మోడీపై వ్యతిరేక ప్రచారం నెగ్గినప్పటికీ..

by Ravi |   ( Updated:2024-06-07 01:15:42.0  )
మోడీపై వ్యతిరేక ప్రచారం నెగ్గినప్పటికీ..
X

గల్లీలో ఎవరు ఉన్నా ఢిల్లీలో మోడీ ఉండాలి. అన్న నినాదాన్ని కొన్ని రాష్ట్రాల ప్రజలు బలపరిచినా, పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ వాదమే గెలిచింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో బీజేపీకి ఆశించినన్ని సీట్లు రాలేదు. ఓటింగ్ శాతం పెరిగి ఉంటే ఇక బీజేపీకి మరికొన్ని సీట్లు వచ్చేవి. ఏది ఏమైనా మూడోసారి గెలవడం అంటే ఆషామాషీ కాదు. ఇక పది ఏండ్ల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. బీజేపీ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది. మోడీ ప్రపంచాన్ని గెలిచారు కానీ సొంత దేశస్థులు అనుకున్నంత ఆదరణ ఇవ్వలేదు.

ఎన్నికల ఓటింగ్ తర్వాత ఫలితాలు చూస్తే యేతా వాతా తేలింది ఏమిటంటే.. ఓటర్లు తమకు చేయి తడిపితేనే ఓటు అన్న ధోరణిలో ఇంట్లో కూర్చొని ఓటేయడానికి రాలేదు. విద్యావంతులు అనుకునే మూర్ఖ మేధావులు మాకు వచ్చేదేముందిలే అని విహార యాత్రలకు వెళ్లారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సీట్లు గెలవాలనే లక్ష్యంతో వీలైనన్ని ఉచిత పథకాలు, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక కార్యక్రమాలు ముందుకు తెచ్చి ఓటర్లను వశపరచుకోవడంలో, కొన్ని అధిక సీట్లు గెలవడంలో కొంత మేర సఫలీకృతురాలైంది.

ప్రపంచమే పొగడుతున్నా...

ఉత్తరప్రదేశ్ ఫలితాలు చూస్తే ఎన్ని పథకాలు పెట్టినా, వాటిని అనుభవించినా జనాలు పాలకపక్షానికి ఓటు వేయలేదు. రామ మందిర నిర్మాణం ఓట్లు రాల్చలేదు. మోడీ ప్రభంజనం ప్రపంచం అంతా విస్తరించినా, ఎన్ని దేశాలు కీర్తిస్తున్నా భారతీయులు మాత్రం మోడీ కృషిని, పట్టుదలను, అంకిత భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు.. రాహుల్ గాంధీ రాజకీయ ఎత్తుగడలు ప్రజలను బోల్తా పడేలా చేశాయి. ప్రధాన మంత్రి అభ్యర్థి కూడా ఎవరో నిర్ధారించుకోలేని ఇండియా కూటమి ఎలాగైనా గెలవాలి, దేశం ఏమైనా పర్లేదు అన్న ధోరణిలో అడ్డమైన ఉచిత పథకాలు, హామీలతో ప్రజలను మభ్యపెట్టి విజయం సాధించారు. వస్తున్న ఫలితాలను బట్టే మోడీకి అత్తెసరు మెజార్టీ వస్తుందని తెలిసి కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్, చంద్రబాబుతో మంతనాలు చేయడానికి అలాగే మమత బెనర్జీ, నితీష్ కుమార్‌ను కలవడానికి ప్రయత్నించారు.

తెలుగు ప్రజల పరిణితి

అదే సమయంలో తెలుగు ప్రజలు ఒకింత పరిణతి చూపించారని చెప్పుకోవచ్చు. ఉచిత పథకాలకు మోసపోలేదు. అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో వాడిగా వేడిగా ఉన్న కాంగ్రెస్‌కి 8 సీట్లు రావడం ఆశ్చర్యం కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడామో ఆత్మ విమర్శ చేసుకోకుండా బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా మద గర్వంతో ఉండటంతో ప్రజలు తిరస్కరించారు. తమిళనాడులో తప్పక గెలుస్తారనుకున్న అన్నామలై ఓటమితో తమిళ ప్రజల ప్రాంతీయ తత్వం మరోసారి రుజువు అయ్యింది. వారికి దేశం కన్న పథకాలు ముఖ్యం అని తేల్చారు.

వ్యతిరేక ప్రచారం నెగ్గింది

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ చివరి నిమిషంలో చేసిన వ్యతిరేక ప్రచారం పని చేసింది. అబద్ధం మళ్లీ మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారు అన్న కాంగ్రెస్ స్ట్రాటజీ నిజమైంది. మోడీ ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టిందో, దేశాన్ని ఎంత వేగంగా అభివృద్ధి చేసిందో అందరికీ తెలుసు, కానీ ఆర్టికల్ 356 రద్దు, దేశ భద్రత, రామ మందిర్ ఓట్లు రాల్చలేక పోయాయి. మోడీ గ్యారంటీ అన్న నినాదం కన్న కాంగ్రెస్ ఉచితాలు, తాయిలాలు ప్రజలను ఆకర్షించాయి.

సంక్షేమ పథకాలే గెలిచాయా?

రాజకీయ పార్టీలు ఉచిత పథకాలతో ముప్పై శాతం మందిని గెలుచుకుంటే చాలు గెలుపు నల్లేరు మీద నడక అన్న ధోరణితో ఉన్నాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మధ్య తరగతి ప్రజలను ఉపేక్షించడం వారు ఓటింగ్‌కు దూరం అయ్యారు.. ఎలాంటి పథకాలు వర్తించని మేధావులు, ఉద్యోగులు, విద్యావంతులు ఓటుకి దూరంగా ఉండడంతో సంక్షేమ పథకాలు గెలిచాయి. నాకేంటి అని సగటు ఓటరు ఆలోచించినంత కాలం ఫలితాలు ఇలాగే ఉంటాయి..

మంగ శ్రీ శిరందాస్

హైదరాబాద్

98485 97527

Advertisement

Next Story

Most Viewed