జననాడి: అశాంతిలో యువత, అయోమయంలో భవిత!

by Ravi |   ( Updated:2023-01-24 02:23:22.0  )
జననాడి: అశాంతిలో యువత, అయోమయంలో భవిత!
X

పెరిగే నిరుద్యోగిత భారతదేశాన్ని భయపెడుతోంది. పేరున్న బడా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్‌ కంపెనీలు వేలాది మంది ఉద్యోగుల్ని పీకేస్తుంటే ఉన్నపళంగా వారు రోడ్డున పడుతున్నారు. మరోవైపు 'మేం పెద్ద ఎత్తున్న ఉద్యోగ నియామకాలు జరుపబోతున్నామం'టూ ప్రభుత్వాలు ఉత్తుత్తి ప్రకటనలతో ఊదరగొడుతున్నాయి. అదే నిజమైతే, నియామకాలు ఇన్నాళ్లెందుకు జరుపలేదు? అనే ప్రశ్న సహజం! ఇవి ఎన్నికల, ఎన్నికల ముందరి సంవత్సరాలు కావడంతో ...క్షేత్ర పరిస్థితులకు, వాస్తవాలకు విరుద్ధంగా పాలకులు మాయమాటలు చెప్పడం ఓ రాజకీయ తంతుగా మారింది! దేశంలో పేద, ధనికుల మధ్య పెరుగుతున్న అంతరానికి ప్రభుత్వ విధాన లోపాలు ఓ కారణమైతే, నిరుద్యోగిత అంతే ముఖ్యమై నిలుస్తోంది. ఫలితంగా పేదలు ఇంకా పేదరికంలోకి జారిపోతున్నారు. ధనికులు మరింత సంపన్నులై సంపద పోగుజేస్తున్నారు. చేసేందుకు పని లేక, బతుకు గడవక యువత తీవ్ర నిరాశ, అంతులేని అశాంతికి గురవుతున్నారు.

సమాజంలో ఆర్థిక అంతరాలు అసాధారణ స్థాయికి పెరుగుతున్నాయి. పనిచేసే వయసు, సత్తా, సామర్థ్యం కలిగిన యువశక్తి (డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌) ప్రపంచంలోనే అధికంగా ఉండి కూడా భారతదేశం నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రగతి కుంటుబడుతోంది. మితిమీరి జనాభా వృద్ధి ఒకవైపు, పెరిగే నిరుద్యోగిత మరోవైపు... భారత్‌కు భవిష్యత్తు పట్ల భయం పుట్టిస్తున్నాయి. ఇవి రాజకీయ పక్షాలు పరస్పరం చేసుకునే పోరంబోకు విమర్శలో, తిట్ల పురాణాలో కావు! ఇక్కడ ముచ్చటిస్తున్న ప్రతి అంశానికీ లోతైన అధ్యయనాలు, పకడ్బందీ నివేదికలు, బలమైన సాక్ష్యాధారాలున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా బడా ఐటీ, సాప్ట్‌వేర్‌, డిజిటల్‌ కంపెనీలు ఇటీవల పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ పదివేల మందిని తొలగించింది. 28 ఏళ్ల చరిత్రలోనే తొలిసారి 18000 మంది ఉద్యోగుల్ని వదిలించుకునేందుకు అమెజాన్‌ సంసిద్ధమైంది. గూగుల్‌ 12000 మంది ఉద్యోగుల్ని, లేదా తన ఉద్యోగుల్లో 6 శాతం మందిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది. వేల సంఖ్యల్లోనే కాకుండా వందల స్థాయిలో... విప్రో 800 మందిని, స్విగ్గీ 380 మందిని కూడా పంపించివేస్తున్నాయి. మన దేశంలో నెలరోజుల్లో వందకు పైగా కంపెనీలు సుమారు 30వేల మందిని తొలగించినట్టు లెక్కలున్నాయి. ఒకవైపు కమ్ముకొస్తున్న ఆర్థిక మాంద్యం, మరోవైపు టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ వల్ల ఉద్యోగులందరూ నైపుణ్యాలు మెరుగుపరచుకొని నిలదొక్కుకోకపోవడమే ఈ తొలగింపులకు బలమైన కారణంగా ఆయా కంపెనీలు చూపిస్తున్నాయి.

నిజానికి, గడచిన ఒకటిన్నర దశాబ్దాల కాలంలో (2008 తర్వాత) ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ప్రాథమిక అవసరాలు తీరాయి. ఇక ఇప్పుడా విస్తరణ లేకపోవడం, పైగా ఎగుమతులకు తగిన ఆర్డర్లు లభించనందునే... ఆర్థిక భారం దించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకోపక్క లక్షలాది ఉద్యోగాల కల్పనకు సిద్దమవుతున్నామని నరేంద్ర మోదీ నేతృత్వపు కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి కనుక పెద్దఎత్తున ఉద్యోగ కల్పన సాధ్యమని తెలంగాణలో మంత్రి కేటీఆర్‌ వంటివారు ప్రకటిస్తున్నారు. పలు శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా తగినన్ని నోటిఫికేషన్లు రావటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏం లేదు.

ప్రమాదకర స్థాయిలో నిరుద్యోగిత

కోవిడ్‌ మహమ్మారి ప్రభావం తర్వాత 2022లో పరిస్థితి కాస్త మెరుగయిందని ఊరట చెందుతున్న తరుణంలో, పలు బహుళజాతి కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం యువతను, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. కోవిడ్‌ వల్ల 2020 లోనే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు ఊడినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) చెప్పింది. కోవిడ్‌ రెండో అల కాలంలోనే దేశంలో దాదాపు కోటి ఉద్యోగాలు పోయినట్టు, 97 శాతం కుటుంబాల రాబడి ఎంతోకొంత కోతకు గురయినట్టు నివేదికలున్నాయి. ఇప్పుడు దేశంలో నిరుద్యోగిత 8.33 శాతంగా నమోదవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 7.44 శాతం కాగా, నగరాలు, పట్టణాల్లో గత నెలాఖరుకి ఇది 10.09 శాతానికి చేరింది. కోవిడ్‌ కన్నా ముందరి స్థితిలో దేశంలో నిరుద్యోగిత 6 శాతంగా ఉండేది! ఊడే ఉద్యోగాలు, పెరిగే నిరుద్యోగిత సహజంగానే పౌరుల కొనుగోలు శక్తిని మందగింప చేస్తుంది. ఇది ప్రయివేటు పెట్టుబడుల్ని నిరుత్సాహపరచడమే కాకుండా వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులంటున్నారు.

ఈ సంవత్సరం 7 శాతంగా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు రాగల రోజుల్లో 6 కన్నా తక్కువకు పడిపోయే ప్రమాదాన్ని నిపుణులు అంచనావేస్తున్నారు. ఐరోపా, అమెరికాల్లో బలపడుతున్న భయంకర ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో భారత్‌ ఒక 'బ్రైట్‌ స్పాట్‌' అనే భావన ఇప్పటివరకుండిరది. ఇంజనీరింగ్‌, వస్త్రోత్పత్తి, సాఫ్ట్‌వేర్‌ తదితర రంగాలను కలుపుకొని ఎగుమతుల ఆధారిత తయారీ రంగంలో మందగమనం దేశంలో ఉద్యోగావకాశాల్ని రమారమి తగ్గించింది. ఐటీ, సాఫ్ట్‌వేర్‌, విద్య, రిటైల్‌ బిజినెస్‌ రంగాల్లో ఉపాధి కల్పన 28 శాతం పడిపోయినట్టు దేశంలోనే అతిపెద్ద నిరుద్యోగ సహాయక సైట్‌, 'నౌకరీ.డాట్‌కామ్‌' చెప్పింది.

గుబులు పుట్టించే అంతరాలు

పెరిగే ఆర్థిక అంతరాలు సామాజిక అసమానతను, అశాంతిని పెంచిపోషిస్తున్నాయి. ఏదైనా పోల్చి చూసుకునే మానవ నైజం, అంతటా అశాంతికి కారణమౌతోంది. పేద, సంపన్నుల మధ్య ఇటీవలి కాలంలో, మరీ ముఖ్యంగా గత మూడు నాలుగేళ్లలో పెరుగుతున్న అంతరాలు ప్రపంచ వ్యాప్తంగా, అందులోనూ భారత్‌లో ఇంకా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. దావోస్‌ ఆర్థిక సదస్సులో తొలిరోజు విడుదల చేసిన ఆక్స్‌ఫామ్‌ నివేదిక ఆందోళన కలిగించింది. ప్రపంచ జనాభాలో ఒక శాతంగా ఉన్న అతి ధనవంతుల చేతుల్లోకి, మొత్తం 67 శాతం ప్రపంచ సంపద చేరింది. మన దేశంలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. ఒక శాతంగా ఉన్న అతి సంపన్నుల చేతిలో 40 శాతం సంపద ఉంది. పై అంతస్థుల్లో ఉండే 10 శాతం సంపన్న జనాభా చేతిలో 80 శాతం సంపద ఉంటే, 40 శాతంగా ఉన్న మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారి వద్ద ఉన్న సంపద 17 శాతం. ఇంకా దారుణం ఏమంటే, కింది అర్ధ భాగంలోని 50 శాతం దేశ జనాభాకు దక్కుతున్నది కేవలం 3 శాతం సంపద మాత్రమే! అందరికీ చెందిన ప్రకృతి సంపదను, సహజ వనరుల్ని సుసంపన్నులు, కార్పొరేట్లు పిండుకొని ఆర్థికంగా బలిసిపోతుంటే, అడుగున ఉండే పేదలు దయనీయ స్థితిలో మరింత పేదరికం వైపు జారిపోతున్నారు.

అభివృద్ధి చెందిన సమాజాలతో పోల్చి చూస్తే సంపద పన్ను విధానాలు కూడా మనదగ్గర సవ్యంగా లేవు. ఇక 2021-22 లో దేశం మొత్తం రూ 14.88 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు కాగా, అందులో 62 శాతం ఆదాయసూచీలో అడుగునున్న 50 శాతం మంది సామాన్యుల నుంచి వచ్చిందే! పై పొరలోని 10 శాతం సంపన్నుల నుంచి జీఎస్టీ రూపంలో వచ్చింది కేవలం 3 శాతమే! ఏటా పెరుగుతున్న నిరుద్యోగిత మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాల వారిని మరింత కృంగదీస్తోంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు ప్రాధాన్యతల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి యువత తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. వారి అశాంతి ఏ విపరిణామాలకైనా దారితీయవచ్చన్నది సామాజికవేత్తల ఆందోళన!

రెండు తీర్లుగా జనాభా ప్రభావం

జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు వారే ఉండటం వల్ల ప్రపంచంలోనే పెద్ద యువశక్తి దేశంగా మనకొక ఘనత ఉంది. జనాభా అసాధారణ వృద్ధి వల్ల తొందర్లోనే చైనాను కూడా అధిగమించే స్థితిలో ఉన్నాం. పనిచేసుకొనే సత్తువగల వారి సంఖ్య ఆధిక్యత వల్ల దీన్ని సానుకూలాంశంగానూ సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి చైనా, జపాన్‌, కొరియా, యూరోపియన్ యూనియన్‌లో లేదు. వేర్వేరు కారణాల వల్ల ఆయా దేశాల్లో వృద్ధుల సంఖ్య, అంటే ఉత్పత్తికి తోడ్పడేలా పనిచేయడం కాకుండా ఇతరులపై ఆధారపడే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. గడచిన 4 దశాబ్దాల్లో జనాభా నియంత్రణలో చైనా గణనీయమైన ప్రగతి సాధించింది. 2050 నాటికి భారత్‌ జనాభా 166 కోట్లు దాటితే, చైనా జనాభా 133 కోట్లకు పరిమితమౌతుందని యూఎన్‌ పరిశీలన! ఇంతటి జనాభా విస్పోటనంలో... సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ముంచుకొచ్చే ప్రమాదాన్ని మన రాజకీయ, పాలనా వ్యవస్థ గ్రహించటం లేదు.

కోవిడ్‌ తర్వాత సుమారు 2 కోట్ల మంది తిరిగి ఉద్యోగాల్లో, ఉపాధి పనుల్లో చేరారని, దాంతో కోవిడ్‌ పూర్వపు (41 కోట్ల మంది మొత్తం ఉద్యోగుల) స్థితికి చేరినట్టు ముంబాయికి చెందిన 'సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ' (సీఎంఐఈ) సంస్థ చెబుతోంది. అదే సమయంలో, గత డిసెంబరు మాసాంతం నాటికి దేశవ్యాప్తంగా 3.7 కోట్ల మంది ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, ఆటో తదితర రంగాల్లో కొంత ఆశాజనకంగా ఉన్నా... ఐటీ, సాఫ్ట్‌వేర్‌, విద్య, రిటైల్‌ వంటి రంగాల్లో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. నిరుద్యోగితను అధిగమించడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. జనాభాను నియంత్రించాలి. పనికి యోగ్యులైన వారిలో తగిన చదువు, నైపుణ్యాలుండేలా చూసుకోవాలి. ఉద్యోగ, ఉపాధి, కార్మిక కేంద్రీకృత ప్రయివేటు రంగాల్లో పెట్టుబడులు తగ్గకుండా, నిర్మాణ, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెరిగేట్టు చూసుకోవాలి. ఇవన్నీ ఏకకాలంలో చేస్తేనే నిరుద్యోగిత నుంచి దేశానికి విముక్తి దొరుకుతుంది. భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది.

ఆర్‌.దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

[email protected]

9949099802

Also Read...

ఆడపిల్లలపై వివక్షను నిర్మూలించాలి


Advertisement

Next Story