయ, రాజ్యాంగ, ఆర్థిక, చట్టపరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం.

ప్రపంచంలో అతిపెద్ద జనాభా గల దేశంగా భారత్‌కి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం ఒక పెద్ద సవాలుగానే చెప్పవచ్చు, కానీ జమిలి ఎన్నికల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల ఓటర్లు ఒకే రోజు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పాల్గొనడానికి వీలవుతుంది. అదే విధంగా దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే ఇందులో పలు అడ్డంకులు కూడా ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాలి. వారి అంగీకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగ సవరణకు పార్లమెంటు తగిన మెజారిటీతో ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదిస్తూ తీర్మానించాలి.

జమిలి ఎన్నికలతో.. ఎవరికి మేలు

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల కొంతకాలం మాత్రమే ఎన్నికల కోడ్ ఉంటుంది. దీని వల్ల సంక్షేమ పథకాలు అమలుకు గాని పలు ప్రభుత్వ నిర్ణయాలకు గానీ ఆటంకం ఉండదు. ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానం వల్ల ఎప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల రాజకీయ పార్టీలు నిరంతర ప్రచార కార్యక్రమాల్లో మునిగి ఉంటాయి. అందువల్ల రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజాకర్షణ విధానాలకే మొగ్గు చూపుడం వల్లే ప్రజలకు దీర్ఘకాలికంలో మేలు చేసేటువంటి పలు సంస్కరణలు, విధానాల జోలికి వెళ్లకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయనే వాదన ఉంది. ఎప్పుడూ ఎన్నికలు జరగడం వల్ల కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలోనే పలు వాగ్దానాలు ఉచిత హామీలు ఇస్తూ, ఓటు బ్యాంకులను తమ వైపుకు మలుచుకునేటువంటి పద్ధతి కొనసాగిస్తున్నాయి. ఈ జమిలి ఎన్నికల విధానంలో ఇలాంటి అంశాలకు అడ్డుకట్ట వేయొచ్చు. అయితే ఇంత పెద్ద జనాభా ఉన్న భారతదేశానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం పెద్ద సమస్య కాదనే చెప్పాలి, నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, చట్టపరమైనటువంటి వ్యవస్థ, అన్ని రాజకీయ పార్టీలను ఒకే తాటిపై తీసుకొచ్చే విధంగా రాజ్యాంగ సవరణలు చేసి కట్టుదిట్టంగా చేస్తే జమిలి ఎన్నికలు విజయవంతం అవ్వచ్చు. ఈ జమిలి ఎన్నికల వల్ల సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది, ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. మానవ వనరులు అత్యధికంగా ఉన్న భారత్... ఈవీఎంలు, వివి ప్యాడ్ యంత్రాలు, కేంద్ర బలగాల కంపెనీలు, పర్యవేక్షణ సిబ్బంది వంటి లాజిక్ స్టిక్ సమస్యలను కూడా అధిగమించవచ్చు.

ప్రలోభాలకు అడ్డుకట్ట తప్పదు

లోక్ సభకు, అసెంబ్లీ ఎన్నికలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహిస్తున్న ప్రస్తుత ఎన్నికల విధానం వల్ల దేశంలో విపరీతమైన ఖర్చు పెరుగుతోంది. ఈ ఎన్నికల కోసం పలు రాజకీయ పార్టీలు ఖర్చు చేస్తున్న ఖర్చుకు కూడా అడ్డు అదుపు లేకుండా పోతోంది. జమిలి ఎన్నికలు జరపడం వల్ల దేశంలో ఒకేసారి ఎన్నికల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పలు కానుకలు విపరీతమైనటువంటి డబ్బు ప్రవాహం, మద్యం లాంటి ఇతర ప్రభావిత అంశాలను కొంతవరకు కట్టడి చేయవచ్చు. నిర్దిష్ట సమయంలో జరగాల్సినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు ఇష్టానుసారం మధ్యలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే విధానాలకు కూడా స్వస్తి చెప్పవచ్చు. ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల జాతీయ అంశాలు, సమస్యలు తెరపైకి వచ్చి ప్రాంతీయ అంశాలు సమస్యలు ఎన్నికల ప్రణాళికలు మరుగున పడతాయని ఒక చర్చ కూడా జరుగుతోంది. దీనివల్ల కేంద్రంలోని అధికార పార్టీ ఎక్కువ లాభం పొందుతుందని పలు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు బలంగా జమిలి ఎన్నికలను విభేదిస్తున్నాయని ఒక పెద్ద వాదన ఉంది. భారత్ లాంటి భిన్నత్వంలో ఏకత్వం తో కూడిన దేశంలో అనేక రాజకీయ, ఆర్థిక, ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నాయి వాటిని అధిగమించి జమిలి ఎన్నికలు నిర్వహించడం కూడా ఒక సవాలుగా పేర్కొనవచ్చు.

జాతీయ పార్టీలుగా ప్రాంతీయ పార్టీలు

జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందని ఒక చర్చ జరుగుతోంది. అయితే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు వేరువేరు సమయంలో జరగడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలు సాధించినటువంటి ఓట్ల శాతంకి, లోక్ సభ ఓట్ల శాతానికి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి, అంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మధ్య జరిగే కాలంలో ఓటరు ఆలోచన విధానం మారుతోంది. దానివల్ల అసెంబ్లీ, లోక్ సభలకు గెలిచే అభ్యర్థుల సంఖ్య మారుతూ వస్తుంది. నేడు కొన్ని జాతీయ పార్టీలు కూడా జాతీయస్థాయిని కోల్పోయాయి. అదేవిధంగా ఆమ్ ఆద్మీ వంటి రాష్ట్రస్థాయి పార్టీలు జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నాయి. దక్షిణాది నుంచి భారత రాష్ట్ర సమితి కూడా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలలో విస్తరించాలని ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి దేశం మొత్తం విస్తరించాలనే దృక్పథంతో పనిచేస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు భవిష్యత్తులో జాతీయ పార్టీలుగా మారే ఆస్కారం ఉన్నప్పుడు ఈ జమిలి ఎన్నికలు వారి గెలుపోటమును నిర్ణయిస్తాయని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వారి వారి రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయతత్వం, స్థానికత బలంగా ఉన్నప్పుడు ఈ జమిలి ఎన్నికలు వారి గెలుపోటములను నిర్ణయించకపోవచ్చు. కాబట్టీ జమిలి ఎన్నికలకు భయపడాల్సిన అవసరం లేదు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను, సున్నితంగా నిర్వహించే విధానం, ప్రజలకు ఈ ఎన్నికల ఉపయోగాన్ని మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. జమిలి ఎన్నికల వల్ల జాతీయ పార్టీలు ఎక్కువ లాభం పొందుతాయని చర్చ కూడా నడుస్తుంది కానీ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా మారుతున్న ఈ సందర్భంలో ఈ విధానం ఎంతవరకు ప్రభావం చూపెడుతుందో త్వరలోనే తెలుస్తుంది.

డా. కందగట్ల శ్రవణ్ కుమార్

86393 74879

Advertisement

Next Story