- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MSP ప్రభుత్వ భిక్ష కాదు, రైతుల హక్కు!
స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గరీబి హటావో నినాదంతో, హరిత విప్లవం దిశగా దేశాన్ని ముందుకు నడిపి దేశంలో పంటల ఉత్పత్తులను పెంచడంలో సఫలీకృతమైన ప్రభుత్వాలకు పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం ఎందుకు సాధ్యం అవడం లేదన్నది ప్రశ్న. పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వ బిక్ష కాదు, అది రైతుల హక్కు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. కానీ కార్పొరేటీకరణ ప్రభావం ఇప్పుడు అన్ని రంగాలపై ఉంది. పైగా స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి వ్యవసాయ దారుల హక్కులను హరిస్తూ, వారి ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లేకుండా వారిని నిత్యం వ్యధల్లో ముంచెత్తుతున్నారు. దీంతో రైతులు చట్టబద్ధమైన హక్కులనూ పొందడం లేదు. అనేక ఆందోళనలు, కమిషన్ల రిపోర్టుల ద్వారా చెరుకు, పత్తి లాంటి ఇతర వాణిజ్య పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు కొంత సఫలీకృతమైనప్పటికీ వరి, మొక్కజొన్న, గోధుమ లాంటి నిత్యావసర వస్తువులకు మద్దతు ధర ప్రకటించడంలో ప్రతిసారి విఫలమౌతూ వస్తున్నాయి. ధర హామీలేని కారణంగా రైతులలో నిరాశ, నిస్పృహలు రోజురోజుకు పెరిగిపోయి కుటుంబాలకు, కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి మన దేశంలో ఉంది.
మద్దతు ధర సరిపోకే ఆందోళనలు
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పేరిట వ్యవసాయ ఉత్పత్తులకు ధర కల్పించాలనే ఆలోచన 1966 నుంచి భారతదేశంలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రతి సీజన్లో భారత ప్రభుత్వం ప్రకటిస్తోంది. కొన్ని పంటలకు తప్ప మిగతా పంటలకు కనీస మద్దతు ధర ప్రకటన ఆలస్యమై రైతులకు ప్రతిసారీ నిరాశనే ఎదురవుతోంది. భారతరత్న డాక్టర్ స్వామినాథన్ సారథ్యంలో 2004 నవంబర్‌లో రైతుల స్థితిగతులపై నియమించిన జాతీయ కమిషన్ తన ఆరు నివేదికలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా వారి మద్దతు ధర విషయంపై కూలంకుషంగా సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వం రైతు ఉత్పత్తులకు ప్రకటించే కనీస మద్దతు ధర మాత్రం ఆశించిన స్థాయిలో పెంచడం జరగలేదు.
A2 (పంట పండించడం కోసం పెట్టిన పెట్టుబడి ఖర్చులు, పంట సాగు కోసం చేసిన ఖర్చు), FL లేబర్ ఖర్చులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని కనీస మద్దతు ధర నిర్ణయం జరుగుతోందని, ఇది ఏ మాత్రం రైతుకు లాభసాటిగా లేదని, C2( స్థిరాస్తిపై చేసిన ఖర్చు)ను కూడా పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయం చేయాలని స్వామినాథన్ కమిషన్ సూచించింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఏ సూత్రం ప్రకారం ధర నిర్ణయం చేస్తుందో ఎక్కడా వెల్లడించలేదు. ప్రభుత్వం నిర్ణయించే ధరకు... రైతులు, రైతు సంఘాలు అంచనా వేస్తున్న ధరకూ ఏమాత్రం దగ్గరి సంబంధం కూడా లేదు. ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర సరిపోక అనేక ఆందోళనలకు రైతులు దిగుతున్నారు.
పంట మార్పిడి ఎలా సాధ్యం?
పంట మార్పిడి విధానం ద్వారా రైతులు మద్దతు ధర పొందవచ్చు అనే ఆలోచనలను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నప్పటికీ ఇది కష్టమే అని నిరూపితం అవుతూ వస్తోంది. నిత్యావసర వస్తువులైన పప్పు దినుసులు, జీలకర్ర, అల్లం పంటను విత్తే సమయానికి ఉన్న ధరతో పోలిస్తే, పంట చేతికొచ్చే సమయానికి ఉన్న ధర సగానికి సగం పడిపోతోంది. ఎటువంటి ధర హామీ లేకుండా రైతులు పంట మార్పిడి చేయడం కారణంగా మరింత నష్టపోయిన ఘటనలు అనేకం, రైతులు పంట మార్పిడికి సుముఖత చూపకపోవడానికి ఇదే ముఖ్య కారణంగా మనం అర్థం చేసుకోవచ్చు. పంటకు ప్రభుత్వం విధించిన మద్దతు ధర కంటే వ్యాపారులే ఎక్కువ డబ్బులు ఇచ్చి పంటను కొనే స్థాయిలో ధర నిర్ణయం జరుగుతోంది. అంటే రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధర, వారికి వచ్చే లాభాన్ని మనం అంచనా వేయవచ్చు. రైతులను పంట మార్పిడికి ప్రోత్సహించే పాలనా వ్యవస్థ కిందిస్థాయి వరకు లేకపోవడం దురదృష్టకరం.
ప్రస్తుత ఖర్చుల దృష్ట్యా..
స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వ్యవసాయ చట్టాల్లో మార్పులు లేకపోవడం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ నియంత్రణ ఎక్కువ అవ్వడం... లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత కూడా రైతులకు ధరల హామీ కల్పించకపోవడం వంటివే రైతుల అసహనానికి కారణం. చెరుకు పంటకి చట్టబద్ధత కల్పించడంలో 1966లో ప్రభుత్వం సఫలమైంది కానీ మిగతా పంటల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసి తగు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులతో ప్రభుత్వం అనేకసార్లు చర్చలు జరిపినా సమస్య ఒక కొలిక్కి రావడం లేదు. ఆందోళనల తీవ్రతను చూస్తుంటే ఎన్నికల వేళ రైతులు తమ ఆందోళనలు మరింత ఉధృతం చేసే అవకాశాలు లేకపోలేదు. 2014లో ఏర్పాటైన నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే కనీస మద్దతు ధర పెంచుతూ వస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ఖర్చుల దృష్ట్యా రైతులు జీవనం సాగించడం రోజురోజుకు కష్టతరమవుతుంది. కనీస మద్దతు ధర ప్రభుత్వ బిక్ష కాదు, అది రైతుల హక్కు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాజశేఖర్,
పూర్వ విద్యార్థి, నల్సార్ యూనివర్సిటీ
96032 72731