ఎన్ని పన్నులు కట్టిన వాహనదారులకి ఇబ్బందేనా?

by Ravi |   ( Updated:2022-09-03 14:01:08.0  )
ఎన్ని పన్నులు కట్టిన వాహనదారులకి ఇబ్బందేనా?
X

రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి నిపుణులతో కూడిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక రోడ్డు ప్రమాదాల నివారణ సంస్థను స్థాపించాలి. దాని నిర్వహణకు అవసరమైన నిధిని ఏర్పాటు చేయాలి. పన్నుల రూపంలో వచ్చిన డబ్బులో అధికశాతం దానికి అందేలా చూడాలి. అప్పుడే ప్రమాదాల నివారణ, భద్రతతో కూడిన ప్రయాణం సాధ్యమవుతుంది. కేంద్ర, రాష్ట్ర రవాణా సంస్థలను సదరు సంస్థకు అనుసంధానం చేయాలి. నిబంధనలు త్రికరణ శుద్దిగా అమలు పరచాలి. దేశంలో జరుగుతున్న 84 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రంకన్ డ్రైవ్, మొబైల్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం లాంటి కారణాలతోనే జరుగుతున్నాయి. తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి పిల్లలకు ఉగ్గుపాలతోనే రంగరించి పోయాలి.

కొత్తగా కొనుగోలు చేసే వాహనాల మీద జీవితకాల పన్నును తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 9 నుంచి 12 శాతానికి పెంచింది. ఇతర రాష్ట్రాల వాహనాలను మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విధించే పన్నును 11 నుంచి 12 శాతానికి పెంచింది. దీని ద్వారా ప్రభుత్వం యేటా రూ. 1400 కోట్ల ఆదాయం టార్గెట్‌గా పెట్టుకుంది. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ట్యాక్స్ పేరుతో ఏడు సంవత్సరాల లోపు వాహనాలపై త్రైమాసిక పన్నులో సగంగా, 12 సంవత్సరాలలోపు వైతే త్రైమాసిక పన్నుతో సమానంగా, 12 ఏళ్ల పైబడిన వైతే డబుల్ త్రైమాసిక పన్నుతో సమానంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో పాటు ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో బాధితులను ప్రమాద స్థలం నుంచి సమీప ఆసుపత్రులలో చేర్పించడానికి అవసరమైన సౌకర్యాల కోసం ప్రభుత్వం సెస్ రూపంలో టూవీలర్‌పై రూ.500, ఫోర్ వీలర్‌పై రూ.2,000, రవాణా వాహనాలపై రూ.2,500 వసూలు చేస్తోంది. వీటి మీద యేటా రూ.100 కోట్ల ఆదాయం టార్గెట్‌గా నిర్ణయించుకుంది.

బొక్కసం నింపుకోవడానికే

దేశంలో రహదారి ప్రమాదాల నివారణ కోసం ప్రపంచ బ్యాంకు సుమారు రూ. 7,500 కోట్ల రుణం ఇచ్చింది. ఈ నిధులతో 'ఐరాడ్' 'ఐరాస్టే'లాంటి ప్రయోగాత్మక పథకాలు ప్రవేశపెట్టి రహదారుల నిర్మాణం, డ్రైవర్ల నైపుణ్యాల పెంపు, రహదారి ప్రమాదాల నివారణలో ప్రజలను చైతన్య పరిచేందుకు అవసరమైన అనేక అవగాహనా కార్యక్రమాలను చేపట్టారు. ఇది ఆశించిన ఫలితాలు అందుకోలేకపోవడానికి కారణాలు ఏంటో లోతుగా అధ్యయనం చేయాలి. ప్రభుత్వం ఆర్థికంగా పుష్కలంగా ఉన్నామంటూనే ఇబ్బడి ముబ్బడిగా వాహనదారుల నుంచి వివిధ రకాల పన్నులు పెంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నది. ఇలా పన్నులు, ప్రపంచ బ్యాంకు రుణాలు రెండూ ఉన్నా యుద్ధ ప్రాతిపదికన రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాలను ఎందుకు చేపట్టడం లేదో అర్థం కావడం లేదు.

ప్రభుత్వం సదరు పన్నులను కేవలం తన బొక్కసాన్ని నింపుకునే యావతోనే పెంచిందని రవాణా రంగ నిపుణుల అభిప్రాయం. జాతీయస్థాయిలో రవాణా శాఖ, హైవేస్ మినిస్ట్రీ రహదారుల నిర్మాణం కోసం లక్షల రూపాయలను ఖర్చుచేసినా, అత్యంత ఆధునిక ఫీచర్లతో వాహనాలను తయారుచేస్తున్నా, ప్రపంచ బ్యాంక్ సహకారంతో, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో డ్రైవర్లకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఈ దేశ రహదారులపై అను నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల మారణకాండను నిలవరించలేకపోవడం దురదృష్టకరం.

ఉగ్గుపాలతో రంగరించి పోయాలి

రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి నిపుణులతో కూడిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక రోడ్డు ప్రమాదాల నివారణ సంస్థను స్థాపించాలి. దాని నిర్వహణకు అవసరమైన నిధిని ఏర్పాటు చేయాలి. పన్నుల రూపంలో వచ్చిన డబ్బులో అధికశాతం దానికి అందేలా చూడాలి. అప్పుడే ప్రమాదాల నివారణ, భద్రతతో కూడిన ప్రయాణం సాధ్యమవుతుంది. కేంద్ర, రాష్ట్ర రవాణా సంస్థలను సదరు సంస్థకు అనుసంధానం చేయాలి. నిబంధనలు త్రికరణ శుద్దిగా అమలు పరచాలి.

దేశంలో జరుగుతున్న 84 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రంకన్ డ్రైవ్, మొబైల్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం లాంటి కారణాలతోనే జరుగుతున్నాయి. తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి పిల్లలకు ఉగ్గుపాలతోనే రంగరించిపోయాలి. ప్రభుత్వాలు సైతం ప్రాథమిక విద్యాస్థాయి నుంచే భద్రత నిబంధనలను పాఠ్యప్రణాళిక లో చేర్చి వారికి రహదారి ప్రయాణం పట్ల పరిపూర్ణ అవగాహన కలిగించాలి. రహదారి ప్రమాదాల రహిత దేశంగా తీర్చిదిద్దాలి. అందుకు మీడియా, సోషల్ మీడియా సంపూర్ణ సహాయ సహకారాలను అందించాలి.

నీలం సంపత్

రోడ్ సేఫ్టీ ఫౌండేషన్, హైదరాబాద్

98667 67471

Advertisement

Next Story