లక్షల్లో ఉద్యోగాలు...కోట్లల్లో నిరుద్యోగులు..!

by Ravi |   ( Updated:2024-09-06 01:00:20.0  )
లక్షల్లో ఉద్యోగాలు...కోట్లల్లో నిరుద్యోగులు..!
X

2047 కల్లా దేశాన్ని ప్రపంచంలోనే వృద్ధి రీత్యా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలి అనుకుంటున్నారు పాలకులు. ఉద్యోగరీత్యా మాత్రం కాదు. 2014లో మన ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పుడు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరలా ఉద్యోగ కల్పన కోసం, వివిధ పథకాల నిర్వహణ కోసం రెండు లక్షల కోట్లు కేటాయించి 4.1 కోట్ల మందికి ఉద్యోగ కల్పన చేస్తానని అంటున్నారు. కానీ మొదటి ఎనిమిది సంవత్సరాల కాలంలో 7.2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని లోక్‌సభలో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అఫైర్స్ తెలియజేసినారు.

పాలకుల ప్రకటనకు చేపట్టే విధానాలకు పొంతన లేకుండా పోయింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయకుండా ఉద్యోగ కల్పన పేరుతో ప్రైవేటు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సబ్సిడీలు ఇస్తే ఉద్యోగ కల్పన సాధ్యమా? పెట్టుబడిదారుల మూలధన సాంద్రత (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్) ప్రాతిపదికన ఉత్పత్తి కార్యక్రమాలు చేపట్టడం వలన నిరుద్యోగ సమస్య తీరదు. శ్రమ సాంద్రత, ఉత్పత్తి పద్ధతులకు వాళ్లు ఎప్పుడో మంగళం పాడారనే విషయం పాలకులకు తెలియదా?

83 శాతం యువత నిరుద్యోగులే..

నిరుద్యోగిత సమస్య లేనే లేదు. దేశంలో నిరుద్యోగిత 3.2 శాతానికి తగ్గిపోయినట్లు పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించిందని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2014-23 సంవత్సరాల మధ్యకాలంలో కోటి 25 లక్షల ఉద్యోగాలను సృష్టించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధక విభాగం నివేదిక వెల్లడించిందని ఆర్థిక మంత్రి తెలిపారు. అవి రెండు ప్రభుత్వ నివేదికలే. కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఏకానమీ (సిఎంఐ) ఈ డేటా ఆ నివేదికల వివరాలకు విరుద్ధంగా ఉన్నది. దేశంలో నిరుద్యోగిత ప్రస్తుతం 9.2%గా ఉన్నదని ఆ ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ పేర్కొంది. భారత్‌లో నిరుద్యోగులుగా ఉన్నవారిలో 83 శాతం మంది యువజనులేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ వెల్లడించింది.

ఉద్యోగ అవకాశాలు పెరిగిపోతున్నాయని ఒక వైపు చెబుతూనే కోట్ల కోట్లకు నిరుద్యోగులు ఉన్నారని చెప్పడం పాలకుల మాటల చాతుర్యమే కదా? ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ శ్రామిక సంస్థ ప్రకారం మనదేశంలో నిరు ద్యోగం ముఖ్యంగా యువతలో నిరుద్యోగం బలంగా ఉందని చెప్పడం చూస్తుంటే పాలకులు చెప్పే మాటలకు అధికారిక గణాంక వివరాలు తెలియజేసే సంస్థలకు పొంతన లేకుండా పోయింది. రాజకీయ లెక్కలే గాని అధికారిక సంఖ్యాపరమైన సమాచారం నిరుద్యోగంపై ప్రభుత్వాల దృష్టి పెట్టకపోవడం ఎందుకు?

జి 20 దేశాల్లో మనమే చివరలో...!

ఉద్యోగాల కల్పన విషయంలో భారత్ జి20 సభ్య దేశాలన్నిటికంటే వెనుకబడిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీత గోపీనాథ్ అన్నారు. దేశంలో 2030 నాటికి 14.8 కోట్ల అదనపు ఉద్యోగ కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. 2010లో ప్రారంభమైన దశాబ్దం లో భారత సగటున 6.6% శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేయగా ఈ కాలానికి ఉద్యోగాల కల్పన రేటు మాత్రం రెండు శాతానికి పరిమితమైంది. జి20లోని ఇతర దేశాలతో పోలిస్తే భారత ఉద్యోగాల కల్పన చాలా తక్కువగా ఉంది. అయితే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కేఎల్ఈఎంఎస్ డేటా ప్రకారం మనదేశంలో 2017-18లో 47.5 కోట్ల ఉద్యోగాల నుండి 2023-24లో 64.33 కోట్ల సంఖ్యకు ఉద్యోగులు పెరిగారని మరొకవైపు చెబుతున్నారు. ఆర్థిక శాస్త్రవేత్తలు దీన్ని ఖండించారు. కరోనా కాలంలో వలస కూలీలందరూ తమ ఊర్లకు వచ్చి వ్యవసాయ రంగంలో పనిచేయడం కూడా ఉద్యోగ కల్పన జరిగినట్లుగా భావించి 2017-18లో 47.5 కోట్లు నుంచి 2023- 24 నాటికి 64.33 కోట్లకు పెరిగింది అని చెప్పడం ఏ కొలబద్ద ప్రకారమనీ, అది ఉద్యోగిత కాదని, గత్యంతరం లేని బతుకుతెరువు మాత్రమేనని అంటున్నారు. 2010-20 మధ్య కాలంలో దేశంలో వృద్ధిరేటు 6.6% మాత్రమే ఉండగా ఉద్యోగ కల్పన రేటు 2 శాతం మాత్రమే నమోదయింది. ఇటువంటి పరిస్థితులలో ఇన్ని కోట్ల మందికి ఉద్యోగ కల్పన ఎలా జరిగిందనేది సందేహమే.

అభివృద్ధి అంటే అందరి వృద్ధి!

1991 నుంచి సరళికుత ఆర్థిక విధానాలు (లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్)చేపట్టిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడం జరుగుతున్నది. 2013లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 17.3 లక్షల ఉద్యోగాలు ఉండగా 2022 నాటికి ఉద్యోగాలు 10 లక్షలకు తగ్గిపోయాయి. అందులోనూ కాంట్రాక్టు కార్మికులుగా 43% మందికి నియామకాలు జరిగాయి. ఇలా దేశంలో మెల్లగా ప్రైవేటు రంగం విస్తరించి కార్పొరేట్ రంగానికి పునాదులు బలంగా ఏర్పడడంతో ఉద్యోగ కల్పన లేక నిరుద్యోగులు గ్రిగ్ వర్కర్లుగా జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అభివృద్ధి అంటే అందరి వృద్ధి అంతేగాని కొందరి వృద్ధి కాదని గాంధీజీ అన్నారు. దేశ ఆదాయం ఎంత అనేది ముఖ్యం కాదు. ప్రజలకు కనీస అవసరాలైన తిండి, వసతి, విద్యా, వైద్యం ఏ మేరకు జరుగుతున్నది అనేది ముఖ్యం. దేశ ప్రజల స్వయం పోషకత్వం ఉద్యోగ కల్పనతోనే సాధ్యం.

ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నిర్ణయించడంలో కీలక అంశం నిరుద్యోగం. ఉత్పత్తి కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొంటే ఆదాయాలు పెరిగి వస్తు సేవలకు గిరాకీ ఏర్పడి వస్తు సేవల ఉత్పత్తి అవసరం ఇంకా పెరిగి ఉద్యోగ కల్పన జరిగే అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా ప్రజల ఆదాయాలు, దేశ ఆదాయం పెరిగి ఆర్థిక వ్యవస్థ స్థాయి ఐదవదా, నాలుగవదా అనేది నిర్ణయింపబడుతుంది. అంతేగాని దేశంలో పేదరికం, నిరుద్యోగిత విపరీతంగా ఉండి ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదైనా ఏమి ప్రయోజనం.

- డాక్టర్ ఎనుగొండ నాగరాజు నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి

98663 22172

Advertisement

Next Story