కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు చేయండి!

by Ravi |
కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు చేయండి!
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులాలు, తమ అస్తిత్వ పోరాటాలను కూడా పక్కనపెట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో మెజారిటీగా ఉన్న బీసీ కులాలు తెలంగాణ వస్తే తమ ఆకాంక్షలు నెరవేరి, సమాన గౌరవంతో జీవించవచ్చనుకున్నారు. కానీ తెలంగాణ వచ్చి దశాబ్దం దాటిన తర్వాత కూడా స్వరాష్ట్రంలో ఉన్న బీసీ కులాలు, ఎంబీసీలు, సంచార జాతుల వారి జీవితాల్లో ఏమాత్రం వెలుగులు చూడలేకపోతున్నాం.

బీసీ కులాలకు అన్ని కులాలతో పాటుగా సమాన భాగస్వామ్యం లభిస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక స్వావలంబన లభిస్తుందని తమ ఉన్నత విద్య, ఉద్యోగం, సామాజిక హక్కులకు పూర్తి స్థాయి భరోసా, రక్షణ ఉంటుందనుకున్న బీసీ కులాలకు అదీ నుంచీ అవమానాలు వివక్షలే కొనసాగుతున్నాయి. కొన్ని సంక్షేమ పథకాలు, విద్య, ఉద్యోగాలలో బొటాబొటి రిజర్వేషన్లు, కొందరు బీసీ నేతలకు అప్రధానమైన మంత్రులకు కేటాయించటం లాంటి చర్యలు బీసీల వెనుకబాటుతనాన్ని, సమస్యలను ఏమాత్రం పరిష్కరించలేక పోతున్నాయి. అయితే తెలంగాణలో కులగణన లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారనే కథనాలు చూసి పత్రికలో బీసీ వర్గాలు అగ్గి గుగ్గిలమైపోతున్నాయి.

బీసీ డిక్లరేషన్‌లో చెప్పిందేమిటి?

కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42%కి పెంపు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి, ఏడాదికి రూ.20,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చింది. ఇంకా ఎన్నో పథకాలను బీసీలకు ఇచ్చి అమలు చేస్తానని చెప్పింది. కుల గణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని రాహుల్ గాంధీ మొదలు రేవంత్ వరకు మాట ఇచ్చిన విషయం మర్చిపోవద్దు.. కాంగ్రెస్ మాట ఇస్తే మోసం చేయదనే నమ్మకంతో సబ్బండ బీసీ వర్గాలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాయి.

కేసీఆర్ చేసిన మోసం ఇంతనా..?

బీసీ గణన, రాజ్యాంగ సవరణలు గురించి ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం చేసిందోమిటో చెప్పగలరా? బీసీల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన తన కుటుంబానికి సామాజిక న్యాయం చేశారే తప్ప బీసీలకు చేసిందేమీ లేదు.. దాదాపు 34 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉంటే కేసీఆర్ దాదాపు 10 శాతం రిజర్వేషన్ తగ్గించి 24 శాతానికి కుదించారు. బీసీలు తెలంగాణలో సర్పంచ్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కాకుండా రాజకీయంగా అడ్డుపడ్డారు. అనేకమందికి కార్పొరేషన్ చైర్మన్, పాలక మండళ్లు సృష్టించి ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ ఫెడరేషన్లకు గానీ, శాసనమండలిలో కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కార్పొరేషన్ పదవులు 36 లో కేవలం 3, ఎమ్మెల్సీలకు సంబంధించి 40లో 4 మాత్రమే బీసీ వర్గాలకు ఇచ్చారు. 56 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు మంత్రి మండలిలో ముగ్గురు మంత్రులు. ఎమ్మెల్యే సీట్లలో కూడా బీసీ అభ్యర్థులకు సరైన వాటా ఇవ్వలేదు.

కేసీఆర్ పాలనలో చేనేత, కల్లు గీత, కమ్మరి కుమ్మరి వడ్రంగి వంటి అనేక కులవృత్తులు నిర్వీర్యం అయ్యాయి. ఆనాడు ఎంతో అట్టహాసంగా కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది? ఆ సర్వే ఫలితాలను ఎందుకు బయటపెట్టలేదు. ఆ వివరాలన్నీ బయటకు వస్తే బీసీలకు పదవులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే తొక్కి పెట్టారనే అపవాదును మూట కట్టుకున్నారు. సరికదా బీసీ కులాలకి తీరని అన్యాయం చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై బీసీలు ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు. ఎన్నో ఆశలతో రేవంత్ రెడ్డికి పట్టం కట్టిన తెలంగాణ బీసీలు మాత్రం గతంలో కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదాన్ని పునరావృతం చేయవద్దని మాత్రం బలంగా కోరుకుంటున్నారు.

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు

బీసీ జనాభా లెక్కలు తీయాలి, జనాభా ఆధారంగా రాజ్యాంగ బద్దమైన రిజర్వేషన్లు మాత్రమే బీసీ కులాలకు సరియైన న్యాయం చేయగలవు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలుపరచాలి, కేవలం ఓట్ల కోసం మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే శిలాశాసనమేనని రుణమాఫీ సందర్భంగా చెప్పిన ముఖ్యమంత్రి... కామారెడ్డి బిసి డిక్లరేషన్‌ను సైతం అమలు చేయాల్సిందే. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన రూ.9,200 కోట్లకు బదులుగా 20 వేల కోట్లు కేటాయించడం, కులగణన జరిగిన తర్వాతనే సంస్థలకు ఎన్నికలు నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోయే అవకాశాన్ని వదులుకోవద్దని సమస్త బీసీ కులాలు డిమాండ్ చేస్తున్నాయి.

డా. బి. కేశవులు నేత. ఎండీ.

ఛైర్మెన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Advertisement

Next Story

Most Viewed