జన‘సేనాని’ ఆచితూచి అడుగులు...

by Ravi |
జన‘సేనాని’ ఆచితూచి అడుగులు...
X

ఆంధ్రప్రదేశ్‌లో ఈ వారం రాజకీయంగా రెండు కీలక పరిణామాలు జరిగాయి. రాబోయే సంవత్సరంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆదివారం అధికార వైసీపీ 13వ ఆవిర్భావ దినోత్సవం జరగగా, ఒకరోజు వ్యవధిలో మంగళవారం జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలు నిర్వహించడం రాజకీయ పార్టీలకు సర్వసాధారణమే అయినా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు ఆవిర్భావ దినోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా ఆవిర్భావ దినోత్సవాలు, ప్లీనరీ సమావేశాలను పార్టీలు పెద్దఎత్తున నిర్వహించడం రాజకీయాల్లో పరిపాటే. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణలో వారు పూర్తిగా వెకబడ్డారనే విషయం స్పష్టమవుతుంది. దానికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి వీస్తున్న ఎదురుగాలే. పార్టీ అధినేత జగన్‌ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం ట్వీట్‌కే పరిమితమయ్యారు తప్పా ఈ వేడుకల్లో ఆయన ఎక్కడా పాల్గొనలేదు. దీనికి భిన్నంగా జనసేన మచిలీపట్నంలో నిర్వహించిన 10వ ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఆర్భాటంగా, కోలాహలంగా జరిగింది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్‌ ప్రణాళిక వెల్లడించేందుకు సంపూర్ణంగా వినియోగించుకున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు.

విజయవాడ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నంలోని సభావేదికకు చేరుకోవడానికి వారాహి రథసారథి పవన్‌కు ఏడు గంటలు పట్టిందంటేనే అక్కడున్న జన ప్రభంజనం ఎలా ఉందో తెలుస్తుంది.

కట్టిపడేసిన జనసేన ఆవిర్భావ సభ

నేడు రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించడం ఒక ప్రహసనం. ప్రజలను తరలించడం మొదలుకొని, వారికి సపర్యలు, సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అన్నీ చేశాక వారిని సభా ప్రాంగణంలో కూర్చోబెట్టడం పెద్ద సవాలే. ప్రధాన వక్తలు ప్రసంగిస్తున్న సమయాల్లోనే ప్రజలు జారుకుంటున్న ఉదంతాలున్నాయి. దీనికి భిన్నంగా మచిలీపట్నంలో తేదీ మారాక కూడా (అర్థరాత్రి అయినా) సమావేశం కొనసాగింది. ఈ వ్యాసం రాసే సమయానికి... రాష్ట్రం నలుమూలల నుండి బహిరంగ సభకు హాజరైన జనసైనికులు వారి స్వస్థలాలకు చేరి ఉండకపోవచ్చు. సభకు వచ్చిన వారిని పవన్‌ తన ప్రసంగంతో కదలనీయకుండా నిలబెట్టగలిగారు. జన‘సేనాని’ పవన్‌ ప్రసంగం రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా నిలవడంతోపాటు ఆయన వేస్తున్న రాజకీయ అడుగులు కూడా ఆచితూచి వేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది.

బీజేపీది కప్పదాటు వైఖరి

జనసేన పార్టీ ఆవిర్భావ సమావేశంలో ఎన్నికలు, పొత్తులు తదితర అంశాలపై పార్టీ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తుపై కుండబద్దలు కొట్టారు. బీజేపీపై జనసేన సానుకూలంగా ఉన్నా... ఆ పార్టీ వైఖరితోనే తాము మరో ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ద్వంద్వ వైఖరితో కాకుండా సంపూర్ణంగా కలిసొస్తే ఏపీలో టీడీపీ అక్కర్లేనంతగా ఎదిగేవాళ్లమని చెప్పడం ద్వారా బీజేపీని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టడంలో విజయవంతం అయ్యారు. అమరావతి రాజధాని డిమాండ్‌తో నిస్వార్థంగా బీజేపీ పక్షాన నిలబడితే, ఆ పార్టీ వైసీపీతో కలిసి రాజధానిపై దోబూచులాడుతుందని బీజేపీని ఎండగట్టారు. తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు కోసం ముందుకొస్తే తనని ఆంధ్రావాడిగా చెబుతూ దూరం పెట్టారని, తెలంగాణలో తాను పనికి రానప్పుడు ఆ పార్టీకి అక్కడి ఆంధ్ర ఓట్లు ఎలా పనికొస్తాయని సూటిగా ప్రశ్నించారు. మొత్తం మీద ఈ సమావేశం ద్వారా బీజేపీనే తనకు తానుగా జనసేనను దూరం చేసుకుందనే విషయాన్ని పవన్‌ కుండబద్దలు కొట్టినట్లు ప్రజల ముందు ఉంచగలిగారు. బీజేపీ దోస్తీతో ముస్లిం ఓటు బ్యాంకు దూరమవడాన్ని కూడా గమనించిన పవన్‌ ఈ అంశాన్ని తెలివిగా తనవైపుకు మల్చుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ గతంలో బీజేపీకి దగ్గరయిన తాను ఆ పార్టీ కప్పదాటు వైఖరిని గమనించి దూరం పెట్టానని స్పష్టం చేశారు. అదే సమయంలో అవినీతి కేసులలో చిక్కుకున్న వైసీపీ బీజేపీ వంచన చేరుతుందని, తనను కాదని వైసీపీకి మద్దతుగా ఉంటారా అని పవన్‌ ముస్లింలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించారు. కేసులలో చిక్కుకున్న వారికి బీజేపీ అంటే భయం, ఎలాంటి తప్పులు చేయని నేను బీజేపీ అంటే భయపడను, రాష్ట్ర ప్రయోజనాలే నాకు ప్రధానం అని ఘంటాపథంగా చెప్పారు.

మనకెందుకు ఈ కులగజ్జి!

ముస్లిం సామాజిక వర్గమే కాకుండా రాష్ట్రంలో కుల రాజకీయాలను కూడా పవన్‌ ఎండగట్టారు. కుల కుంపట్లతో వైసీపీకి ప్రయోజనం చేకూర్చవద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కులాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందని చెబుతూ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని వారిని మానసికంగా త్యాగాలకు సిద్ధం చేశారు. కాపు ఆరాధ్యమైన వంగవీటి మోహన్‌ రంగానే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచును పెళ్లి చేసుకుంటే లేనిది ఆయన పేరు చెప్పుకునే మనకెందుకు ఈ కులగజ్జి అన్నారు. రాష్ట్రంలో ఎప్పటి నుండో సాగుతున్న కాపు, కమ్మ వైరాన్ని తగ్గించేలా ప్రసంగించారు. అగ్రకులాల్లోని పేదలను కూడా ఆకట్టుకునేలా వారి సాధకబాధకాల గురించి ప్రస్తావించారు. జనసేన అనగానే కాపు సామాజికం అనే భావన ఉన్న నేపథ్యంలో.. పవన్‌ ఈ సమావేశంలో ఇతర కులాల గురించి ప్రస్తావించి ఉండవచ్చు.

వైసీపీ 'కుల' వ్యూహంలో చిక్కుకోను

పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సుదీర్ఘంగా కులాల గురించి జనసేనా అధినేత పవన్‌ ప్రసంగించడం పట్ల మేధావులు, రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రానంతరం కూడా కులాల గురించి పార్టీ అధినేతనే ప్రస్తావించడం సిగ్గు చేటని వారు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ రాజకీయ విధానాలపై మాట్లాడాలే తప్ప కులాల గురించి ప్రస్తావించడాన్ని ప్రజలు ఆమోదించరు. ఇప్పటికైనా జనసేనాని కులాల ప్రస్తావనకు స్వస్తి పలికి రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు, అజెండా గురించి ప్రస్తావిస్తే రాష్ట్ర ప్రజల్లో ఆ పార్టీపై సదభిప్రాయం ఏర్పడే అవకాశాలుంటాయి.

జనసేనాని పవన్‌ ప్రసంగం గతంలో కంటే భిన్నంగా సాగింది. కాపు, ఎస్సీ, ఎస్టీ నేతలతో తనపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడాన్ని ప్రస్తావించిన ఆయన, తాను రెచ్చిపోకుండా వారి వ్యూహంలో చిక్కుకోకుండా ఉంటానని అన్నారు. 175 స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ విసిరిన సవాళ్లను ఆయన తిప్పికొట్టారు. ప్రజలు కోరుకునే విధంగా ముందుకు సాగుతామని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనీయమన్నారు. తమకు బలమున్న మేరకు బరిలోకి దిగుతామని, అన్ని చోట్ల పోటీ చేయండని చెప్పడానికి వారెవరని.. ఎదురు ప్రశ్నించారు. ఇదేసమయంలో తమతో జనసేన పొత్తు ఖాయమనే అభిప్రాయంతో టీడీపీ బేరసారాలకు పాల్పడే అవకాశాలున్నాయని గుర్తించిన పవన్‌ వారిని కూడా సుతిమెత్తగా హెచ్చరించారు. చంద్రబాబు పట్ల తనకు ప్రత్యేక ప్రేమ లేదని, కేవలం ఆయన అనుభవాన్ని గౌరవిస్తానని చెబుతూనే పార్టీ, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టమని ప్రకటించడం ఆలోచించాల్సిన విషయం. రాష్ట్రంలో త్వరలోనే వారాహి వాహనం ద్వారా విస్తృతంగా పర్యటిస్తానని, అనంతరం ప్రతి నియోజకవర్గంపై శాస్త్రీయంగా పరిశోధనలు, సర్వేలు నిర్వహించి దానికి అనుగుణంగానే ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు.

పవన్ వైఖరిలో స్పష్టత

జన‘సేనాని’ పొత్తుల విషయంలో వైసిపి విమర్శలకే కాకుండా జగన్‌ ప్రభుత్వ ప్రత్యర్థులకు కూడా ఈ సభ ద్వారా చురకలేశారు. ప్రధానంగా టిడిపి రాజకీయ గురువులుగా పేరుగాంచిన పత్రికాధిపతుల వ్యవహార శైలిని కూడా ఆయన ఎండగట్టారు. ప్యాకేజీలు అందాయని, ఇతర రాష్ట్రాల నేతల ప్రయోజనాలకు పని చేస్తున్నామని వ్యాసాలు, కామెంట్లు రాసే వారు తమ సహనాన్ని బలహీనంగా తీసుకోవద్దని ఘాటుగానే వారికి బదులివ్వడంతో పాటు హెచ్చరికలు జారీ చేశారు.

రాజకీయాలంటే సినిమాలు కాదని, పవన్‌ది నిలకడలేని వ్యక్తిత్వమని ఇప్పటివరకూ వస్తున్న అన్ని విమర్శలకు ఆయన ఈ 10వ ఆవిర్భావ సభ ద్వారా పటాపంచలు చేశారని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా మారాలనే తపన ఆయనలో కనిపించింది. రాష్ట్రంలో వైసీపీని అధికారం నుండి దింపాలంటే జనసేన సహకారం తప్పనిసరి అనే సందేశాన్ని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన ఈ బహిరంగ సభ ద్వారా ఇచ్చారు.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

రీసెర్చర్, పీపుల్స్ పల్స్ సంస్థ

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672



Next Story