- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జాతి విముక్తిలో పాలు పంచుకుందాం..!

ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన ప్రశ్నల సునామీలా గర్జించాడు. మెడలో నల్ల కండువానే కొండంత భరోసాగా నిలబడి సమాజం పక్షాన ధిక్కారమయ్యారు. నేటి తరం అనుసరించాల్సిన నాయకుడు ఆయన.. ఓ జాతి, మరికొన్ని ఉపకులాల భవిష్యత్తు కోసం అతికొద్ది మందితో ఉద్యమాన్ని నిర్మించి నేడు ప్రతీ రాజకీయ పార్టీ చేత వర్గీకరణకు జై కొట్టించిన సామాజిక ఉద్యమ నాయకుడతను. మారుమూల పల్లెలో మొదలైన వర్గీకరణ ఉద్యమం నేడు ప్రపంచ దేశాల్లో ఉన్న వారితో కూడా మద్దతు కూడగట్టేలా చేయగలిగిందంటే అది కేవలం తాను చేసిన అలసిపోని పోరాటమనే చెప్పాలి. అలా అని కేవలం మాదిగల వరకే ఆయన పరిమితం కాలేదు. ఎక్కడ అణచివేత ఉంటే .. ఏ సమాజం బాధపడినా ఆ బాధలకు పరిష్కారం చూపే పెద్దన్నగా నిలిచారు. అలాంటి మందకృష్ణ మాదిగను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు నిచ్చి ఆయన దశాబ్దాల తరబడి సాగించిన సేవలను గుర్తించింది. వర్గీకరణ ఉద్యమం పొడవునా ఆయన నిర్వహించిన సుదీర్ఘమైన పాత్రను ఈ సందర్భంగా గుర్తించుకుందాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అనేక సామాజిక పోరాటాల్లో ఆయన గొంతుకయ్యారు. ఎటు వంటి సాంకేతికత అంత అభివృద్ధిలో లేని కాలంలోనూ ఆయన ప్రతీ పల్లెకు జాతి వాదాన్ని తీసుకెళ్లారు. సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, బహిరంగ సమావేశాలు ఒక్క ప్రయత్నం ఏంటీ జాతి భవిష్యత్తు కోసం ఆయన చేయని కృషి లేదు. కలిసి వచ్చే మేధావి వర్గంతో ఎప్పటి కప్పుడు చర్చలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యమానికి మరింత చైతన్యం చేసే దారులు వెతికారే తప్పా ఆయన ఏనాడూ అలసిపోలేదు. ఎన్ని నిర్భందాలు ఎదురైనా ఆయన పాదం, వాదం ముందుకే కదిలింది తప్పా ఏనాడు వెనుకడుగు వేయలేదు. తన జాతి విముక్తి మించిన గొప్ప పదవి మరేది లేదనే విధంగా ఆయన కృషి మరువలేనిది.
తెలంగాణ ఉద్యమంలోనూ..
ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల వెనుక ఆయన బలమైన డిమాండ్ ఉన్నది ఇది చరిత్రలో ఎప్పటికీ చెరపని సాక్ష్యం. ఓ వైపు జాతి ఉద్యమం చేస్తూనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటం చివరి దశలో ఉన్నప్పుడు ఆయన ఉద్యమానికి జీవం పోశాడు. ఆంధ్ర రాజకీయ నాయకుల కుట్రలను బహిర్గతం చేస్తూ అనేక ప్రశ్నలు, చర్చలతో తెలంగాణ వాదన మరింత బలపడేలా కృషి చేశారు. ప్రాంతాలుగా విడిపోయినా అన్న దమ్ముళ్ల వలే కలిసి ఉండాలనే సూత్రాన్ని ప్రజల్లోకి, సబ్బండ వర్గాల్లోకి తీసుకెళ్లారు. ఉద్యమంలో ఆత్మార్పణం చేసుకుంటున్న విద్యార్థి, యువతలో ఆత్మస్థైర్యం నింపారు. ఆ కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ఆదుకోవాలనే పదునైన డిమాండ్లను ప్రభుత్వం ఉంచారు. ఇలా ఆయన వర్గీకరణ పోరాటం చేస్తూనే సబ్బండ వర్గాల కోసం కృషి చేశారు. అందుకే ఆయన పిలుపు ఇస్తే కుల, మతాలకు అతీతంగా కదులుతారు. ఏ రాజకీయ అండదండలు లేకపోయినా ఏ మైదానం సరిపోని జన సమూహాం ఆయన వెంట నడుస్తది.
ఓ సామాజిక సమస్యను రాజకీయం చేస్తూ..
వర్గీకరణ విషయమై ఉషామెహ్ర కమిషన్ లాంటివి వర్గీకరణ అంశంపై సానుకూల నివే దికలు ఇచ్చినా, కొందరు రాజకీయ ప్రోద్భలంతో వర్గీకరణ అంశాన్ని కాళ్ల కింద తొక్కి పట్టినట్లు చేశారు. అయినా ఎక్కడా ఎటువంటి సహనం కోల్పోకుండా మందకృష్ణ మాదిగ ఉద్యమం లక్ష్యాన్ని ముద్దాడేలా చేశారు. ప్రస్తుతం వర్గీకరణఅనేక కుట్రలను చేధించుకొని సంవత్సరం ఆగస్టు 1న వర్గీకరణ అమలు చేయాల్సిన బాధ్యతను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయా రాష్ట్రాలకే అప్పగిస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా వర్గీకరణ వద్దు అనే అనే డిమాండ్‌తో మరింత కాలయాపన కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి మాల, మాదిగలు కలుసుందాడానికి శాస్ర్తీయంగా గానీ ప్రజాస్వామికంగా ఎటువంటి స్పష్టత లేకపోయినా ఆ బలవంతపు డిమాండ్ వల్ల వర్గీకరణ జాప్యం అవుతోంది. మాలలు సైతం పోటాపోటీగా సభలు, సమావేశాలతో ఆరోపణలతో అంశం పక్కకు మళ్లించే ప్రయత్నం జరుగుతున్నది. అయినా ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామిక వాదులందరూ వర్గీకరణలో ఉన్న సామాజిక న్యాయానికి సానుకూలాన్ని వ్యక్తం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఓ సామాజిక న్యాయమైన సమస్యను రాజకీయ లబ్ది కోసం వాడుకొనే అంశంగా కొందరు చూస్తున్నారు. కొన్ని తరాల భవిష్యత్తును స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకోవడం మంచిది కాదు. ఇప్పటికే మాదిగ, ఉపకులాలలు తీవ్రమైన ఆవేదనలో ఉన్నవారికి ఇప్పుడు మద్దతు ఇచ్చే వారే రేపటి భవిష్యత్తు చదువుకునే చరిత్రగా మారే అవకా శం ఉంది.
ఆ వేల గొంతుల్లో మనం ఉండాలి!
రేపటి భవిష్యత్తులో చరిత్రగా నిలిచిపోయే వర్గీకరణ పోరాటంలో పాల్గొనే అవకాశం మన ముందు ఉంది. ఉద్యమం చివరి దశకు చేరిన సందర్భంలో మనం జాతి విముక్తిలో ఓ పిడికిలిలా.. నినదించే గొంతులా కదలాల్సిన అవసరం ఉంది. వేయి గొంతులు..లక్ష డప్పులు కార్యక్రమ ఉద్యమం ఈ భారతదేశ చరిత్రలో ఓ గొప్ప సాంస్కృతిక ఉద్యమంగా నిలవనున్నది. ప్రజా స్వామ్య పంథాలో హైదరాబాద్ నడి బొడ్డులో ఫిబ్రవరి 7న న్యాయమైన లక్ష డప్పుల దరువు మోగనున్నవి.. వేల గొంతులు తమ నరాలు బిగుసుకుపోయే కంఠాలతో సిద్ధంగా ఉన్నాయి. అటువంటి గొప్ప కార్యక్రమంలో ప్రతీ మాదిగ వాడకట్టు... ఓ జాతరోలే కదలాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద ఎటువంటి విమర్శలకు తావు లేకుండా మన జాతి విముక్తి కోసం మరింత చైతన్యంతో మనం కదలాలి. రాజకీయ పార్టీల్లో మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్నా.. ఎంత గొప్ప పదవిలో ఉన్నా జాతి అస్తిత్వం కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొనకపోతే కన్న తల్లిని మరిచిపోయినట్లే.. అందుకే లక్ష డప్పులు, వేల గొంతుల్లో మనమూ ఉండాలి.. మనం సాధించే ఈ విజయం ప్రపంచ చరిత్రలో లక్ష డప్పుల సాక్షిగా ఓ గొప్ప చరిత్ర.
(మందకృష్ణకు పద్మశ్రీ ప్రకటించిన సందర్భంగా)
- సంపత్ గడ్డం
మాదిగ విద్యార్థి ఉద్యమ నాయకుడు
78933 03516