- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ బ్యాంకు రుణం కోసమే ఈ సంస్కరణలా?
భారతీయ సంస్కృతి వికసిత కమలం. అందులోని ప్రతి రేకు మన ప్రాంతీయ భాషాల్లాంటివి. ఒక్క రేకును నాశనం చేసినా మొత్తం పుష్ప సౌందర్యమే పాడవుతుంది అని రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని, భాష వైవిధ్యాన్ని సుందరంగా అభివర్ణించారు. ఎవరికైనా సొంత భాషలోనే ఆలోచనా సామర్థ్యాలు అత్యంత ఉధృతంగా ఉంటాయి.ప్రాథమిక విద్య మాతృభాషలో సాగితే మేధ మరింతగా వికసించే అవకాశాలు అధికం. పిల్లలు చదువులో రాణించడానికి, బోధనా మాధ్యమానికి అవినాభావ సంబంధం ఉంది. స్థానిక భాషల్లో చదువుకునే అవకాశం లేకపోవడం వలన పరిశోధనలు, ఇతర విద్యా రంగాల్లో దేశ సామర్థ్యాన్ని ఐదు శాతానికి మించి వినియోగించుకోలేకపోయాం. స్థానిక భాషల్లో విద్యను అందించడం వలన దేశీయ మేధో సామర్ధ్యాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవచ్చు అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో మాతృభాషలో విద్యాభ్యాసానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.
కానీ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు ముసుగులో ప్రపంచ బ్యాంకు నిర్దేశిత షరతులకు అనుగుణంగా తెస్తున్న సంస్కరణలు విద్యా వ్యవస్థకే పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. విద్యా రంగంలో ప్రభుత్వం తెచ్చిన జీవోలు 117, 172 జాతీయ విద్యా విధానం 2020లో పేర్కొన్న అనేక అంశాలకు పూర్తి విరుద్ధంగా, సరికొత్త సమస్యలు రేకెత్తించేవిగా ఉన్నాయి.
భారతదేశం ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదుగుతున్న క్రమంలో మానవ విజ్ఞాన శాస్త్రాలకు, కళలకు ఎంతో డిమాండ్ ఏర్పడుతోంది. నిజానికి వేగంగా మారుతున్న ఉపాధి రంగం, ప్రపంచ జీవావరణ వ్యవస్థల వల్ల పిల్లలు కేవలం నేర్చుకుంటే సరిపోదు. అందువల్ల విద్యతో పాటు, తార్కికంగా ఎలా ఆలోచించాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి, సృజనాత్మకంగా ఎలా ఉండాలి, బహు శాస్త్ర విషయాలను ఎలా నేర్చుకోవాలి, పరిశోధనాత్మకంగా ఎలా ఉండాలి, నూతన విధానాలను ఎలా అవగాహన చేసుకోవాలి అనే దిశలో బోధన సాగాలని జాతీయ విద్యా విధానం నిర్దేశించింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న 10+2 పాఠశాల విద్యా పద్ధతి స్థానంలో 3 నుంచి 18 వయసు విద్యార్థుల కోసం 5+3+3+4 పద్ధతిని ప్రవేశ పెట్టారు. ప్రతి విద్యా సంవత్సరం పరీక్షలకు బదులుగా , పాఠశాల విద్యార్థులు 2, 5 మరియు 8 తరగతులలో మూడు పరీక్షలకు మాత్రమే హాజరవుతారు. 2 నుండి 8 ఏళ్ల వయసు పిల్లలు చాలా వేగంగా భాషలను నేర్చుకుంటారని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
నిర్బంధ భాషా బోధన రుద్దుతారా?
మాతృ భాషకు ప్రాధాన్యతనిస్తూ, త్రిభాషా సూత్రం అమలు చేస్తూ, పిల్లలకు వివిధ భాషలను పునాది స్థాయి నుండే తప్పనిసరిగా నేర్పించాలని, నిర్బంధంగా ఎలాంటి భాషా రుద్ద కూడదని జాతీయ విద్యా విధానం 2020 సూచించింది. విద్యార్థులందరూ తమ పాఠశాలలో మూడు భాషలను నేర్చుకోవాలని పాలసీ సిఫార్సు చేస్తోంది. మూడు భాషల్లో కనీసం రెండైనా భారతీయ భాషలై ఉండాలి. మన రాష్ట్రంలో ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్లంలో బోధనను తప్పనిసరి చేశారు, మాతృభాషలో బోధన లేదని తేల్చేశారు. ఇది జాతీయ విద్యా విధానం స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకం. ప్రపంచ బ్యాంకు షరతులకు అనుకూలం. నూతన విద్యా విధానం పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తే, దాని అమలు ముసుగులో, ప్రపంచ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ విధానాలను అవలంబిస్తూ పాఠశాల విద్యను సామాన్యులకు దూరం చేస్తోంది. ప్రపంచ బ్యాంక్ 250 మిలియన్ యూఎస్ డాలర్ల రుణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన రాజపత్రం (గెజెట్ నెం 143 ) పరిశీలిస్తే ప్రభుత్వంలోని రాజకీయ పెద్దలు చెబుతున్న అనేక అవాస్తవాలు తేటతెల్లం అవుతాయి. దీనిలో ఉపాధ్యాయుల నియామకంపై ఆంక్షలు, పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలనే నిబంధన, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలనే షరతులు ఉన్నాయి.
ప్రైవేటు బడులకు పీఛేమూడ్
నూతన జాతీయ విద్యా విధానం ఉద్దేశ్యమైన సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే విద్య అందుబాటులో ఉండాలి. రాష్ట్రంలో 34,000 ప్రాథమిక పాఠశాలలు, 6,400 ప్రాథమికోన్నత పాఠశాలలు, 6,400 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉంటే, తరగతులు, పాఠశాలల విలీనం వల్ల దాదాపు 10 వేల పాఠశాలలు మూతబడ్డాయి. అందుబాటులో పాఠశాలలు లేనందువల్ల విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎన్ఈపి అమలు చేసినా ఎక్కడా ఒక్క అంగన్‌వాడీ కేంద్రంగానీ, స్కూలు గానీ మూతపడకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా తరగతులను తరలించడం, పాఠశాలలను విలీనం చేయడం, ఏకైక ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం వల్ల సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం మరింత దూరం అవుతోంది. 2020 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నా ఈఏడాది 3 లక్షల 98 వేల మంది పిల్లలు ప్రభుత్వ బడుల నుండి ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. ఎయిడెడ్ నుండి ప్రభుత్వ బడుల్లో చేరిన 90 వేల మందిని మినహాయిస్తే ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య మరింత తగ్గుతుంది. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన విధంగా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పి పి పి) అమలు చేయడం వలన విద్య క్రమంగా కార్పొరేట్ సంస్థల అధీనంలోకి వెళ్లి, పేదలకు నాణ్యమైన విద్య లభించడం గగన మౌతుంది.
నూతన విద్యా విధానం ప్రకారం టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 130, మాధ్యమిక స్థాయిలో 135, సెకండరీ స్థాయిలో 140 ఉండేలా చూడాలి. పైన పేర్కొన్న జీవోలలో విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి (పిటిఆర్) ప్రతికూలంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు 47.56 శాతం, మాధ్యమిక పాఠశాలలు 17.93 శాతంగా పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 39,000, మాధ్యమిక పాఠశాలల్లో 11,888 మొత్తం 50,888 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా ప్రభుత్వం తెలిపింది. కానీ సంస్కరణల పేరుతో, ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి పెంచుకుంటూ పోయి ప్రస్తుతం 717 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చూపడం జిమ్మిక్కులు తప్ప వేరేమీ కాదు. ప్రపంచ బ్యాంక్ రుణం కోసం ఖర్చు తగ్గిస్తామనే నిబంధనను అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా 4,764 ఎస్టీజీ, 1,160 ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులు రద్దు చేశారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా బైజూస్‌తో ఒప్పందం చేసుకోవడం కూడా వరల్డ్ బ్యాంక్ షరతులలో భాగమే. జగన్మోహన్ రెడ్డి ఎంతో ఘనంగా చెప్పుకునే అమ్మ ఒడి, విద్యా దీవెన పధకాల అస్తవ్యస్త అమలు కూడా విద్యార్థులకు నష్టం కలిగిస్తోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇలాగా?
చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలలలో ఉచితంగా విద్య అందించారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం క్రింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటాలో సీట్లు పొందే తల్లిదండ్రులు అమ్మఒడి సాయం నుంచే ఫీజులు చెల్లించాలని ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి నేరుగా ప్రభుత్వమే ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు చెల్లిస్తే విద్యార్థులకు మరింత మేలు చేకూరుతుంది. కళాశాల విద్యలో చంద్రబాబు ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నేరుగా ఆయా కళాశాలలకు జమచేయడం వలన ఫీజు చెల్లింపు విద్యార్థుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం, కళాశాలల మధ్య వ్యవహారంగా ఉండేది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడతల వారీగా 10 .50 లక్షల మందికి విద్యాదీవెన పేరుతో ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తే, వారు కళాశాలలకు చెల్లించాలి. జగనన్న విద్యాదీవెన మొదటి విడత కింద చెల్లించాల్సిన సుమారు రూ. 700 కోట్లు ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. డబ్బును తల్లుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నందున దీంతో తమకు సంబంధం లేదని, వెంటనే ఫీజులు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఫీజుల చెల్లింపులో జాప్యం కారణంగా గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
కేవలం రూ. 6800 కోట్ల రుణం కోసం నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నామని నమ్మబలుకుతూ, ఆ విద్యా విధానానికి వ్యతిరేకంగా, ప్రపంచ బ్యాంకు షరతులను పాటిస్తూ విద్యా రంగంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెస్తున్న వినాశకర సంస్కరణలు భవిష్యత్తులో విద్యారంగానికి శాపంగా పరిణమించే అవకాశం ఉంది. విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విపరీత విధానాల దుష్ఫలితమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ నివేదికలో ప్రాథమిక విద్యాభ్యాసంలో ఆంధ్రప్రదేశ్ 39.2 % స్కోరుతో చివరి (29 వ) స్థానంలో నిలవడం. మేధావులు, విజ్ఞులు, ప్రజాస్వామ్య వాదులు ఇప్పటికైనా స్పందించక పోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి.
లింగమనేని శివరామ ప్రసాద్
7981320543
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672