- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా ఆరోగ్యానికి మహర్ధశ!
ఆరోగ్యమే మహాభాగ్యం. సమాజ వికాసానికి మానవుని శారీరక, మానసిక ఆరోగ్యమే మూలాధారం. ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేపింది. కుల, మత, పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ పథకం ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తుండడం గొప్ప పరిణామం. ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఈ పథకం ద్వారా సుమారు యాబై లక్షల మంది పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడం విశేషం. వీరంతా గుండె, కిడ్నీ లాంటి అనేక జబ్బులకు ఆపరేషన్లు చేయించుకున్న వారే కాకుండా, అనేక ప్రాణాపాయ జబ్బులకు వైద్యం పొందిన వారు కావడం గమనార్హం. ప్రజలను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు... బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులకు గురైన రోగులకు వారి స్వగ్రామాలకు వెళ్ళి ఉచితంగా మందులు సరఫరా చేసేందుకు డాక్టర్ వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108,104 వాహనాలు వైద్య చరిత్రలో గొప్ప మైలు రాళ్లగా నిలిపోయాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు రాజశేఖర్ రెడ్డి చేసిన కృషిని చిరస్మరణీయంగా భావించవచ్చు. అంతకు రెట్టింపు స్థాయిలో రాజశేఖర్ రెడ్డి కుమారులైన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తూ ఉండడం శుభపరిణామం.
ఇంటి ముందటికే వైద్యం
రాష్ట్రంలో పడకేసిన ప్రభుత్వ వైద్య రంగానికి నాడు నేడు పధకం ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పునరుజ్జీవం కల్పించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం ద్వారా ఇంటి వద్దకే వైద్యాన్ని చేర్చే బృహత్తర కార్యానికి జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టి యావత్తు దేశాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్లు చేయడం గమనార్హం. రాష్ట్రంలోని కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలలోని ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం కల్పించాలనే బృహత్తర సంకల్పంతో ముఖ్యమంత్రి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించినట్లు ప్రభుత్వ వైద్యాధికారులు తేటతెల్లం చేస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో అయిదు విడతలుగా 45 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మొదటి విడతగా ఆశా వర్కర్లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలోని ప్రతి వ్యక్తికి బీపీ, షుగర్, రక్తహీనత, మూత్ర పరీక్ష లాంటి ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల ద్వారా అనారోగ్యానికి గురైన వ్యక్తిని గుర్తించి వారికి పరిసర ప్రాంతాలలో స్పెషలిస్ట్ డాక్టర్‌ల ఆద్వర్యంలో జరిగే వైద్య శిబిరానికి రమ్మని తేదీ కేటాయిస్తారు.
రాష్ట్రమంతటా వైద్య శిబిరాలు
నవంబర్ 15వ తేదీ వరకు 45 రోజుల పాటూ రాష్ట్రంలోని 10,032 వై.ఎస్. ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 542 అర్బన్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా వైద్య శిబిరాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆ ఆరోగ్య శిబిరాలలో రోగులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక జబ్బులకు అక్కడికక్కడే ఉచితంగా నెల వారి మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. గుండె,లివర్, కిడ్నీ లాంటి జబ్బుల బారీన పడిన రోగులతో పాటూ ఇతర జటిలమైన రోగులను దగ్గరగా ఉన్న ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు తరలించి వారికి ప్రభుత్వ వైద్య సిబ్బంది దగ్గరుండి తగిన వైద్యం చేయిస్తుంది. జబ్బు నయమయ్యేమంత వరకు సంబంధిత వైద్య సిబ్బంది వారికి చేయూత నిస్తుంది. అదే సమయంలో వైద్య శిబిరాలకు వచ్చిన ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం యొక్క ప్రాముఖ్యత గురించి, అవసరమైనప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలి, ఎవరిని సంప్రదించాలి అనే విషయాలపై వైద్య సిబ్బంది పూర్తి అవగాహన కల్పిస్తారు.
గతంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1,056 జబ్బులకు వైద్యం అందించగా నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 3,256 జబ్బులకు వైద్యం అందిస్తోంది. అదేవిధంగా గతంలో 915 ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం లభించగా ప్రస్తుత ప్రభుత్వం వాటి సంఖ్య 2,200 ఆసుపత్రులకు విస్తరింపచేసింది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడంతో పాటూ ప్రస్తుతం జబ్బు చేసిన రోగులకు కూడా తగిన వైద్యం అందించే అవకాశం అధికంగా ఉంది. తద్వారా రాష్ట్రం త్వరలోనే ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారే పరిస్థితులు స్పస్టంగా కనిపిస్తున్నాయి.
కైలసాని శివప్రసాద్
సీనియర్ జర్నలిస్ట్ & కాలమిస్ట్
94402 03999