మాటల్లో తెలుగు.. బడ్జెట్‌లో నిల్లు!

by Ravi |   ( Updated:2025-02-02 01:00:31.0  )
మాటల్లో తెలుగు.. బడ్జెట్‌లో నిల్లు!
X

గతంలో మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉండేది. కానీ గతం వేరు.. వర్తమానం వేరు. ప్రస్తుతం చంద్రబాబు, నితీష్ కుమార్‌ల మద్దతుతో మోడీ ప్రభుత్వం కేంద్రంలో పాలన సాగిస్తున్న దృష్ట్యా, అందులోనూ చంద్రబాబు మద్దతు కీలకంగా మారిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు మోడీ వరాల జల్లు కురిపిస్తారని ఆశించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కేంద్ర బడ్జెట్ ఆశాభంగం కలిగించింది. ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదు. రాష్ట్రానికి సంబంధించిన ప్రధానాంశాలను సైతం బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించలేదు. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు వంటి కీలకమైన విషయాల్లో ఇటీవల కొంత ఉదారంగా వ్యవహరించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల అదే వైఖరితో వ్యవహరిస్తుందని ఆశపడ్డ వారికి ఈ పరిణామం నిరాశను మిగిల్చింది. ఈ ఏడాది బిహార్ రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నితీష్ కుమార్‌ను సంతృప్తి పరచడానికి బిహార్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది.

అయితే, కేంద్ర ప్రభుత్వం నుండి నిలకడ లేని నితీష్ కుమార్ పార్టీ ఎప్పుడైనా వైదొలగవచ్చు. అయితే నితీష్ నాయకత్వంలోని జేడీయూ కేంద్రానికి తన మద్దతు ఉపసంహరించుకున్నా మోడీ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం మద్ధతు ఉపసంహరించుకుంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదముంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే కొన్ని నిధులను మంజూరు చేసింది. కానీ అవి కేవలం అప్పుల రూపంలో సహాయపడింది. కేంద్రం వాస్తవంగా ఆంధ్రప్రదేశ్‌కు చేసిందేమీ లేదు. విశాఖ ఉక్కుకు ఇటీవల 11,440 కోట్ల రివైవల్ ఫండ్ కేటాయించడం, కొన్ని రహదారుల నిర్మాణానికి చేయూత నివ్వడం తప్ప, అప్పుల ఊబిలో కూరుకుపోయి, వడ్డీలు చెల్లించడానికి కూడా రాష్ట్ర ఆదాయం సరిపోని పరిస్థితుల్లో ఎన్నికల వాగ్దానాలు కూడా అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఈ బడ్జెట్‌లో రిక్త హస్తాలనే చూపించింది.

ఉమ్మడి రాష్ట్ర విభజనతో, అప్పులతో, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా కానీ, ఆర్థిక ప్యాకేజీ గానీ ప్రకటించకపోవడం విచారకరం. టీడీపీ మద్ధతుతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నా, రాష్ట్రానికి ఆశించినంత ప్రయోజనం లేకపోగా, తెలుగు కవి గురజాడ పద్యాన్ని ఉటంకిస్తూనే తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపడం బాధాకరం. ఒకవైపు కరువుసీమ రాయలసీమలోని జిల్లాలు, మరోవైపు వెనుకబడ్డ ఉత్తరాంధ్రలోని జిల్లాలకు ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. రైల్వేజోన్ అంశం ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతికి షరతులు లేని ఆర్థిక సహాయం గ్రాంటు రూపంలో అందించాలి. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. విశాఖ ఉక్కుకు స్వంత గనులను కేటాయించి, ప్రైవేటీకరణకు స్వస్తి పలకాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిర్మాణాత్మక వైఖరి ప్రదర్శించాలి.

సుంకవల్లి సత్తిరాజు

97049 03463



Next Story

Most Viewed