- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాజిక శాస్త్రం:ఔనా.. కేసీఆర్ భయపడుతున్నారా?!
కేసీఆర్ రాజకీయంగా ఎవరితోనూ శత్రుత్వం గానీ, మిత్రుత్వం కానీ శాశ్వతంగా ఉంచుకోరు. అందుకే రాజకీయ వ్యూహంలో భాగంగానే ప్రస్తుతం కేసీఆర్ బీజేపీ మీద ఎన్నికల సైరన్ ప్రయోగిస్తున్నారు తప్ప, భయపడి చేస్తున్నారనడం ఎంత మాత్రం నిజం కాదు. పీకేలాంటివారి మస్తిష్కాలకి అందనంత ఎత్తులో కేసీఆర్ ఆలోచనలు ఉంటాయనే విషయం మరిచిపోకూడదు. నిజంగా తనకి ఇబ్బంది అని తెలిస్తే తన రక్షణ కొరకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే మనస్తత్వం గల మహా మొండి మనిషి సుమా కేసీఆర్!
తెలంగాణ రాష్ట్రం కొన్ని దశాబ్దాల స్వప్నం. అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవుతుందా? మనం చూడగలమా? అనుకుంటున్న తరుణంలో తెలంగాణ ఏర్పాటును సాకారం చేశారు కేసీఆర్. తెలంగాణ అనే పదాన్ని పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తుల చేత తన చతురతతో 'జై తెలంగాణ'అనిపించారు. తన పార్టీకీ బలం లేకపోయినా, తన మనోబలాన్నే జనబలంగా మార్చుకొని అన్ని పార్టీలకు చెమటలు పట్టించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, నేడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ ఇపుడు అనూహ్యంగా ఇతరుల మీద ఆధారపడడం తెలంగాణ ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తున్నది.
2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలలో 119 స్థానాలకు 60 స్థానాలు గెలుచుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికలలో గెలిచిన ఇతర పార్టీలవారిని భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా తన పార్టీలో చేర్చుకుని సీఎం కేసీఆర్ మంత్రి పదవులు కట్టబెట్టారు. 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 స్థానాలు గెలుచుకొని అందరికి షాకిచ్చారు కేసీఆర్. నిజానికి ఆనాడు అన్ని పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో పోటీకి నిలవగా, టీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగింది. అప్పుడు కూడా కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేశారు. ఇంత ముందు చూపు ఉన్న కేసీఆర్ నేడు ఎందుకు పక్కవారిపై ఆధారపడుతున్నారు? రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్‌తో ఎందుకు కలిసి పని చేస్తున్నారు? నటుడు ప్రకాశ్‌రాజ్ ఇమేజ్‌ను వాడుకునేందుకు ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తారని వినిపిస్తోంది. ఇది ఎంతవరకు మేలు చేస్తుంది.
బలహీనతలను ఆసరా చేసుకుని
నేడు దేశంలో చాలా రాజకీయ పార్టీలు అభివృద్ధిని మరిచి, అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కుతున్నాయి. వ్యూహకర్తలు ఏమి చెబితే అది చేసుకుంటూ పోతున్నాయి. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని తాత్కాలిక తాయిలాలతో, ప్రలోభాలతో తిరిగి అధికారం చేపట్టాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే అమలుకు సాధ్యం కాని ఎన్నికల హామీలు ఇస్తున్నాయి. రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏమిటనేది ఆలోచించకుండా , మనం విజయం సాధించామా లేదా అన్నదే ముఖ్యంగా చూస్తున్నాయి.
నిజానికి ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరు పొందిన ప్రశాంత్ కిశోర్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అతని రాజకీయ వ్యూహాలు ప్రజలకు మేలు చేసేవిగా కాకుండా, విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంటాయని, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉంటాయని అంటుంటారు. దీనికి మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలను నిదర్శనంగా చూపుతున్నారు. మైండ్ గేమ్ ఆడుతూ ప్రత్యర్థులలో అయోమయం సృష్టించి అధికారం చేజిక్కించుకునేలా చేస్తుంటారని చెబుతున్నారు. ఇప్పటిదాకా తెలంగాణ ఎన్నికల సమయంలో, రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇలాంటి ఘటనలు లేవనే విషయం గుర్తించాలి.
వ్యతిరేకత గట్టెక్కించగలదా ?
సీఎం కేసీఆర్ కొంత కాలం నుంచి కేంద్రంపై, ప్రధాని మోదీపై అకస్మాత్తుగా ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో విపక్షాల ఏకీకరణకు నడుం బిగించి, ఇతర రాష్ట్రాల పర్యటనలు కూడా చేశారు. బీజేపీని తీవ్రస్థాయిలో వ్యతిరేకించడం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్‌కు పడతాయనుకుంటున్నారేమో! కాంగ్రెస్‌లో అంతర్గత గొడవల వలన గెలిచే పరిస్థితి ఏమాత్రం లేదని, దీనితో త్రిముఖ పోటీ జరిగి ఓట్లు చీలి టీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే నమ్మకం కేసీఆర్‌లో ప్రబలంగా ఉన్నట్టు కనిపిస్తున్నది.
అందుకోసమే అకస్మాత్తుగా బీజేపీ వ్యతిరేక రాగం విపరీత స్థాయిలో ప్రజల ముందు ఉంచబోతున్నారు. అయితే, ఆయన ఎవరిని ఎప్పుడు విమర్శిస్తారో? ఎప్పుడు ప్రసన్నం చేసుకుంటారో? ఎవరికీ అంతుచిక్కని విషయం. కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట వెనుక ఒక అర్థం, ప్రతి నడక వెనుక ఒక మాయాజాలం ఖచ్చితంగా ఉంటుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని చెబుతున్నారు. ఆయన ప్రస్తుత వ్యూహాలు మాత్రం ముందస్తుకు ప్రణాళికలో భాగమనే అభిప్రాయం ఉంది. మాటల తీవ్రత, ధర్నాలు అందులో భాగమే. కేసీఆర్‌ను అంచనా వేయడంలో విపక్షాలు విఫలం అవుతున్నాయి.
కేసీఆర్ కంటే పెద్ద వ్యూహకర్తనా?
సహజంగానే కేసీఆర్‌కు అపర చాణక్యుడిగా, అద్భుత రాజకీయ వ్యూహకర్త గా దేశంలో మంచి పేరుంది. ఇంచుమించు చాలా ఎన్నికలను ఆయన ఒంటిచేత్తో గెలిపించారు. ప్రశాంత్ కిషోర్ సలహాలు అవసరమైన సందర్భాలలో మాత్రమే తీసుకోవాలా? ఎన్నికల ముగింపు వరకు ఉంచుకోవాలా? అనే సందిగ్దంలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ రాజకీయంగా ఎవరితోనూ శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ శాశ్వతంగా ఉంచుకోరు.
అందుకే రాజకీయ వ్యూహంలో భాగంగానే ప్రస్తుతం కేసీఆర్ బీజేపీ మీద ఎన్నికల సైరన్ ప్రయోగిస్తున్నారు తప్ప, భయపడి చేస్తున్నారనడం ఎంత మాత్రం నిజం కాదు. పీకేలాంటివారి మస్తిష్కాలకి అందనంత ఎత్తులో కేసీఆర్ ఆలోచనలు ఉంటాయనే విషయం మరిచిపోకూడదు. నిజంగా తనకి ఇబ్బంది అని తెలిస్తే తన రక్షణ కొరకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే మనస్తత్వం గల మహా మొండి మనిషి సుమా కేసీఆర్!
డా. బి కేశవులు. ఎండీ
మనస్తత్వ, రాజకీయ విశ్లేషకులు
85010 61659