- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్గీకరణకు ఇంకెంత కాలం?
సామాజిక సమానత్వం కోసం సుదీర్ఘ కాలంగా ఉద్యమాలు... బలిదానాలు జరుగుతున్నప్పటికీ కేంద్రంలో ఏ సర్కారు వచ్చినా మాదిగల పట్ల సరైన వైఖరిని మాత్రం చూపలేకపోతుంది. ఎస్సీల్లో ఉన్న అసమానతలు, ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగలకు విద్య, ఉద్యోగ, ఉపాధి వివిధ రంగాల్లో తీవ్రమైన నష్టం చేకూరుతుంది. దీని పట్ల గతంలో వేసిన పలు కమిషన్లు సైతం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఇది న్యాయమైన అంశమని సూచించింది. అయినప్పటికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు మాదిగల పట్ల చిత్తశుద్ది చూపకపోగా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. రామచంద్ర రాజు కమిషన్‌తో పాటు జస్టీస్ ఉషామెహ్ర కమిషన్ సైతం వర్గీకరణ చేసి ఎస్సీలో దిగువ శ్రేణి వారికి సైతం రాజ్యాంగ ఫలాలు అందాలని దానికి వర్గీకరణ తప్పనిసరి అని తేల్చింది.
పదేళ్లుగా ఎన్నో చేసినా..
మాదిగలు సుమారు మూడున్నర దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నా ...పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. వర్గీకరణ ఎస్సీ జాబితాలోని 59 కులాలకు సంబంధించిన అంశం కానీ, మెజారిటీగా ఉన్న మాదిగలు వివిధ రంగాల్లో రాణించలేకపోతున్నారు. ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల సంచార జాతులకు సైతం రాజ్యాంగ ఫలాలు అందకుండా పోతున్నాయి. ఎస్సీలోని ఉపకులాలకు అన్యాయం జరుగుతోంది. ఇది రాజ్యాంగ సూత్రానికి విరుద్ధం. సమాజంలో ఎవరి వాటా వారికి దక్కాలంటే ఎస్సీ వర్గీకరణ తప్పనిసరి. దీనికి కమిషన్లు, రాజకీయ పార్టీలు మద్ధతిస్తున్నప్పటీకి ఇప్పటికీ చట్టబద్ధత కల్పించకపోవడం మెజారిటీ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే అవుతుంది. సంచార జీవితాలు గడుపుతున్న వారిని మరింత అంధకారంలోకి నెట్టివేసినట్లే అవుతుంది.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని 2014 ఎన్నికలప్పుడు ప్రకటించింది. అయినప్పటికీ ..పది సంవత్సరాలు కావస్తున్నా మాదిగల న్యాయమైన ఆకాంక్షకు చట్టబద్ధత తేవడంలో తీవ్రమైన నిర్లక్ష్యానికి పాల్పడుతుంది. ఈ పదేళ్లలో అత్యంత సున్నితమైన అనేక రకాల సమస్యలను, ఎవరూ డిమాండ్ చేయకపోయినా కొన్ని బిల్లులను కేంద్ర సర్కారు చట్టబద్దత కల్పించి ఆ సమస్యను పరిష్కరించింది. అటువంటప్పుడు సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నప్పటికీ ఈ వర్గీకరణకు ఎందుకు చట్టబద్ధత కల్పించడం లేదో అర్థం కాదు. వారిని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ.. వారి ఆకాంక్షను నెరవేర్చడం లేదు.
ప్రస్తుతం ఒత్తిడి తేవాలి..
ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు ఐదు సంవత్సరాలకు పైగా వర్గీకరణ అమలైంది. తద్వారా జనాభా నిష్పత్తి ప్రకారం అనేక మందికి మాదిగ, ఉపకులాల వారికి వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఆ తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఎస్సీల రిజర్వేషన్ల అమలును రాష్ట్రాల పరిధిలో నుంచి పార్లమెంటు ద్వారా చట్టం చేయాలని ...ఎస్సీల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రాలకు అధికారాలు లేకుండా చేసింది. అప్పటి నుంచి కేంద్రంలో అధికారంలోకి రాకముందు ప్రతీ పార్టీ ఎస్సీల రిజర్వేషన్ల పెంపుపై సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ, అధికారం చేపట్టిన తరువాత మాత్రం దాటవేస్తూ మూడు దశాబ్దాలుగా మాదిగల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చివేస్తున్నాయి. రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి ఆమోదం కోసం పంపింది. అయినప్పటికీ ఇప్పటికీ స్పందించడం లేదు.
రాష్ట్రంలో ఎస్సీ జనాభా17.50 శాతం ఉన్నట్టు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తేల్చింది. ఇందులో మాదిగల నిష్పత్తి 12 శాతం. కానీ ప్రస్తుతం ఎస్సీలకు వర్తింపజేస్తున్న రిజర్వేషన్లు 15 శాతం. అలాగే ఏపీలోనూ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా సుమారు 85 లక్షలు కాగా, ఇందులో సుమారు 35 లక్షల మంది మాదిగలే ఉన్నారు. అందుకే వర్గీకరణ చేసి ఎస్సీల్లో ఉన్న సామాజిక అణచివేతలను దూరం చేయడానికి ఏబీసీడీలుగా విభజించి ..ఎవరు ఎంత ఉంటే వారికి తగ్గట్టు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచి సమానంగా పంచాల్సిన అవసరం ఉంది. దీనికోసం అవిరామంగా మాదిగలు శాంతియుతంగా నిరసనలు, పోరాటాలు చేస్తూ డిమాండ్ ముందు ఉంచుతున్నప్పటికీ కేంద్రం మాత్రం వీరి పట్ల చిత్తశుద్ధి చూపకపోగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. అందుకే వర్గీకరణపై ఉమ్మడి రాష్ట్రాలు పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లో ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. న్యాయమైన వాటా కోసం ఉద్యమించి వర్గీకరణ సాధించుకొని తద్వారా రాజ్యాధికారానికి దగ్గర కావాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్రం సైతం ఈ వర్షాకాల సమావేశంలో నైనా వర్గీకరణ బిల్లు పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
సంపత్ గడ్డం
దళిత ఉద్యమ నాయకుడు
78933 03516