కుల గణన కాదు... అక్రమ చొరవాటుదారుల లెక్కలు తేల్చాలి

by Ravi |   ( Updated:2024-11-07 01:16:13.0  )
కుల గణన కాదు... అక్రమ చొరవాటుదారుల లెక్కలు తేల్చాలి
X

ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో సిద్ధాంతపరమైన రాజకీయాలు నడుస్తాయి. ఇస్లాం ప్రధాన మతంగా ఉన్న దేశాలలో ఇస్లామిక్ రాజకీయాలు నడుస్తాయి. ఇక కమ్యూనిజం కొనసాగించే దేశాల్లో ఏక పార్టీ నియంతృత్వ విధానం అమలవుతుంది. అయితే, భారతదేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా కుల రాజకీయాల కంపు కొనసాగుతుంది.

దేశంలో ఏ కులం వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో.. ఆ కులం వారిలో ఉండే ఆర్థిక , రాజకీయ, సంఘటిత ప్రభావం ఏమిటి కులాల మధ్య ఎటువంటి వైశ్యామ్యాలు సృష్టిస్తే, తమ రాజకీయ భవిష్యత్తుకు పునాది ఏర్పడుతుందని తలపోసే రాజకీయ నాయకులు భారతదేశ రాజకీయాలను శాసిస్తున్నారు.

కులమే ఇప్పుడు రాజకీయాస్త్రం..!

స్వాతంత్రానంతరం దాదాపు 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇంతకాలం ఆ పార్టీ మైనార్టీ మత రాజకీయాలను బాగా ఎగదోసి, మైనారిటీల్లో అభివృద్ధి కోణాన్ని చూడకుండా, మత అవలక్షణాలను వారిలో చెప్పించి, వారు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేటట్టు చేసి, తన రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ముస్లిం స్త్రీల హక్కులను కాలరాస్తూ, షాబాన్ తీర్పును రద్దు చేస్తూ, ముస్లిం పురుషుల దురహంకారానికి సోపా నాలు ఏర్పాటు చేసింది. తన రాజకీయ అజెం డాలో భాగంగానే, బంగ్లాదేశ్, బర్మాల నుండి ముస్లిం చొరబాటుదారులను ప్రోత్సహించి, వారికి రేషన్ కార్డులు ఇప్పించి, ఓటర్లుగా నమోదు చే యించి, భారతీయ పౌరులుగా మార్చడంలో ఆ పార్టీ చేసిన కృషి అంతా ఇంత కాదు. ఆ పార్టీ చేసిన పాపంలో ఈ దేశ కమ్యూనిస్టులు సగభాగం పంచుకోవాల్సిందే! పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్ఆర్‌సీ అమలును ఈ పార్టీలు అడ్డుకోవడం వెనుక ఉన్న రహస్యం ఇదే! అక్రమ చొరబాటు దారులైన ముస్లింలను ఈ దేశ పౌరులుగా మార్చిన తంతు బయటపడితే, దేశ ప్రజలకు ఆ పార్టీల దేశద్రోహ రాజకీయాలు తెలిసిపోతుందని ఈ రెండు పార్టీలు బాగా భయపడుతున్నాయి. దేశ విశాల ప్రయోజనాలకు ఉపయోగపడే నిర్ణయాలు మోడీ ప్రభుత్వం తీసుకోవడం ఈ పార్టీలకు సుతరామూ ఇష్టం ఉండదు.

ఇందిర వ్యాఖ్యలు మర్చిపోయారా?

వాస్తవంగా హిందూ సమాజం మతపరమైన సమాజం కాదు. ఈ సమాజంలో కుల వైషమ్యాలు గడ్డకట్టుకుని ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి, హిందుత్వ ఆలోచనలతో అధికారంలోకి రావడం ఆషామాషీ విషయం కాదు. అయినప్పటికీ మూడోసా రి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో దిక్కుతోచని కాంగ్రెస్ పార్టీ హిందూ సమా జాన్ని బలహీనపరిచి, కులాల వారిగా విడగొడితే, బీజేపీని అధికారానికి దూరంగా ఉంచగలమనే దురాలోచన చేసింది. ఈ దురాలోచనల్లో భాగమే కుల గణన. 2004, 2009 ఎన్నికల్లో మిత్రపక్షాల సహాయంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఈ పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కుల గణన ఎందుకు చేయలేదు? కుల గణన పై ఆగస్టు 15, 1982న మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మాట్లాడుతూ కుల గణన దేశాన్ని బలహీన పరుస్తుందని, దేశంలో ఐకమత్యం దెబ్బతింటుందని ఆమె అన్న వ్యాఖ్యలు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఈ విషయంపై సామాన్య ప్రజలు ప్రశ్నలు వేస్తే కాంగ్రెస్ నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు?

కులాలను ఎందుకు లాగాలి?

ప్రతీ గ్రామానికి ప్రభుత్వం తరఫున ఉద్యోగులు ఉన్నారు. ఆ గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో అనే విషయం వారికి బాగా తెలుసు. ప్రభుత్వ పథకాలను అందించడంలో రాజకీయ నాయకుల జోక్యం లేకపోతే అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు సక్రమమైన రీతిలో అందుతాయి. ఈ విషయంలో కులాలను ఎందుకు లాగాలి? కుల రహిత సమాజం కావా లని, కులాలు పోవాలని, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే స్వయం ప్రకటిత మేధావులు కులాల వారీగా సమాజాన్ని విడగొట్టే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం క్షమార్హం కాదు. దేశంలో రెండు కోట్ల మంది అక్రమ చొరబాటుదారులు ఉన్నట్లు ప్రభుత్వ నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరు దేశం లో శాంతి భద్రతల సమస్యలకు సవాల్‌గా మారా రు. వీరి చర్యల వల్ల అక్కడక్కడ హింస దౌర్జన్యాలు చెలరేగుతున్నాయి. వీరు ఎక్కడెక్కడ ఎలా తలదాచుకుంటున్నారో, వారికి సహాయ సహకారాలు అందించే సంస్థల వివరాలు కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలి. ప్రభుత్వం చేయవలసిన తక్షణ కర్తవ్యం ఇదే. ప్రజలను కులాల వారీగా విభజించడం కాదు.

ఉల్లి బాలరంగయ్య

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Advertisement

Next Story