- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SC classification: గెలిచి నిలిచిన పోరాటం..!
మాదిగ ఉపకులాలైన డక్కలి, బైండ్ల, సింధు, రెళ్లి మాతంగి, మాస్టీ, వంటి కులాలకు చెందిన వారు విద్యా ఉద్యోగ రంగాలలో తీవ్రంగా నష్టపోయారని మూడు దశాబ్దాలుగా ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. నిన్నటి సుప్రీంకోర్టు సైతం ఎస్సీలలో కొన్ని కులాలు వెనుకబడినట్లు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయబద్ధమైన డిమాండ్‌ను పరిష్కరిస్తూ చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. సామాజిక న్యాయం పూర్తిగా అందరికీ దక్కడంలో వివక్షకు తావు లేకుండా చేయడంలో ఈ తీర్పు ఉపకరిస్తుంది. ఈ తీర్పును సభ్యసమాజ మంతా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది.
వందల సంవత్సరాల దోపిడీ పీడన అణచివేత వల్ల దళితులు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలకు దూరమయ్యారు. దశాబ్దాలుగా ఆధిపత్య పాలక వర్గాలు రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తూ వస్తున్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థ వలన దళితులలోనూ అంతరాలు పెరిగిపోయాయి. గత ఏడు దశాబ్దాలుగా ఎస్సీలలో ఒకటి రెండు కులాలు మాత్రమే ఫలితాలను అనుభవిస్తూ వస్తున్నాయి. ఈ వివక్షకు వ్యతిరేకంగా ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలలోని 59 కులాలకు సమానంగా పంపిణీ చేయాలని సుమారు మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్‌తో పాటు వివిధ రూపాలలో దండోరా ఉద్యమం కొనసాగింది.
విరామం లేని పోరాటం..
మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం దక్కాలంటే పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మాదిగలు విరామం లేకుండా వివిధ రూపాలలో పోరాటాలు చేశారు. వర్గీకరణ విషయంలో పాలక పక్షంలో ఉన్న పార్టీలు తోక ముడిచిన్నప్పుడల్లా సామాజిక స్పృహ కలిగిన అనేక మంది మేధావులు, విద్యావంతులు, ప్రజాసంఘాలు, విప్లవ పార్టీలు దండోరా ఉద్యమానికి సంఘీభావం తెలపడంతో పాటు సందర్భాన్ని బట్టి ప్రత్యక్ష ఉద్యమాలలో సైతం పాల్గొన్నాయి.
ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటేనే...
రాజ్యాంగ ఫలితాలు అణగారిన వర్గాలతో పాటు అందరికీ దక్కాలంటే ప్రభుత్వ రంగాన్ని మరింత బలోపేతం చేయాలి. ఉన్నటువంటి ప్రభుత్వరంగాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వ రంగంలోనే సామాజిక న్యాయం, ఉపాధి కల్పనలకు సహకారం అందుతుంది అనేది గత చరిత్ర చెప్పిన అనుభవ పాఠం. ఇప్పుడున్న పద్ధతిలో ప్రైవేటీకరణ జరిగితే సాధించుకున్న ఏబిసిడి వర్గీకరణకు ఫలితం లేనట్లే. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సంపూర్ణంగా ఫలప్రదం కావాలంటే విద్యా ఉద్యోగ వ్యవస్థలో ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు, అడ్డుకట్ట వేయాలి. ఆ వైపుగా ఉద్యమాలకు పదును పెట్టాలి.
ఈ ప్రభుత్వాలు తీర్పును గౌరవించాలి!
2000-2004 మధ్య సుమారు 25,000 ఉద్యోగాలు మాదిగ ఉప కులాలకు దక్కినాయి. ఎస్సీ -ఏబిసిడి వర్గీకరణ కేసు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు ఆనాటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మౌనం వహించింది. ఆచరణలో తెలంగాణ ఉద్యమం పట్ల ఏ విధానాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవలంబించారో, దండోరా ఉద్యమం పట్ల కూడా అలాగే వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా కనీసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లలేదు. వర్గీకరణ పట్ల రాజకీయ పార్టీలు పాలకవర్గంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరకంగా వ్యవహరించాయి. ప్రజాస్వామ్యం ఫలప్ర దం కావాలంటే సామాజిక న్యాయం ఒక రూల్‌గా ఉండాలని భారత రాజ్యాంగ పిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వెల్లడించారు. ఆ వైపుగా వేగవంతంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయాలి. తక్షణమే అమలు చేయాలి. తెలంగాణ ముఖ్యమంత్రి దేశంలోనే మొద లు వర్గీకరణ అమలు చేస్తామనడం సంతోషకరం.
దండోరా ఉద్యమానికి అభినందనలు
ఎస్సీ, ఏబిసిడి వర్గీకరణ ధర్మబద్ధమైనదని, న్యాయబద్ధమైనదని సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైంది. ఈ ధర్మ పోరాటంలో సుదీర్ఘ పోరాటం చేసి భారతి, సురేందర్, మహేష్ లాంటి మాదిగ బిడ్డలు అమరులయ్యారు. వారి పోరాట ఫలితమే నేటి తీర్పు. దండోరా ఉద్యమానికి కొంత విరామం జరిగి ఉండవచ్చు కానీ ఎక్కడా విరమణ జరగలేదు. మొక్కవోని దీక్షతో దండోరా శ్రేణులు వివిధ రూపాలలో పోరాటాన్ని కొనసాగించాయి. వారి పోరాట ఫలితం భవిష్యత్తు తరాలకు అందుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ దండోరా ఉద్యమానికి అభినందనలు.
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
94416 61192